ASBL NSL Infratech

రివ్యూ : 'ప్రతినిధి 2' పొలిటికల్ అండ్ మర్డర్ మిస్టరీ

రివ్యూ : 'ప్రతినిధి 2' పొలిటికల్ అండ్ మర్డర్ మిస్టరీ

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
నటి నటులు : నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి,
ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి తదితరులు...
సంగీతం: మహతి స్వర సాగర్, ఎడిటర్: రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని,
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
విడుదల తేదీ : 10.05.2024
నిడివి : 2 ఘంటల 16 నిమిషములు

నారా రోహిత్ గతంలో చేసిన ‘ప్ర‌తినిధి’ సినిమాకి కొన‌సాగింపుగా రూపొందిన సినిమా ‘ప్ర‌తినిధి2’. TV5 మూర్తి..అంటే కరుడుకట్టిన పసుపు జర్నలిస్ట్ అనే ముద్ర వుంది. చంద్రబాబుకి నమ్మిన బంటుగా.. అధికార వైసీపీ పార్టీపైన విషం చిమ్ముతూ ఉంటారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తూ ఉంటాయి. అలాంటిది ఇంకా అగ్గి పై ఆజ్యం పోసినట్లు నారా వారి హీరో.. అది కూడా సరిగ్గా ఎలక్షన్స్‌కి రెండు రోజుల ముందు తాను తొలిసారి దర్శకత్వం వహించిన ‘ప్రతినిధి 2’ సినిమా రిలీజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పొలిటికల్ అజెండాతోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఏర్పడ్డాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్‌లు సైతం.. అధికార పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించే విధంగా ఉండటంతో.. ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఓటు బ్యాంక్‌ని డ్యామేజ్ చేయడానికి ప్రతిపక్షం సంధించిన ‘బాణం’ ప్రతినిధి 2 అనే విమర్శలూ వినిపించాయి. అయితే తన టార్గెట్ వైసీపీ కాదని.. ఆడియన్స్ మాత్రమేనని.. ఇది పక్కా కమర్షియల్ పొలిటికల్ డ్రామా మాత్రమే అని ‘ప్రతినిధి 2’ పై వచ్చిన రూమర్లను ఖండించారు మూర్తి . అయితే నిజంగానే ప్రతినిధి 2 ఆడియన్స్ టార్గెట్‌గా చేశారా? లేదంటే.. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ.. ప్రతిపక్ష పార్టీలకు కొమ్ముగాసే చిత్రమా? అన్నది సమీక్షలో చూద్దాం.

కథ :

నిజాయితీ పరుడైన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ (నారా రోహిత్) ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. నిజాలను వెలికితీస్తూ సంచలన కథనాలతో తన వృత్తి పట్ల దూకుడుగా ఉంటాడు చే. సమాజం పట్ల బాధ్యతగా ఉండే జర్నలిస్ట్ ఉదయభాను (ఉదయభాను) నిస్వార్ధంగా ..లాభం ఆశించకుండా.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో NNC ఛానల్‌ని ప్రారంభిస్తుంది.  తన సంచలనాత్మక కథనాలతో రాజకీయ నాయకులకు కునుకు లేకుండా చేస్తుంటాడు  ఎలాంటి సవాళ్లు ఎదురైన ధైర్యంగా నిజాన్ని బయటపెట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అతని ప్రతిభాపాటవాలు చూసి ఎన్సీసీ న్యూస్ ఛానెల్ సీఈవోగా నియమిస్తారు. ఈ క్రమంలోనే ప్రజా శ్రేయస్సు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడ్‌కర్)పై అటాక్ జరుగుతుంది. ఈ దాడిలో సీఎం మరణిస్తారు. ముఖ్యమంత్రి మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు ఏంటీ? సీఎం హత్య వెనుక ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రి చనిపోతే లాభం పొందేవారు ఎవరు? సీబీఐ ఇన్వెస్టిగేషన్‌లో బయటకు వచ్చిన నిజాలు ఏంటీ? జర్నలిస్ట్ చేతన్ పాత్ర ఏంటీ అతను చేసిన పోరాటం ఏంటీ? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే  సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

ఇక నారా రోహిత్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కీలక పాత్రలో నటించిన హీరోయిన్ సిరీ లెల్ల కూడా చాలా బాగా నటించింది. కథలో ఆమె పాత్రను ఇన్ వాల్వ్ చేయడం బాగుంది. మరో ప్రధాన పాత్రలో కనిపించిన దినేష్ తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించిన సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతికవర్గం పనితీరు :

జర్నలిస్ట్ మూర్తికి ఇది తొలి చిత్రమే కానీ..  దర్శకుడు మూర్తి దేవగుప్తపు సరైన కథా కథనాలను రాసుకోలేకపోయారు. టెక్నీషియన్స్ అంతా సీనియర్స్ కావడంతో కొత్త దర్శకుడు అనే ఫీల్ అయితే కలగదు. అక్కడక్కడా పరిధి దాటి పొలిటికల్ సెటైర్లు వేయించినా.. సెన్సార్‌ బీప్‌లు చాలా చోట్ల కనిపించాయి. ‘పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్.. మనల్ని ఎవడేం చేస్తాడు’, ‘నాన్నగారు చనిపోయి రోజులు కూడా కాలేదు.. అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టేశారా?’, ‘సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్‌లు వేసేశాం.. ఇంకా చెప్పడానికి వాళ్లు వినడానికి మిగిలిందేం లేదు’ ఇలాంటి డైలాగ్‌లతో అధికార పార్టీని కెలికినట్టుగానే అనిపిస్తాయి కానీ.. వాటిని కథకి కనెక్ట్ చేసి అబ్బే అలాంటిదేం లేదన్నట్టుగానే దర్శకత్వ ప్రతిభ చూపించారు మూర్తి. మహతి స్వర సాగర్  బ్యాగ్రౌండ్ స్కోర్.. బాగుంది. సాంగ్స్ బాగానే ఉన్నా.. కథకి అవసరం లేదన్నట్టుగా అనిపిస్తాయి. ఏదో ఉన్నాయి కాబట్టి.. ఎక్కడో చోట పెట్టాలి అనేట్టుగా.. సాంగ్స్ ప్లేస్ మెంట్ సెట్ కాకపోవడంతో ప్రతినిధి 2 పాటలు నిరుత్సాహపరుస్తాయి. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ కథకి సెట్ అయ్యింది. ఆ బాంబ్ బ్లాస్ట్ బాగా తీశారు. కథ ఎక్కువ టీవీ స్టుడియోలు.. చాలా తక్కువ లొకేషన్స్‌కి పరిమితం కావడంతో.. చూసిందే మళ్లీ మళ్లీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది.

విశ్లేషణ :

ప్రతినిధి 2ని ఒక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే ఆద్యంతం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడంలో మాత్రం కాస్తా విఫలమయ్యారనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయాలు, పొలిటికల్ లీడర్స్ పనితీరు, వ్యవహార శైలీ, అవినితీ, సిస్టమ్ లోని లొసుగులు ఇలా ప్రతి అంశాన్ని చక్కగా చూపించారు. ఓటర్ల బలహీనతలు, చేసే తప్పులపై సినిమాలో ప్రస్తావించారు. నారా రోహిత్- మూర్తి దేవగుప్తపు కాంబో మూవీ అనగానే ఒక పార్టీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా వచ్చే సినిమా అని చాలా మందికి ఓ అంచనా ఉంది. కానీ, అందుకు భిన్నంగా సినిమాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి హత్య, అనంతరం సీఎం కుమారుడు పదవి చేపాట్టలనుకోవడం వంటి విషయాలు కొన్ని నిజ జీవిత సంఘటనలకు సిమిలర్‌గా ఉన్న ఎక్కువగా కమర్షియల్ పొలిటికల్ డ్రామాగా రూపొందించారు. రాజకీయ వ్యవస్థలో జర్నలిజం ఎలా ఉండాలనే విషయాన్ని తనదైన కోణంలో చిత్రీకరించారు. ఫస్టాఫ్ ఉత్కంఠంగా సాగిన సెకండాఫ్‌లో స్లో నెరేషన్‌తో ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడు. మరింత బలంగా రాసుకోవాల్సిన సన్నివేశాల్లోనూ పూర్తి పొలిటికల్ డ్రామా ఉండటంతో కాస్తా బోర్ ఫీల్ అవుతారు.   ఫైనల్‌గా చెప్పాలంటే కాస్తా బోర్ కొట్టిన ఆలోచింపజేసే డైలాగ్స్, కొన్ని ట్విస్టులతో ఎంటర్టైన్ చేసే పొలిటికల్ డ్రామా ప్రతినిధి 2. అయితే ఈ సినిమా చూసి ఓటర్లు ప్రభావితం అయిపోయేటంత సీన్ అయితే సినిమాలో లేదు. జస్ట్ ఇదొక పొలిటికల్ అండ్ మర్డర్ మిస్టరీ మాత్రమే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :