ASBL NSL Infratech

డల్లాసు లో నెల నెలా తెలుగు వెన్నెల ద్విశత మాసోత్సవం మరియు వార్షికోత్సవం

డల్లాసు లో నెల నెలా తెలుగు వెన్నెల ద్విశత మాసోత్సవం మరియు వార్షికోత్సవం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహించిన ద్విశత మాసోత్సవం మరియు వార్షికోత్సవ సాహితీ సదస్సు “నెలా నెలా తెలుగు వెన్నెల” నాట్య సంగీత సాహిత్య కార్యక్రమాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగి రంజింపజేసింది. ప్లేనో నగరంలోని షిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణ వేదికపై సాగిన కార్యక్రమానికి సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జయప్రదంచేశారు. గత రెండు వందల మాసాలు అప్రతిహత ధారావాహికగా కొనసాగుతూ భాషాప్రేమికుల ఆదరణను పొంది సాహిత్యానురక్తి కలిగిన ఔత్సాహికులకొక ఆత్మీయ వేదికగా వెలుగొందుతున్న తెలుగు వెన్నెల ద్విశత మాసోత్సవం మరియు వార్షికోత్సవ సదస్సు, చిన్నారి సమన్విత మాడ ఆలపించిన “వాతాపిగణపతిమ్ భజేహమ్” ముత్తుస్వామి దీక్షితర్ గణపతి కీర్తన తో ప్రారంభమైంది.

టాంటెక్స్ సంస్థ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు అధ్యక్షోపన్యాసం చేయగా సదస్సు సమన్వయ కర్త, సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేశారు. తరువాత ఈమధ్య దైవ సాన్నిధ్యం చేరిన ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు, తెలుగు వారి తెలుగు తేజం శ్రీ చెరుకూరి రామోజీ రావు గారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

సాంస్కృతిక విభాగంలో భాగంగా చిన్నారుల నాట్య బృందాలు రమ్యంగా నర్తించి ఆకట్టుకున్నవి.

“జయము జయము లలిత కళావాణికి” గురు స్వప్నశ్రీ చోకటి గారి విద్యార్థినులచే, రామాయణ శబ్దం గురు సింధుజా ఘట్టమనేని గారి చిన్నారులచే, “కంజదళాయకాక్షి” గురు కళ్యాణి ఆవుల శిష్యురాళ్ళచే ప్రదర్శించబడ్డాయి. ప్రముఖ ఆంధ్రనాట్యకళాకారులు చంద్రశేఖర్ రెడ్డి లోకా (చందు) గారు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు కూర్చిన నవజనార్ధన పారిజాతం నృత్య నాటిక నుండి సత్యభామ పాత్రను అభినయించే రెండు నృత్యాలు “సిగ్గాయెనమ్మ”, “చందమామ చందమామ సుందర కృష్ణుడేడే” ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్త్రీ వేషధారణ లో శాస్త్రీయ నృత్యం, చలనచిత్ర గేయాలకు నాట్యం చేయగలిగిన అసాధారణ ప్రతిభ చందు గారి సొంతం.

సంగీత విభాగంలో ప్రముఖ గాయని, పాడుతా తీయగా ఫేం కుమారి శివాత్మిక “పాల కడలి పై శేష తల్పమున” అన్న సినీగేయాన్ని మధురంగా పాడి, తరువాత నెలా నెలా తెలుగు వెన్నెల ద్విశత మాసోత్సవ సందర్భంగా శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రాసిన ఉత్సవ గీతాన్ని కూడా పాడి ప్రశంసలందుకున్నారు. చిన్నారులు సమన్విత మాడ, సింధూర వేముల సుప్రసిద్ధ దేశభక్తి గేయం “ఏదేశ మేగినా” పూర్తి పాఠాన్ని స్వరమధురంగా పాడారు. మహాకవి రాయప్రోలు గారి అతి సుందర భవనాత్మత పాదాలను విస్పష్టంగా ఉచ్ఛరిస్తూ చిన్నారులు పాడిన రీతి సభను భక్తి పారవశ్యం చేసింది.

సాహిత్య విభాగ ప్రారంభంలో ప్రముఖ ప్రవచనకారులు, ఆథ్యాత్మిక ప్రచారకులు తట్టా శ్రీనివాస చక్రవర్తి గారు “ఆధునిక సమాజం పై భగవద్గీత ప్రయోజనం” అన్న అంశం లో భాగంగా ప్రసిద్ధ భగవద్గీత శ్లోకాలను ప్రస్తుతించి నేటి సమాజజీవన ప్రయోజనానికెలా వర్తిస్తాయో వివరించారు. ప్రఖ్యాత హాస్య రచయిత, బహు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కర్త శ్రీ సాయి లక్కరాజు గారు విశిష్ట అతిధి గా “జన హితం-సాహిత్యం” అనే అంశంపై ప్రసంగించి ఆకట్టుకున్నారు. సభకు విచ్చేసిన విశిష్ట అతిధి ప్రముఖ కూచిపూడి నాట్యగురవులు కళారత్న కే.వి.సత్యనారాయణ గారు సన్మానం పొందిన తరువాత ప్రసంగిస్తూ, సంస్కృతం సకల భారతీయ భాషలకూ మూలమని, తత్సమ తద్భవ పదాలను గుర్తించి వాడకలో ఉపయోగించడం ద్వారా భాషా వ్యాప్తి పరిపుష్టమౌతుందని సందేశమిచ్చారు. ప్రతీమాసం విశేషాదరణ పొందిన “మన తెలుగు సిరిసంపదలు” కార్యక్రమాన్ని ఎప్పటివలే ఊరుమిండి నరసింహారెడ్డి గారు నిర్వహించగా, ప్రశ్న జవాబుల పరంపర సభలో ఉన్నవారందరి భాషాపరిజ్ఞానాన్ని పెంపుచేసింది.

ప్రసిద్ధ చలనచిత్ర గేయ, లలిత గేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు “లలితగీత వికాసం” అనే అంశం గురించి మాట్లాడుతూ గేయరచనా రీతి, స్వరూప స్వాభావాలు, ప్రస్థాన క్రమం సాధికారికంగా వివరించారు. భావకవితా పరిణామక్రమం, దాని సొబగులు లలిత గేయానికెలా చేకూరాయో విజ్ఞానాత్మకంగా వర్ణించారు. ప్రఖ్యాత సినీ దర్శకులు వి. ఎన్. ఆదిత్య గారు "సినీమాయాజాలం" అన్న విషయం పై ప్రసంగిస్తూ చిత్రరంగంలో ఉండే అనుకూల ప్రతికూల పరిస్థితులు సర్వస్వం కళామతల్లిని నమ్ముకున్న ఔత్సాహికులపై చూపే ప్రభావాన్ని తన అనుభవాల నేపధ్యం ఆధారంగా వివరించారు. ఇక చివరి అంశంగా ముఖ్య అతిధి శ్రీ తనికెళ్ళ భరణి తో ముఖాముఖి కార్యక్రమం పూర్తిస్థాయి రసవత్తరత సాధించింది. నాటకరచనా, నటనా రంగాలలో, రచయిత గా దర్శకునిగా అనేక జీవన సాఫల్యాలను సాధించి, తెలుగు సమాజం పై తనదైన ముద్ర కలిగిఉన్న భరణి గారి జీవితంలోని ప్రతీ మలుపు గురించి ఏ ఒక్కటీ విడువకుండా సభాసదులు సంధించిన ప్రశ్నలకు అడిగిన తడవే తటాలున వెలువడ్డ చమత్కార భరిత సమాధానాలు ఔరా అనిపించినవి. గొప్ప పఠనా విస్తృతి, నాటక చలనచిత్ర రంగాలపై అటు వ్యాపార పరంగానూ ఇటు కళారాధన దృష్టికోణంలోనూ, సమాజ శ్రేయస్సు, చూపే ప్రభావాల పై ఉన్న లోతైన విషయ పరిజ్ఞానం భరణి గారు వారొక్కరే చెప్పగలరన్నంత రీతిలో మాటామంతీ కార్యక్రమాన్ని సమయాన్ని మరచిపోయే విధంగా సాగించారు.

కార్యక్రమంలో భాగంగా నెల నెలా తెలుగు వెన్నెల వ్యవస్థాపక సభ్యులని, పూర్వ సమన్వయ కర్తలను, టాంటెక్సు పూర్వ అధ్యక్షులను, భాషా కార్యక్రమాలు క్రమం తప్పక నడిపించే క్రమంలో సేవలందించిన ఔత్సాహికులనూ, ఉదారంగా కార్యక్రమ నిర్వహణకు కావలసిన నిధులందించిన దాతలను వేదిక పైకి పేరు పేరునా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు పిలిచి కృతజ్ఞతలు చాటడం జరిగింది. ప్రసాద్ తోటకూరగారు వ్యవస్థాపకుల పక్షాన క్లుప్తంగా సాహిత్యవేదిక ఆవిర్భావ వికాస ప్రస్థానాలను గుర్తుచేసి, వక్తలనూ, అతిధులనూ భాషా సేవలో సంస్థ వారి పాత్రనూ కొనియాడారు. వేదిక పై కార్యక్రమాన్ని అతిసవ్యంగా ఉత్సాహభరితంగా నిర్వహించిన దయాకర్ మాడా గారికి, కార్యక్రమనిర్వహణకు సేవలందించిన ప్రతీవారికీ ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం అద్యక్షులు సతీష్ బండారు గారు ధన్యవాదాలు తెలిపారు.

ఫుడిస్తాన్ వారి అల్పాహారం, తేనీటి విందు ఆహూతులను రంజింప చేశాయి కార్యక్రమానికి ఆర్ధికంగా చేయూతనిచ్చిన దాతలకూ మరీముఖ్యంగా తమ సహకారాన్ని అందించిన డాక్టర్ పుదూరు జగదీశ్వరన్ గారికీ ,డాక్టర్ కృష్ణ బాబు చుండూరి గారికీ వాలంటీర్లకూ సంస్థ పాలకమండలి అధ్యక్షులు శ్రీ సురేష్ మండువ గారు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు .సాహితీ ప్రియుల మన్నలను విశేషంగా అందుకొన్న ఈ సదస్సును విజయ వంతం చేసిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారు, పాలక మండలి సభ్యులు మరియు టాంటెక్స్ సాహిత్య వేదిక అధ్యక్షులు శ్రీ దయాకర్ మాడా గారు మరియు టాంటెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటి మరియు పాలకమండలి సభ్యులు అభినందనీయులు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :