ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ..

ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ..

రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీ లోగానే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతుభరోసాపై మంత్రిమండలి సమావేశం జరిగింది. రుణమాఫీ విధివిధానాలను పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. రైతుభరోసా విధివిధానాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలు తదితరులతో చర్చించి జులై 15 నాటికి నివేదిక ఇవ్వనుంది.

మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు

రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు మూడు, నాలుగు రోజుల్లో వెల్లడి కానున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడడానికి కొంత సమయం పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎలాంటి సందిగ్ధత లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని అధికారులకు మంత్రివర్గం స్పష్టం చేసినట్లు తెలిసింది. మొత్తం రైతాంగానికి సంబంధించినవి కాబట్టి ఇతర అంశాలేవీ ఎజెండాలో లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. పీఎం కిసాన్‌ యోజన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని రుణమాఫీని అమలు చేయనున్నారు. అయితే అందులో ఉన్న మార్గదర్శకాలు పూర్తిగా కాకుండా, ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం కలిగేలా రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధుపై ఎన్నో ఆరోపణలున్నాయన్నారు సీఎం రేవంత్. జాతీయ రహదారులుగా మారిపోయిన భూములకు, అపర కుబేరులకు.. చివరకు గజ్వేల్‌లో కేసీఆర్‌ భూములకు కూడా రైతుబంధు నిధులిచ్చారన్న విమర్శలున్నాయి. మేం నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం లేదు. అందరితో చర్చించి.. సూచనలు, సలహాలు తీసుకుని రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అర్హులకు అందేలా అమలు చేస్తాం. రైతులు, రైతుకూలీ సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి.. విధివిధానాలను రూపొందించేందుకు ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జులై 15లోగా నివేదిక ఇస్తుంది. దాన్ని బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టి, అర్హులైన వారికి అమలు చేస్తాం. గత ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్. తొలిసారి 2014 మార్చి 31ని కటాఫ్‌గా తీసుకుని రూ.16 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసింది. రెండోసారి 2018 డిసెంబరు 11ని కటాఫ్‌గా తీసుకుని రైతుల ఖాతాల్లో వేసిన నిధులు రూ.12 వేల కోట్లు.

గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ కోసం చెల్లించిన నిధులు రూ.28 వేల కోట్లు. గత ప్రభుత్వం 2018 డిసెంబరు 11 కటాఫ్‌గా తీసుకుంటే.. మా సర్కారు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్‌గా తీసుకుంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు రూ.31 వేల కోట్లు అవసరం. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో చేస్తామని, వడ్డీ చెల్లిస్తామని, నిర్ణయాలను వాయిదా వేస్తూ.. రైతులను సంక్షోభంలోకి నెట్టి.. వారి ఆత్మహత్యలకు కారణమైందని ఆరోపించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :