ASBL Koncept Ambience
facebook whatsapp X

రుణమాఫీకి డేట్ ఫిక్స్..?

రుణమాఫీకి డేట్ ఫిక్స్..?

అర్హులైన రైతులకు రెండు లక్షల వరకూ పంటరుణమాఫీ చేయాలన్న టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ముమ్మరం చేసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఓవైపు నిధుల సమీకరణ చేస్తూనే... మరోవైపు అర్హులను తేల్చే పనిలో పడింది. ఇప్పటికే దీనిపై అధికారులు ఓ కార్యచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 21 రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. మంత్రి మండలి భేటీలో ముఖ్య అంశంగా రుణమాఫీ ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించి కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఎవరెవరికి రుణమాఫీ చేయాలి, నిధుల సమీకరణకు ఏం చేయాలనే విషయంపై కూలంకుశంగా చర్చించనున్నారు.

జులై17 రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. జులై నుంచే వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయని అప్పటి నుంచి రుణాలు మాఫీ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారట. జులై మధ్యలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి.. ఆగస్టు 15 కల్లా పూర్తి చేయనున్నారు. పీఎం కిసాన్‌ పథకంలో ఉన్న రూల్స్ ప్రకారమే మొత్తం మూడు విడతల్లో అప్పులు తీర్చేయనున్నారని టాక్. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్న వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించడం లేదు. ఇప్పుడు రుణమాఫీ కూడా వారి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌కం ట్యాక్స్ చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

పట్టాదారు పాస్‌ బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు రూ.2 లక్షల వరకు లోన్లు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. ఈలోగా రుణమాఫీ ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో మెుత్తం 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్‌లు లేనట్లు తెలిసింది. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఇక కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది. అయితే వారందరికీ రేషన్‌ కార్డులు లేవు. కుటుంబంలో యజమానికి మాత్రమే ఉంది.

రుణమాఫీకి రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. తద్వారా మరో 18 లక్షల మంది రైతులు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్‌కం ట్యాక్స్ చెల్లించేవారు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో రెండు లక్షల మంది తగ్గుతారని అంటున్నారు. వీరందరిని తొలగింపు ద్వారా 40 లక్షల మంది మేరకే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 2018 డిసెంబరు 12 నుంచి తీసుకున్న పంట రుణాలు, రెన్యువల్‌ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా రైతుల వివరాలను సేకరించాలని సూచించింది. ఇలా రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు రాగా.. దీనిపై మంత్రి మండలిలో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :