ASBL Koncept Ambience
facebook whatsapp X

కేసీఆర్ నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయా..?

కేసీఆర్ నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయా..?

ఒకప్పుడు గులాబీబాస్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే తిరుగుండేది కాదు. కాకలు తీరిన రాజకీయనాయకులు కూడా కేసీఆర్ వ్యూహాల ముందు నిలబడలేకపోయారు. దీంతో రాజకీయపు టెత్తులలో కేసీఆర్ కు సాటిలేరని తెలంగాణ సమాజంతోపాటు దేశం భావించింది. అయితే పదేళ్ల పాలన తర్వాత తిరిగి చూస్తే..ఇప్పుడదే కేసీఆర్..వరుసగా తప్పుడు నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్నారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది.

మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కసీటు కూడా దక్కించుకోలేక పార్టీ చతికిలపడింది. దీనికి కేసీఆర్ దూరదృష్టి లేమి కారణం అన్న ప్రచారం జరిగింది. దీంతో ఒకప్పుడు కేసీఆర్ ప్రాపకం కోసం వెంపర్లాడిన నాయకులు.. ఇప్పుడు అటువైపు చూసేందుకు ఇష్టపడడం లేదు. అంతేకాదు.. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. కాళేశ్వరం మొదలుకుని, విద్యుత్ కొనుగోళ్ల వరకూ అన్ని వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై వరుసగా విచారణ కమిటీలు వేస్తోంది. వీటిని గులాబీబాస్ ఎంతవరకూ అధిగమించగలరన్నది ఆసక్తికరంగా మారింది.

విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జస్టిస్ నర్సింహరెడ్డి కమిషన్ ముందు హాజరుకాకూడదని కేసీఆర్ నిర్ణయించుకోవడం..విమర్సలకు దారితీస్తోంది. తాను చావునోట్లో తలపెట్టి, తెలంగాణ తెచ్చానని.. రాష్ట్ర అభివృద్ధికి చాలా కష్టపడ్డానని కేసీఆర్ పదేపదే చెబుతారు. కానీ.. ఆరోజులు గతించిపోయాయి. ఇప్పుడు ఓ బాధ్యత కలిగిన నేతగా, రాజనీతిజ్ఞుడిగా ప్రవర్తించాల్సిన కేసీఆర్.. తనను కమిషన్ విచారణకు పిలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కమిషన్ కు విచారణ చేసే అర్హత లేదంటున్నారు.

దీనిపై కాంగ్రెస్ కూడా అంతే ఘాటుగా విమర్శలు చేస్తోంది. మాజీప్రధాని సాక్షాత్తూ ఇందిరాగాంధీయే.. ఓకేసు విషయమై కమిషన్ ముందు హాజరైన వివరణ ఇచ్చారని గుర్తు చేస్తోంది. ఆమె ఒక్కరే కాదు.. గతంలో చాలా మంది ప్రముఖులు కూడా కమిషన్ల ముందు హాజరైన ఉదంతాలు జ్ఞప్తికి తెస్తోంది. మరి కేసీఆర్ ఎందుకు హాజరు కారు. హాజరైతే వచ్చే నష్టమేంటని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. ఇది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం కూడా తెలంగాణ సమాజంలో చర్చకు కారణమైంది. రాష్ట్రం గురించి ఆలోచించే తెలంగాణ వాదులు.. ఓసారి కమిషన్ ముందు హాజరైతే వచ్చే నష్టమేంటి అని ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్.. కమిషన్ వేసే ప్రశ్నలకు బదులిచ్చే పరిస్థితిలో లేరా అని ఆలోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభిమానులైతే.. చేసిన అవకతవకలను కమిషన్ ప్రశ్నిస్తుందని, దాన్ని కప్పిపుచ్చుకోలేక ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నారంటున్నారు. ఇక కేసీఆర్ వీరాభిమానులు, గులాబీ పార్టీ సానుభూతిపరులైతే.. కేసీఆర్ నే విచారణకు పిలుస్తారా..? తెలంగాణ తెచ్చిన వ్యక్తిపట్ల ఇంత అగౌరవమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. చట్టం ముందు అందరూ సమానమే. తమ తప్పు లేనప్పుడు, దాన్ని చక్కగా ప్రజలందరకు, కమిషన్ కు తెలిసేలా చేయాల్సిన బాధ్యత ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీసీఎం కేసీఆర్ పై ఉంది. ఇదే గతంలో నేతలు చేసింది, ఇప్పుడు కేసీఆర్ చేయాల్సింది కూడా.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :