ASBL Koncept Ambience
facebook whatsapp X

అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం జగన్‌కు లేదా..? ఆ మాటల వెనుక అర్థమేంటి..? 

అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం జగన్‌కు లేదా..? ఆ మాటల వెనుక అర్థమేంటి..? 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ ఇంకా కోలుకోలేదు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు ఓటమికి కారణాలను విశ్లేషించుకోలేకపోతున్నారు. ఎక్కడ తప్పు జరిగిందో ఆరా తీయకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెడుతూ కాలం గడిపేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఓటమికి కారణాలు అంతు చిక్కట్లేదనే చెప్తున్నారు తప్పా గ్రౌండ్ లెవల్లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించట్లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు నేతలతో జగన్ రోజువారీగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన చర్చల్లో ఎందుకు ఓడిపోయాం అని ఆయన నేతలను అడగలేదు.. నేతలు కూడా అందుకు కారణాలు చెప్పలేదు.

ఇన్నాళ్లూ గెలిచిన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన జగన్.. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసిన ఓడిపోయిన నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. విస్తృతస్థాయి సమావేశం కాబట్టి కచ్చితంగా ఓటమికి కారణాలపై అంతర్మథనం జరుగుతుందని అందరూ ఆశించారు. అయితే ఇక్కడ నేతలెవరకీ జగన్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎప్పటిలాగే తను చెప్పాలనుకున్న విషయాలను మైక్ అందుకుని చెప్పేశారు. బెదిరిస్తారు.. ప్రలోభపెడతారు.. భయపడొద్దు మంచి రోజులొస్తాయ్.. అప్పటి వరకూ వెయిట్ చేద్దాం.. అని ముక్తాయించేశారు.

జగన్ చెప్పిన అంశాల్లో కీలకమైనది మరొకటి ఉంది. ‘అసెంబ్లీలో మనకున్న బలాన్ని బట్టి చూస్తే అసలు మనకు మాట్లాడే అవకాశం ఇస్తారని ఆశించలేం. అలాగే స్పీకర్ స్థానంలో కూర్చోబోతున్న వ్యక్తి మాటతీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన ఓడిపోయాడు కానీ చనిపోలేదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. చచ్చేదాకా కొట్టాలని ఇంకొకడు అంటున్నాడు. ఇలాంటి కౌరవులు ఉండే సభకు వెళ్లి మనమేదో చేస్తామనే నమ్మకం లేదు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి, ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయి.’ అన్నారు జగన్.

జగన్ మాటల్లోని అంతరార్థాన్ని పసిగట్టిన కొందరు విశ్లేషకులు.. జగన్ అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోందని చెప్తున్నారు. కనీసం ప్రతిపక్ష స్థానానికి తగినంత బలం కూడా లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవచ్చని.. సందర్భానుసారం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్ట వచ్చని అంచనా వేస్తున్నారు. కానీ అలా అసెంబ్లీకి వెళ్లకపోతే మొదటికే మోసం వస్తుందని కొందరు సూచిస్తున్నారు. ఏదైనా చట్టసభల్లో తేల్చుకోవాలని.. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్లవుతుందని సలహా ఇస్తున్నారు. మరి జగన్ ఏం చేస్తారో వేచి చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :