ASBL Koncept Ambience
facebook whatsapp X

Sucharitha : రాజకీయాలకు మేకతోటి సుచరిత గుడ్ బై..!?

Sucharitha : రాజకీయాలకు మేకతోటి సుచరిత గుడ్ బై..!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న పలువురు నేతలు ఇప్పటికే బయటకు వచ్చేశారు. ఇప్పుడు మరికొంతమంది అదే బాటలో పయనిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా పేరొందిన మేకతోటి సుచరిత ఆ పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీని వీడడమే కాకుండా రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకుంటున్నట్టు ఆమె నేరుగా జగన్ కే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆమె జగన్ తో సమావేశమై తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

మేకతోటి సుచరిత కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అండదండలతో ఆమె కాంగ్రెస్ తరపున ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ చనిపోవడం, జగన్ పార్టీ పెట్టడంతో 2012లో కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చారు. ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే 2014లో టీడీపీ హవా ముందు ఓడిపోయారు. 2019లో వైసీపీకి బలమైన గాలి వీయడంతో సుచరిత విజయం సాధించారు. జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పని చేశారు. అయితే తాజా ఎన్నికల్లో ఆమె ప్రత్తిపాడు నుంచి కాకుండా తాడికొండ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2019లో గెలిచిన తర్వాత సుచరితకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించారు జగన్. ఆ తర్వాత మూడేళ్లకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సుచరితను జగన్ తప్పించారు. దీంతో అప్పట్లోనే ఆమె అలకపూనారు. అయితే అధిష్టానం జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో అడ్జస్ట్ అయ్యారు. పైగా తన భర్తకు మచిలీపట్నం పోర్టు బాధ్యతలు అప్పగించడంతో ఆమె శాంతించారు. అయితే తాజా ఎన్నికల్లో ఆమె ప్రత్తిపాడు నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ జగన్ మాత్రం తాడికొండకు పంపించారు. దీంతో అయిష్టంగానే ఆమె తాడికొండ నుంచి పోటీ చేశారు. ఘోరంగా ఓడిపోవడంతో అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించిన ప్రతిసారీ సుచరిత దూరంగానే ఉండిపోయారు. దీంతో వైసీపీని వీడేందుకు సుచరిత సిద్ధమయ్యారని.. జనసేన పార్టీలో ఆమె చేరబోతున్నారని వార్తలు జోరందుకున్నాయి. నాగబాబు ద్వారా ఆమె పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలను ఆమె తోసిపుచ్చారు. ఇప్పుడు ఆమె వైసీపీ అధినేత జగన్ ను కలిసి తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పేశారు. తనకు ఆరోగ్యం సహకరించట్లేదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం కూడా చేయలేనని ఆమె చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారని.. అయితే ఏ పార్టీలో ఉండాలనేది ఆయన ఇష్టమని సుచరిత వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉండాలని సుచరిత ఫ్యామిలీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నాటికి తమకు ఏ పార్టీ అనుకూలంగా అనిపిస్తే అందులో చేరి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :