ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు..

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు..

ఏపీ నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్‌ విభాగం డీజీపీగా నియమించి, పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్‌ చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్‌ జిల్లా ఆపరేషన్స్‌ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక... అనంతపురం, కడప, మెదక్‌ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్‌ రేంజ్‌లతో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్‌ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది.

హరీష్ గుప్తా వారసుడిగా ద్వారకా..

వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై సార్వత్రిక ఎన్నికల సమయంలో కసిరెడ్డి రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం... హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించింది. మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్‌ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు.

ఇటీవల చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా ట్రాఫిక్‌ను సరిగ్గా నియంత్రించకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఆయన ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లలేకపోయారు. ఈ వ్యవహారంలో డీజీపీ తీరుపై గవర్నర్‌ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటితోపాటు సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా అవకాశం కల్పించినట్లు సమాచారం.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :