వరదసాయంలోనూ క్రెడిట్ ఫైటా...?
విజయవాడలో వరదలతో జనం నానా కష్టాలు పడుతుంటే... అధికార, విపక్ష పార్టీలు మాత్రం క్రెడిట్ ఫైట్ చేస్తున్నాయి. సాదారణంగా వర్షాలు, వరదలు వచ్చినప్పుడు విపక్షం ... బాధితులకు అండగా పర్యటనలు చేస్తుంది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ.. పనిలోపనిగా విమర్శలు చేయడం సాదారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఏపీలో మాత్రం ఇది రాజకీయ పోరాటంగా మారిపోయింది. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా వరద బాధితులకు అందుతున్న సాయం అంతంత మాత్రమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.
ప్రభుత్వం చేతకాని స్థితిలో ఉందని, ఇంతటి అమానవీయత చంద్రబాబుకే సాధ్యం అంటూ వైఎస్ జగన్ సుదీర్ఘంగా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. మొత్తం 8 ప్రశ్నలు విసిరారు.మీరు ఆదుకోకుంటే పార్టీ తరపున పోరాటం చేస్తామన్నారు జగన్. జగన్ ట్వీట్ కు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీరు ఈ ట్వీట్ బెంగళూరులో ఉండి వేసారా? లండన్ లో ఉండి వేసారా? అని ఎద్దేవా చేస్తూ కౌంటర్ పోస్ట్ చేసింది. గత ఏడు రోజులుగా వరదలో కూడా బురద రాజకీయం చేస్తున్న నీ రోత రాజకీయానికి సమాధానాలు.. ఇవే అంటూ కౌంటర్ ఇచ్చింది. ముందుగా.. తమరు ఇస్తానన్న కోటి రూపాయలు...వరద బాధిత ప్రజలకు ఎప్పుడు ఇస్తున్నారు? అని ప్రశ్నించింది. 8 లక్షల మందికి ఆహారం అందించామని గుర్తుచేసింది.
అదే సమయంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడాన్ని ప్రస్తావించింది. బుడమేరు వరదలకు మీ డబ్బు పిచ్చే కారణమని ఆరోపించింది. సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకూ అందరూ ఫీల్డ్ లో ఉంటున్నారు. ఉద్యోగులు సైతం తమశాయసక్తులా ప్రయత్నిస్తున్నారు.అయితే మహానగరం కావడం.. లక్షలాదిగా ప్రజలు బాధితులుగా మారడంతో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. దీనికి తోడు కొన్ని చోట్ల సహాయం కాస్తా.. కొందరి పరమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వస్తున్న సాయాన్ని అందుకుని.. వారు దాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. ఇలాంటివి ప్రభుత్వం ప్రయత్నాలకు గట్టిగా గండి కొడుతున్నాయని చెప్పొచ్చు.
విపక్షం విమర్శలకు అధికార పార్టీ గట్టిగానే కౌంటరిచ్చింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. బాధితులకు ఇంకా తగినట్లుగా సాయమందకపోవడం మాత్రం కరెక్టు కాదు.. దీన్ని ఎంత కష్టమైనా సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సైతం.. తమకు సాయం అందకపోవడం లేదని భావిస్తే.. నిలదీయండని బాధితులకు గట్టిగానే హామీ ఇచ్చారు. ఈ హామీ కూడా కొంతవరకూ వర్కవుట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ.. ఇది ఎవరైతే సాయాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారో.. వారికి వరంలా మారకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.