ASBL NSL Infratech

రివ్యూ : 'మనమే'  

రివ్యూ :  'మనమే'  

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి, మాస్టర్ విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్,
వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి సుదర్శన్ తదితరులు
సంగీత దర్శకుడు: హేశం అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాతలు : టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య
విడుదల తేదీ : 07.06.2024
నిడివి : 2 ఘంటల 35 నిముషాలు

శర్వానంద్ అనగానే మన పక్కింటి అబ్బాయి అనిపించుకునే సినిమాలే ఎక్కువగా చేస్తుంటాడు. మనలో ఒకడు అనే ఫీలింగ్ అయితే తెప్పించుకున్నాడు. అతని కథలు ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొత్త  ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడుతుంటాడు. శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఇటీవల శర్వాకి సరైన సాలిడ్ హిట్  లేదు. అలాంటి శర్వా.. బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న కృతి శెట్టితో కలిసి మనమే అనే చిత్రాన్ని చేశాడు. మరి ఈ చిత్రం ఈ రోజు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందోసమీక్షా లో చూద్దాం.

కథ:

విక్రమ్ (శర్వానంద్) సరదాగా తిరుగుతూ తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. విక్రమ్ ప్రాణ స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో మరణిస్తారు. వారి కొడుకు ఖుషీని విక్రమ్, సుభద్ర (కృతి శెట్టి) కలిసి పెంచాల్సి వస్తుంది. ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్.. అన్నింటినీ పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేసే సుభద్ర.. కలిసి పిల్లాడిని ఎలా పెంచారు? సుభద్ర తనకు కాబోయే వ్యక్తి కార్తిక్ (శివ కందుకూరి) పాత్ర ఏంటి? పిల్లాడిని పెంచే క్రమంలో విక్రమ్‌లో వచ్చిన మార్పులేంటి? చివరకు విక్రమ్-సుభద్ర మధ్య ఎలాంటి రిలేషన్ ఏర్పడుతుంది? చివరకు ఏం జరుగుతుంది? అన్నది కథ.

నటీనటుల హవాబావలు :

శర్వానంద్ నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంది?. ఇలాంటి పాత్రలు శర్వాకి కొత్తేమీ కాదు. ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. కామెడీ, లవ్, ఎమోషన్ ఇలా అన్నీ సీన్లలో మెప్పిస్తాడు. కృతి శెట్టి ఇది వరకటి సినిమాల్లో కనిపించినట్టుగా, నటించినట్టుగానే అనిపించింది. కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రాజ్ కందుకూరి, త్రిగుణ్ పాత్రలు ఫిల్లర్స్‌లానే అనిపించాయి. అంత ప్రాధాన్యత లేదనిపించింది. వెన్నెల కిషోర్ కనిపించిన నాలుగైదు సీన్లు నవ్వించాడు. రాహుల్ రవీంద్రన్ విలనిజం ఏమంతగా లేదు. రాహుల్ రామకృష్ణకు సరిపోయే పాత్ర కాదనిపించింది. సచిన్ ఖేదెకర్, సీత, ముఖేష్ రిషి, తులసి,  ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. అతిధి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది.  కానీ ఏ ఒక్కటి కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ కాదు.

సాంకేతికవర్గం పనితీరు :

ఫ్యామిలీ ఎమోషన్స్.. బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం.. అనే కాన్సెప్ట్‌లను తీసుకుని ఈ కథను దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య రాసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన టేకింగ్  చాలా బాగుంది. కానీ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన తడబడ్డారు. ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమైనట్టుగా కనిపిస్తుంది. సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది. టిజి విశ్వప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

పిల్లలు చదువుల కోసమో, ఉద్యోగం కోసం తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు.. ఆ టైంలో పిల్లల కోసం పేరెంట్స్ పడే బాధను చూపించే ప్రయత్నం చేసినట్టుగా ఈ చిత్రం లో కనిపిస్తుంది. పిల్లలకు తాము తల్లిదండ్రులయ్యాక కానీ.. పేరెంట్స్ పడే బాధ అర్థం కాదేమో అన్నట్టుగా దర్శకుడు చూపించాడు. ప్రథమార్దం మొత్తం కూడా శర్వానంద్‌ను అల్లరిచిల్లరగా గాలి తిరుగుడు తిరిగే తిరుగుబోతు.. అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే చిల్లర పాత్రలానే చూపిస్తాడు. హీరోకి హీరోయిన్ మీద ప్రేమ కలిగే సీన్‌తో ఇంటర్వెల్ బ్లాక్‌ను ఏదో అలా మమా అనిపించేశాడు. కానీ అప్పటికే సినిమాను చూస్తున్న ప్రేక్షకుడు బోరింగ్‌గా ఫీల్ అవుతుంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనే ఆసక్తి ఏ మాత్రం లేకుండా సెకండాఫ్ సాగుతుంటుంది. పాయింట్ వరకు ఏదో కొత్తగా అనిపించినా.. రాసుకున్న సీన్లలో  ఎక్కడో లోపం కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో తల్లీకొడుకుల మధ్య వచ్చే సీన్ ఒక్కటే కాస్త పర్వాలేదనిపిస్తుంది. సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, శర్వానంద్, కృతి శెట్టి తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ చిత్రం క్లాస్ ఆడియన్స్ ను చాలా బాగా మెప్పిస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :