ASBL NSL Infratech
facebook whatsapp X

వైసీపీని పవన్ కల్యాణ్ ఖాళీ చేయబోతున్నారా..?

వైసీపీని పవన్ కల్యాణ్ ఖాళీ చేయబోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలు పూర్తిగా చప్పబడిపోయాయి. కూటమికి తిరుగులేని మెజారిటీ రావడం.. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. గతంలో కూటమి పార్టీల నేతలను టార్గెట్ చేసి విరుచుకుపడిన వైసీపీ నేతలెవరూ నోరు తెరిచే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పాలిటిక్స్ లో మజా లేకుండా పోయింది. అయితే ఇదే అవకాశంగా భావిస్తున్న అధికార పార్టీలు వైసీపీని పూర్తిగా ఖాళీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఏపీలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. జనసేన ఈ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో జనసేనకు క్షేత్రస్థాయి యంత్రాంగం లేదు. పలు చోట్ల నేతల కొరత కూడా ఉంది. ఈ వాక్యూమ్ ను భర్తీ చేయాలనే ఆలోచనతో పవన్ కల్యాణ్ ఉన్నారు. అందుకే ఎన్నికలు ముగిసిన నెల రోజులకై సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. జనసేన విజయాన్ని చూసిన పలువురు ఔత్సాహికులు ఆ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. అయితే పార్టీకి కావాల్సింది సభ్యత్వాలే కాదు. నేతలు కూడా!

నియోజకవర్గాల్లో కీలక నేతలు లేని చోట ఇతర పార్టీల నేతలను ఆహ్వానించాలని జనసేన నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో పలువురు వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు. వైసీపీ పరాజయం తర్వాత చాలా మంది నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొనడం లేదు. మరికొందరు ఏకంగా ఆ పార్టీకి రాజీనామా కూడా చేశారు. గుంటూరుకు చెందిన కిలారి రోశయ్య, మద్దాళి గిరి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు కుప్పం ఇన్ ఛార్జ్, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

వైసీపీకి రాజీనామా చేసిన, చేయబోతున్న నేతల చూపంతా ఇప్పుడు జనసేన వైపే ఉన్నట్టు సమాచారం. కిలారి రోశయ్య రాజీనామా చేసిన రోజే జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లారు. కానీ చేరలేదు. అయితే ఇప్పుడు కిలారి రోశయ్య, మద్దాళి గిరి, పెండెం దొరబాబు, భరత్ లాంటి నేతలంతా త్వరలోనే జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీళ్లతో పాటు కడప, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరికొంతమంది కీలక నేతలు కూడా జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో అవకాశం లేని నేతలంతా జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం నోటిదురుసు లేని మంచి నేతలను మాత్రమే చేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీకి త్వరలోనే గట్టి షాక్ లు ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయినట్టు సమాచారం.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :