న్యూజెర్సీ లో ఇన్నోవెరా ఫార్మా కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించేందుకు, అవకాశాలు అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న శ్రీధర్‌బాబు న్యూజెర్సీలో ఇన్నోవెర్ ఫార్మా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాల ద్వారా ఫార్మాసూటికల్, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకుంటుందన్నారు.
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఇన్నోవెరా విస్తరణకు బాటలు పడ్డాయన్నారు. ఇన్నోవెరా ఫార్మాపరిశోధన, అభివృద్ధి, ఉత్పాదక సామర్థ్య పెంపుదలకు ఈ విస్తరణ దోహదం చేస్తుందని చెప్పారు. ప్రత్యేకమైన జనరిక్ ఔషధాలు, బ్రాండెడ్ ఉత్పత్తుల్లో పేరొందిన ఇన్నోవెరా దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యాపేటలో యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. తాజాగా న్యూజెర్సీలో కార్యకలాపాల విస్తరణకు శ్రీకారం చుట్టింది.