ASBL Koncept Ambience
facebook whatsapp X

రేవంత్ కు మున్ముందు గడ్డుకాలమేనా..?

రేవంత్ కు మున్ముందు గడ్డుకాలమేనా..?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైన నేతల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒకరు. అందులోనూ అపరచాణక్యుడు కేసీఆర్ పార్టీని మట్టికరిపించి మరీ హస్తానికి పాలన సాధించారు రేవంత్. ఈగెలుపుతో రేవంత్ ఇమేజ్ జాతీయస్థాయిలోనూ ఇనుమడించింది. అయితే ఇప్పుడు అదికాస్తా మూడునాళ్ల ముచ్చటలా మిగిలిపోనుందా? అన్న సందేహం కాంగ్రెస్ శ్రేణులను వేధిస్తోంది. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్.. డబుల్ డిజిట్ మార్క్ దాటలేదు. దీంతో రేవంత్ ఇమేజ్ మసకబారే ప్రమాదం కనిపిస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందున్నది గడ్డు కాలమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ గడ్డు కాలం తప్పదనే విధంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి.17 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే అధికార పార్టీ కనీసం 10 లోక్ సభ సీట్లు గెలవకపోవడంపై ఆపార్టీ హైకమాండ్ సీరియస్ గానే తీసుకుంది. అయితే ఎన్నికల ఫలితాలకు సీఎం, టీపీసీసీ చీఫ్ రెండు పదవుల్లో ఉన్న రేవంత్ రెడ్డి వివరణ కోరినట్లు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలోని మహబూబ్ నగర్, గతంలో తాను గెలిచిన మల్కాజ్ గిరిలోనూ రెండు చోట్ల కాంగ్రెస్ ఓటమికి కారణం ఏమిటని సూటిగా ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గడంపై ఆయా రాష్ట్రాల కీలక నేతలను జవాబు చెప్పమంటోంది హస్తం పార్టీ. అంతే కీలక స్థానాల్లో ఓడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవాలని..లేక రాష్ట్రంలో నాయకత్వ లోపం ఏమైనా ఉందా అనే విషయాన్ని కనుగొనడానికి ఏఐసీసీ నిజ నిర్ధారణ కమిటీని కూడా వేసింది. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో పంచాయితీ, మున్సిపల్,గ్రేటర్ ఎన్నికల వరకు హైకమాండ్ చూస్తూ ఉంటుందా లేక ఎన్నికల బాధ్యతల్ని మరెవరికైనా అప్పగిస్తుందా అనే చర్చ ఇప్పటి నుంచే జరుగుతోంది.

ఓటమికి కారణాలు ఏంటో చెప్పండి..

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు ..పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికే బీజేపీకి మొగ్గు చూపారు. రాష్ట్రంలో అధికార పార్టీని కాదని బీజేపీని ఆదరించడం వెనుక కారణం ఏమై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ స్టడీ చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని ఓటమికి గల కారణాలు చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తూ వివరణ కోరింది ఏఐసీసీ.తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి దేశ వ్యాప్తంగా జనం మంచి మార్కులు వేసి ..ఎక్కువ స్థానాల్లో గెలిపించారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకపోవడానికి నాయకత్వ లోపం ఏమైనా ఉందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూనే వివరణ ఇవ్వాలని కోరుతోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :