ASBL Koncept Ambience
facebook whatsapp X

టీడీపీ వైపు.. బీఆర్ఎస్ నేతల చూపు..!? సూపర్ స్కెచ్ వేశారుగా..?

టీడీపీ వైపు.. బీఆర్ఎస్ నేతల చూపు..!? సూపర్ స్కెచ్ వేశారుగా..?

తెలంగాణలో పదేళ్లపాటు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం ఆపసోపాలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం.., లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం.. ఓ వైపు కేసులు.. మరోవైపు అరెస్టులు.. ఆ పార్టీ నేతలను కంగారు పెట్టిస్తున్నాయి. దీంతో సేఫ్ జోన్ కోసం ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు టీడీపీలో చేరేందుకు కూడా కొందరు నేతలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ దూసుకుపోతోంది. మరి ఇలాంటప్పుడు ఆ రెండింటినీ కాదని టీడీపీ వైపు కొందరు నేతలు ఎందుకు చూస్తున్నారనేది ఆసక్తి కలిగిస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పాతికేళ్లపాటు ఓ వెలుగు వెలిగింది తెలుగుదేశం. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. 1983లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి 2014 వరకూ కాంగ్రెస్, టీడీపీలే అధికారాన్ని పంచుకుంటూ వచ్చాయి. అయితే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ తెలంగాణకు దూరమైంది. 2018లో టీడీపీకి 3.51శాతం ఓట్లు 2 సీట్లు దక్కాయి. 2014లో 12శాతం ఓట్లు 15 సీట్లు లభించాయి. అయితే వీళ్లంతా తర్వాత ఆధికార బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో పార్టీని నడిపించే నాయకులు లేకుండా పోయారు. చిన్నాచితకా లీడర్లు టీడీపీలో ఉన్నా పార్టీని సమర్థంగా నడిపించే నాయకులు లేకుండా పోయారు.

తెలంగాణలో తెలుగుదేశం ప్రాభవం కోల్పోయినా ఆ పార్టీని అభిమానించే కార్యకర్తలు ఎంతోమంది ఇప్పటికీ ఉన్నారు. సమర్థమంతమైన లీడర్లు దొరికితే పార్టీకి మళ్లీ పునర్వైభవం ఖాయమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి వరకూ టీడీపీని ఆంధ్రాపార్టీగా విమర్శిస్తూ వచ్చింది బీఆర్ఎస్. అయితే ఆ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చుకునిందో అప్పటి నుంచి అలాంటి ఆరోపణలు చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. సరిగ్గా దీన్నే అస్త్రంగా చేసుకుని ఎదగాలనుకుంటోంది టీడీపీ. బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారడంతో పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయమనుకుంటోంది టీడీపీ.

బీఆర్ఎస్ పార్టీలో 80శాతం నేతలు టీడీపీ నుంచి వెళ్లినవారే. ఇప్పటికీ టీడీపీని అభిమానించే నేతలెంతో మంది బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేందుకు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల్లో చేరి ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలను చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కేడర్ ఒప్పుకోవట్లేదు. స్థానికంగా బలమైన నేతలు అక్కడ డడమే ఇందుకు కారణం. అలాంటి చోట్ల నేతలు టీడీపీని వేదికగా ఎంచుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అదే సమయంలో చంద్రబాబు కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఇలాంటప్పుడు టీడీపీలో చేరితే ఇటు రాష్ట్రం, అటు కేంద్రం నుంచి రక్షణ పొందవచ్చనే ఆలోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కొందరు కీలక నేతలు టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :