ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏపీలో మోడీ వ్యూహం..

ఏపీలో మోడీ వ్యూహం..

ఏపీ విషయంలో బీజేపీ డబుల్ స్ట్రాటజీ అవలంభిస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమిలో సభ్యత్వ పార్టీగా ఉన్నప్పటికీ.. మోడీ ఎప్పుడూ నేరుగా సీఎం జగన్‌ను విమర్శించింది లేదు. వైపీసీ సర్కార్ అంటూనే విమర్శలు సాగించారు. దీంతో మోడీకి కూడా తమ కూటమిపై నమ్మకం లేదంటూ వైసీపీనేతలు సోషల్ మీడియాలో పోస్టులతో హల్ చల్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ సైతం.. కూటమి మేనిఫెస్టోలో మోడీ బొమ్మలేకపోవడమే... వారిమధ్య సరైన అవగాహన లేదన్న విషయాన్ని తెలియజేస్తుందని పలుమార్లు ఆరోపించారు కూడా. ఇప్పటివరకూ బీజేపీ అగ్రనేతలు సైతం.. వైసీపీపై నేరుగా టార్గెట్ చేయకపోవడం గమనార్హం.

మరో నాలుగురోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో బీజేపీ అగ్రనేతలు .. ఏపీలో సందడి చేస్తున్నారు. వచ్చినవారు వైసీపీ సర్కార్ అవినీతిలో మునిగిపోయిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు మోడీ కూడా ఏపీలో అవినీతి జరిగిపోయిందని... ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తేనే, దీనికితెరపడుతుందన్నారు. అయితే ఇక్కడ కూడా మోడీ... నేరుగా సీఎం జగన్ పేరు ప్రస్తావించలేదు. అంత పరోక్షంగానే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమంటున్నారు.

మరోవైపు వైసీపీ సైతం .. బీజేపీ విషయంలో అలాగే వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ మోడీపై నేరుగా విమర్శలకు దిగలేదు సీఎం జగన్. లేటెస్టుగా మోడీ తీరుపై సునిశితంగా విమర్శించారు. 2019 సమయంలో చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు అని విమర్శించిన మోడీ.. పోలవరం విషయంలో చంద్రబాబు గురించి ఎన్నో ఆరోపణలు చేసిన మోడీ.. ఇప్పుడు చంద్రబాబు గొప్ప పాలనా అధ్యక్షుడు అని కీర్తించడం వింతగా ఉందన్నారు సీఎం జగన్. పార్టీలు మారుస్తూ రాజకీయాలు చేయడంతో పాటు వెన్నుపోట్లు పొడవడంలో కూడా బాబు చాలా నిపుణుడు అని ఆనాడు విమర్శించిన మోడీ.. ఈనాడు అతనితో కలిసి కూటమిగా ఏర్పడడం చాలా గ్రేట్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.. వీళ్ళ మాటలు వింటుంటే రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతుంది అని జగన్ అన్నారు. తమను ఎదిరిస్తే విమర్శలు చేస్తారు, ఆరోపణలు చేస్తారు.. అదే తమ పక్కన నిలబడితే గొప్పగా కీర్తిస్తారు.. ఇదేనా మోడీ మీ రాజకీయం అని జగన్ నిలదీశారు.

అయితే ఏపీలో ఏపార్టీ గెలిచినా మొత్తంగా 25 మంది ఎంపీల మద్దతు తమకే దక్కేలా మోడీ వ్యూహం రచిస్తున్నారన్న వాదనలున్నాయి. అందుకే సీఎం జగన్ ను నేరుగా మోడీ విమర్శించడం లేదంటున్నారు. కూటమిలో ఉన్నప్పటికీ నేరుగా జగన్ పై ఘాటైన విమర్శలు చేయకపోవడం.. దీనికి ఓ కారణంగా చెబుతున్నారు. అందుకే మోడీ, షాలకు ఏపీ గురించి పెద్దగా చింతలేదన్న వాదనలు పక్కాగా వినిపిస్తున్నాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :