ASBL Koncept Ambience
facebook whatsapp X

కేసీఆర్ కు పవర్ షాక్..?

కేసీఆర్ కు పవర్ షాక్..?

పదేళ్లపాటు ఏకఛత్రాదిపత్యం.. కనుసైగతో కదిలే అధికార యంత్రాంగం.. బాస్ ఏమి చెపినా జీ హుజూర్ అనే నాయక గణం.. తెలంగాణ అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లు పాలన సాగింది. అయితే ఇటీవలి ఎన్నికల్లో జనాగ్రహానికి గురై కేసీఆర్ పదవి కోల్పోయారు. ఇంకేముంది పదవి పోగానే బళ్లు ఓడలు..ఓడలు బళ్లు అయ్యాయి.గత పాలనలో కేసీఆర్ చేపట్టిన అంశాలపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు ఆదేశించింది.

ఇందులో తొలుతగా కేసీఆర్ హయాంలో జరిగిన కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ వేసింది. జూన్ 15లోగా కమిషన్ ముందు హాజరుకావాలని సూచించింది. జులై 30 వరకూ కేసీఆర్ సమయం అడిగినా.. కమిషన్ ససేమిరా అంది. దీంతో కేసీఆర్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కమిషన్ ముందు హాజరు కానని.. ఆ కమిషన్ కు విచారణ అర్హతే లేదన్నారు కేసీఆర్. అంతేకాదు..కమిషన్ పై ఘాటు విమర్శలు చేస్తూ 12 పేజీల లేఖ రాశాడు. నరసింహా రెడ్డి తీరును తప్పుపట్టారు.

కరెంటు కొనుగోళ్ల విషయంలో, భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం విషయంలో తాను చేసిందంతా కరక్టేనని లేఖలో స్పష్టం చేశారు కేసీఆర్. కరెంటు బాధలనుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన తనను మెచ్చుకోవాల్సిందిపోయి విచారణ చేయడమేమిటని ఎదురుదాడి చేశారు. నిజానికి కేసీఆర్ లేఖలో రాసిన విషయాలనే కమిషన్ ఎదుట చెప్పొచ్చు. తన వాదన వినిపించవచ్చు. కమిషన్ ను కన్విన్స్ చేయొచ్చు. కానీ విచారణ కమిషన్ తనను విచారణకు రమ్మని పిలవడాన్ని కేసీఆర్ అవమానంగా భావించారు.

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినోడిని ఇంతగా అవమానిస్తారా? అని ఆగ్రహించారు కేసీఆర్. ఇది రాజకీయ కక్షగా ఆయన భావించాడు. జస్టిస్ నరసింహా రెడ్డి ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి ఏం చెప్పినా ఆయన వినరని కేసీఆర్ ఫిక్స్ అయిపోయారు. చట్టబద్ధంగా ఏర్పాటైన విచారణ కమిషన్ ముందు హాజరు కాకపోవడం నేరమవుతుందనే విషయం కేసీఆర్ కు తెలియదా? తెలియకుండా ఉండదు. తన లీగల్ టీమ్ తో మాట్లాడే ఉంటారు.

కేసీఆర్ విచారణకు రాడని క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. కేసీఆర్ కాళేశ్వరం విచారణను కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఆ నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు అన్నీ కేసీఆర్ చెప్పినట్లే చేశామని అంటున్నారు. తాము చెప్పింది ఆయన వినలేదని చెబుతున్నారు. దీనిపై విచారిస్తున్న జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కేసీఆర్ ను పిలిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ కేసీఆర్ రాకపోతే ఎలా రప్పించాలో తనకు తెలుసనీ చెప్పారు. దీనిపై సమన్లు వస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :