ASBL Koncept Ambience
facebook whatsapp X

Tollywood : రేవంత్ రెడ్డి అంటే సినిమా ఇండస్ట్రీకి లెక్క లేదా..!?

Tollywood : రేవంత్ రెడ్డి అంటే సినిమా ఇండస్ట్రీకి లెక్క లేదా..!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారు. అందుకే ఆయన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. రేవంత్ రెడ్డి కూడా తనకు అప్పగించిన బాధ్యతలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఎవరినీ పెద్దగా కలిసేవారు కాదు. ఆయనకు ఏదైనా సమస్యలు చెప్పుకోవాలన్నా అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం అలా చేయట్లేదు. అడిగిన వాళ్లందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా తనను కలవొచ్చని బహిరంగంగానే చెప్తున్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలుగు సినీ పరిశ్రమ అంటీముట్టనట్టే వ్యవహరించింది. చిరంజీవి, దిల్ రాజు లాంటి కొంతమంది ప్రముఖులు మాత్రమే రేవంత్ రెడ్డిని విష్ చేశారు. నేరుగా వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మిగిలిన ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో కొంతమంది తెలంగాణ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. ఇందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. గద్దర్ పేరిట ఈ అవార్డులు ఇవ్వాలనుకుంటున్నట్టు ఆయన తన మనసులోని మాట చెప్పారు. దీనిపై చర్చించి నిర్ణయం చెప్పాలని సినీ ప్రముఖులను కోరారు.

అయితే నెలలు గడిచినా సీఎం రేవంత్ చేసిన సూచనపై టాలీవుడ్ నుంచి స్పందన రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేశారు. గద్దర పేరిట అవార్డులు ఇవ్వాలని చెప్తే ఇండస్ట్రీ నుంచి స్పందన రాలేదని ఆయన బహిరంగంగానే ఓ వేదికపై అసంతృప్తి తెలియజేశారు. అంతేకాదు.. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నానని.. అందుకు టాలీవుడ్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కోసం పిలుపునివ్వాలని సూచించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలో కంగారు మొదలైంది. వెంటనే పలువురు ప్రముఖులు సమావేశమై అవార్డులపై చర్చించారు. రేవంత్ రెడ్డిని కలిసి సుముఖత వ్యక్తం చేశారు.

ఇక రేవంత్ రెడ్డి శుక్రవారం పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆయన్ను విష్ చేసేందుకు సినీ ప్రముఖులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇదే విషయాన్ని నిర్మాత, నటుడు బండ్లగణేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి సీఎం గుర్తొస్తారు కానీ బర్త్ డే విషెస్ చెప్పేందుకు గుర్తు రారా అని ప్రశ్నించారు. ఇది ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర దుమారానికి కారణమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ తో సినీ ప్రముఖులు ఎంతోమంది అంటకాగారు. రేవంత్ రెడ్డిని మాత్రం టాలీవుడ్ పట్టించుకోవట్లేదు. ఇది కాంగ్రెస్ శ్రేణులకు అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు బండ్లగణేష్ ఏకంగా పుండు మీద కారం చల్లారు. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో వేచి చూడాలి.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :