ASBL NSL Infratech

పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రభంజనం

పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రభంజనం

తొలిసారిగా జన్మభూమికి సేవ చేయాలన్న ఉద్దేశ్యంతో డల్లాస్‌ నుంచి గుంటూరు వచ్చిన డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేసి, గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొంది చరిత్ర సృష్టించిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నతస్థానాలకు ఎదిగారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని.. తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది.. కేంద్ర క్యాబినెట్‌లో చోటు సంపాదించారు. 

ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వేలకోట్లకు అధిపతి కావడంతోపాటు ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టి తొలి ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయడంతోపాటు విజయాన్ని సాధించి కేంద్రమంత్రి పదవిని చేపట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది పెమ్మసాని చంద్రశేఖర్‌ వల్లనే సాధ్యమైంది. తాను పోటీ చేయడంతోపాటు కేంద్ర మంత్రి పదవిని చేపట్టి ఆంధ్రప్రదేశ్‌తోపాటు, దేశం మొత్తం తనపై దృష్టిపడేలా చేసుకున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో చేసిన ఆయన ప్రసంగాలు ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి. 

చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్‌ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటా లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. 1991లో పదోతరగతి, 1993లో ఇంటర్‌ పూర్తిచేస్తారు. డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో 1993-94లో ఎంబిబిఎస్‌ ఎంట్రన్స్‌లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సాధించారు. ఓ సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపారం రంగంలో రాణించి నేడు కోట్ల రూపాయిలకు అధిపతి అయ్యారు. కేవలం కోట్లు సంపాదించడమే కాదు.. తన సంపాదనలో కొంత భాగాన్ని పేద ప్రజల కోసం వినియోగిస్తూ విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్‌ ఫ్యాకల్టీగా కొనసాగారు. 

మరోవైపు మెడికల్‌ లైసెన్స్‌ ఎగ్జామ్స్‌ కోసం ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు. తనలా వైద్య విద్య అభ్యసించాలన్న ఎంతో మంది కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తాను సొంతంగా తయారు చేసిన నోట్స్‌ను తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో అందించేవారు. డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రయత్నానికి మంచి ఆదరణ లభించింది. అదే సమయంలో చంద్రశేఖర్‌ రాసిన మెటీరియల్‌ కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిరది. దీంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నర్సింగ్‌, ఫార్మసీ, లా, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్‌ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇప్పటికీ వైద్య పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు యు వరల్డ్‌ ద్వారా ఆయన శిక్షణ అందిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా ఆయన కోట్ల రూపాయిలను సంపాదించగలిగారు.

ఎంపీల్లో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి ఆస్తి రూ.5,300 కోట్ల రూపాయిలు. తాజాగా డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ఐశ్వర్యవంతుడైన ఎంపీగా పెమ్మసాని ఉన్నారు. అంతేకాదు కేబినెట్‌లో చోటు దక్కడంతో మోదీ మంత్రిమండలిలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పెమ్మసాని నిలిచారు. దీంతో పెమ్మసాని ఆస్తుల గురించి తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని దేశ ప్రజలు గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు. ఓ డాక్టర్‌ వేలకోట్ల రూపాయిలకు ఎలా అధిపతి అయ్యారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం రాజ్యసభ, లోక్‌సభలకు పోటీచేసిన అభ్యర్థులలో అత్యంత ధనవంతుడు పెమ్మసాని చంద్రశేఖర్‌. తన పేరుతో రూ.2,316,54,45,165, తన భార్య శ్రీరత్న కోనేరు పేరుతో రూ.2,289,35,36,539, కుమారుడు అభినవ్‌ పేరు మీద రూ.496,27,61,094, కుమార్తె సహస్ర పేరుతో రూ.496,47,37,988 ఆస్తులున్నట్లు ఆయన అఫిడవిట్‌లో వెల్లడిరచారు. ఇవికాక.. తన పేరుతో రూ.72 కోట్ల విలువైన భూములు, భవనాలు, తన భార్య పేరుతో రూ.34 కోట్ల 82 లక్షల విలువైన భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. చేతిలో రూ.2,06,400లు.. భార్య దగ్గర రూ.1,51,800 నగదు ఉన్నాయని, కుమారుడు అభినవ్‌ వద్ద రూ.16,500, కుమార్తె సహస్ర వద్ద రూ.15,900 నగదు ఉన్నట్లు అఫిడవిట్‌ లో తెలిపారు.

పెమ్మసాని ఫౌండేషన్‌

చంద్రశేఖర్‌ అమెరికా ఫిజీషియన్‌ అసోసియేషన్‌ లో సభ్యుడిగా ఉంటూ.. పెమ్మసాని ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. తన వ్యాపారంలో రాణించిన ఆయన పురిటి గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు. దీనికోసం సొంత డబ్బులతో వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్‌ బెరీ స్కూల్‌ను ప్రారంభించారు. పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన గుంటూరు లోక్‌సభ స్థానంనుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పెమ్మసాని లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా పెమ్మసాని పేరు చర్చనీయాంశమైంది. ఎంపీగా గెలిచిన ఆయనకు అదృష్టం కలిసొచ్చి మోదీ కేబినెట్‌లో చోటు లభించింది.

టీడీపీ ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా ఉండటంతో.. ఆ పార్టీకి తొలి విడతలో రెండు మంత్రి పదవులు దక్కాయి. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసానికి అవకాశం దక్కింది. రామ్మోహన్‌ నాయుడు హ్యాట్రిక్‌ ఎంపీ కావడంతో పాటు టీడీపీలో సీనియర్‌ నేత కావడంతో ఆయనకు కేంద్రమంత్రి పదవి ఖాయమైంది. కానీ అనూహ్యంగా మొదటిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఎంపీ పదవి దక్కడంతో ఆయన ఐశ్వర్యవంతుడే కాదు.. అదృష్టవంతుడని చాలామంది వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :