మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఎవరు..?
ఐఏఎస్ ప్రొబేషనరీ మాజీ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది. ఐఏఎస్ (ప్రొబేషన్) రూల్స్, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తమ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించాయి. మహారాష్ట్ర రాష్ట్రం పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆమెపై పలు ఆరోపణలు వచ్చాయి. అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించి లబ్ధి పొందారని పలువురు యూపీఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.
దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెను ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. ఫేక్ డాక్యుమెంట్లతో పరీక్ష రాసి క్లియర్ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేసింది. ఆ తరువాత అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా యూపీఎస్సీ చేసిన వాదనలను పూజ ఖండించారు. తాను ఫేక్ సర్టిఫికేట్లు పెట్టలేదని చెప్పారు. యూపీఎస్సీకి తనపై అనర్హత వేటువేసే అధికారం లేదని వాదించారు. అయితే ఆమె ఆరోపణలను ఖండించిన కేంద్రం ఐఏఎస్ నుంచి తొలగించింది.