ASBL NSL Infratech

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ..! బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమా..?

కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ..! బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమా..?

తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగియడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనపై ఫోకస్ పెట్టింది. అయితే పాలన సాఫీగా సాగాలంటే రాజకీయంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు మిగిలే ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీ దానిపైనే పెట్టారు. అదే ఆపరేషన్ ఆకర్ష్. కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఏడాదిలోపే కూలిపోతుందని గతంలో బీఆర్ఎస్ నేతలు పదేపదే కామెంట్స్ చేశారు. తన సర్కార్ ను టచ్ చేసి చూడాలని రేవంత్ సవాల్ కూడా విసిరారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా పార్టీ బలోపేతంపై రేవంత్ దృష్టి సారించారు.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పలువురు కీలక బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి తీసుకురానున్నట్టు సమాచారం. ఇవాళ మాజీ స్పీకర్, సీనియర్ నేత పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన పార్టీ మారతారని అసలు ఎవరూ ఊహించలేదు. పోచారం ఇంటికి రేవంత్ వెళ్లేంతవరకూ అసలు అలాంటి అనుమానాలు కూడా ఎవరికీ రాలేదు. దీంతో ఖంగుతిన్న బీఆర్ఎస్ నేతలు హడావుడిగా పోచారం ఇంటికెళ్లి హడావిడి చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పోచారం కండువా మార్చేయడం జరిగిపోయింది. దీంతో బీఆర్ఎస్ నేతలు చేసేదేమీ లేకపోయింది.

జులై లోపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈలోపు ఆపరేషన్ ఆకర్ష్ ను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ సమావేశాల లోపు మరో 10-15 మంది వరకూ ఎమ్మెల్యేలను లాగడం ద్వారా అసెంబ్లీలో ఆ పార్టీకి గొంతు లేకుండా చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో 26 మంది ఎమ్మెల్యేలను లాగగలిగితే బీఆర్ఎస్ కు అసెంబ్లీలో గుర్తింపే లేకుండా చేయొచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమంది ఎమ్మెల్యేలు రాకపోవచ్చని సమాచారం.

ప్రజాప్రతినిధులతో పాటు బీఆర్ఎస్ లోని కీలక నేతలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోచారం ఇప్పటికే కండువా కప్పుకున్నారు. అలాగే మరికొందరు సీనియర్లను కూడా పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, వేం నరేందర్ లకు రేవంత్ రెడ్డి అప్పగించినట్టు తెలుస్తోంది. వీళ్లంతా తెరవెనుక నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్ ఊహించని నేతలు కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి రాబోతున్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల లోపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతాయని అంటున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :