Vidadala Rajini : మళ్లీ పేటకు వచ్చేసిన విడదల రజని
విడదల రజని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. అనతికాలంలోనే మంత్రి స్థాయికి ఎదిగారు. తెలంగాణ నేపథ్యం ఉన్న విడదల రజని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఎన్నారైని పెళ్లాడారు. దీంతో ఆమె ఆంధ్రా ఇంటి కోడలయ్యారు. టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అండదండలతో టీడీపీలో అడుగు పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించారు. కానీ ఆమెకు టీడీపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో ఆమెకు తిరుగే లేకుండా పోయింది.
2019లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విడదల రజని.. ఘన విజయం సాధించారు. జగన్ రెండో విడత మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. వైద్య,ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. అయితే 2024 ఎన్నికల నాటికి విడదల రజనిని చిలకలూరిపేట నుంచి తప్పించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. వాస్తవానికి చిలకలూరిపేటలో విడదల రజని మంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. తనకున్న తెలివితేటలతో టీడీపీని తొక్కేసి సొంతబలాన్ని, బలగాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అయితే అధిష్టానం ఆదేశాలతో ఆమె పేటను వదిలేసి గుంటూరు వెస్ట్ వెళ్లక తప్పలేదు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అక్కడ టీడీపీ గెలుస్తూ వస్తోంది. అలాంటి చోట గెలవడం అంత ఈజీ కాదని విడదల రజనికి తెలుసు. కానీ అధిష్టానం ఆదేశించడంతో అయిష్టంగానే అక్కడి నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడింది. మరోవైపు ఆమెపై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. అధికారంలో ఉన్నప్పుడు పలువురి దగ్గర ఆమె వసూళ్లకు పాల్పడినట్లు వార్తలొచ్చాయి. కొంతమంది బహిరంగంగానే విడదల రజనికి తాము డబ్బు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో కొంతమందితో ఆమె సెటిల్ చేసుకున్నారు.
గుంటూరు వెస్ట్ కు తీసుకొచ్చి తనను బలిపశువును చేశారని ఆమె జగన్ తో పాటు సజ్జల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆమెను మళ్లీ చిలకలూరిపేట ఇన్ ఛార్జ్ గా నియమించింది హైకమాండ్. వాస్తవానికి చిలకలూరిపేట బాధ్యతలు ఇవ్వకపోతే విడదల రజని పార్టీని వీడతారని ఆమె సన్నిహితులు కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నారు. కేసులు చుట్టుముడుతుండడంతో వాటి నుంచి బయటపడాలంటే వైసీపీని వీడడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చారు. అయితే ఇతర పార్టీల నుంచి ఆమెను చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఆమె వైసీపీలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆమెకు మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించడంతో కేడర్ సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది.