ASBL Koncept Ambience
facebook whatsapp X

అలా చేస్తే వైసీపీకి, టీడీపీకి తేడా ఏముంటుంది..?

అలా చేస్తే వైసీపీకి, టీడీపీకి తేడా ఏముంటుంది..?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత ఐదేళ్లలో వైసీపీ చేసిన పలు పనుల్లోని అవినీతి, అక్రమాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి పది రోజులు కూడా కాలేదు. అప్పుడే పలు అంశాలపై క్లారిటీ ఇస్తోంది. జగన్ హయాంలో ఆ పార్టీకి కొమ్ముకాసిన అధికారులపై చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధికార దుర్వినియోగంతో చేపట్టిన పలు పనులపై కఠిన వైఖరి అవలంబించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ ఇదే వైఖరితో ముందడుగు వేయనున్నట్టు అర్థమవుతోంది.

2019 నుంచి 2024 మే వరకూ ఏపీలో జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ప్రతి జిల్లాలో వైసీపీ కార్యాలయాలకోసం ప్రభుత్వ భూమిని కేటాయించుకుంది. అందులో పార్టీ ఆఫీసుల నిర్మాణం కూడా జోరుగా సాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఆఫీసుల నిర్మాణాలు పూర్తి కాగా.. కొన్నిచోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి. ఎకరా నుంచి 2-3 ఎకరాల వరకూ భూమిని పార్టీ కార్యలయాలకోసం జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో వైసీపీ కార్యాలయాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైసీపీకి కేటాయించిన భూములు అక్రమమని టీడీపీ ఆరోపిస్తోంది.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యాలయాలకోసం ప్రభుత్వం భూమి కేటాయించింది. అదే పని వైసీపీ కూడా చేసింది. అయితే వైసీపీ కార్యలయాలకు కేటాయించిన భూములకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి అనుమతులు రాలేదనేది టీడీపీ చెప్తున్న మాట. భూమిని కేటాయించుకోవడం తప్పు కాదని.. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టడం సరికాదని టీడీపీ నేతలు చెప్తున్నారు. అలాంటి అక్రమ కట్టడాలను ఉపేక్షించే ప్రశ్నే లేదని.. అందుకే కూల్చుతున్నామని ప్రభుత్వాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యలయాన్ని కూల్చేశారు. జిల్లాల్లో అక్రమంగా నిర్మిస్తున్న వాటికి నోటీసులు జారీ చేశారు.

టీడీపీ ప్రభుత్వ చర్యలను వైసీపీ ఖండిస్తోంది. టీడీపీ కూడా భూములను కేటాయించుకుందని.. తాము కేటాయించుకుంటే తప్పా అని ప్రశ్నిస్తోంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నందు వల్లే కూల్చుతున్నామంటోంది టీడీపీ. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదికకు కూడా సక్రమంగా అనుమతులు లేవని కూల్చేసింది. ఇప్పుడు తాము కూడా అదే పని చేస్తున్నామని టీడీపీ చెప్తోంది. అయితే నాడు అలాంటి పనులు చేయడం వల్లే వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తే వైసీపీకి, టీడీపీకి తేడా ఏముంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :