డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లతో సాంకేతిక నైపుణ్యం - జయరాం కోమటి

03-08-2017

డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లతో సాంకేతిక నైపుణ్యం - జయరాం కోమటి

సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయడం జరుగుతోందని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం వల్ల నాణ్యమైన విద్యను నేర్చుకోవడంతోపాటు ఉన్నతస్థాయికి ఎదగవచ్చని కూడా  చెప్పారు. తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవి నేడు ఈ స్థితికి వచ్చామని అన్నారు. గూడూరు మండలం మల్లవోలు జడ్పీ ఉన్నత పాఠశాల, మెయిన్‌ ప్రాథమిక పాఠశాలల్లో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు ప్రతిపాటి వీరబాబు, రెడ్డియ్య అందజేసిన రూ.3 లక్షలతో డిజిటల్‌ తరగతి సౌకర్యాలను ప్రారంభించిన తరువాత జయరాం కోమటి మాట్లాడారు.

జిల్లాలో ఇప్పటివరకు 70 పాఠశాలలకు డిజిటల్‌ సౌకర్యం కల్పించామన్నారు. ఈ ఏడాది చివరికి పెడవ నియోజకవర్గంలోని అన్ని జడ్పీ ఉన్నత పాఠశాలలు, తరగతులను అందుబాటులోకి తెస్తామన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతోనే, ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకున్నామని, మరోవైపు ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉంటారన్నారు. వీరబాబు రెడ్డియ్యలను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌ వరప్రసాదు మాట్లాడుతూ ప్రభుత్వ  పాఠశాలల్లో ఉపాధ్యాయులు పీజీలు చేసి లక్షల మందితో పోటీపడి ఉద్యోగం సాధిస్తారని, వీరిలో బోధన నైపుణ్యం ఉంటుందన్నారు. తెలుగుతోపాటు ఇంగ్లిస్‌ భాషపై కూడా పట్టు సాధిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చన్నారు.

తానా ప్రతినిధి చలపతి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, అవి లేని సమయంలో చదువకున్న తామంతా ఉన్నతస్థితిలో ఉన్నామంటే,. ఇప్పటి విద్యార్థులు ఇంతకన్నా ఉన్నతస్థితిలో ఉండవచ్చన్నారు. డ్వామీ పీడీ రాజగోపాల్‌ మాట్లాడుతూ నిత్య విద్యార్థిలా ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకుంటారని తెలిపారు. దాతలు వీరబాబు, రెడ్డియ్య మాట్లాడుతూ డిజిటల్‌ తరగతులను సక్రమంగా వినియోగించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందన్నారు. గ్రామంలో శ్మశనవాటిక అభివృద్ధి కి కూడా తమవంతు సహకారం అందిస్తామని ప్రకటించారు.పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సహకరించాలని కోరారు.

అనంతరం దాతల తల్లిదండ్రులు నరసింహారావు, అలివేలు మంగమ్మను ఘనంగా సత్కరించారు. పీఏ సీఎస్‌ అధ్యక్షుడు చీడేపూడి ఏడుకొండలు పాఠశాలకు రెండు ఫ్యానులు బహుకరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్క్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయుడు వెంట్రపాటి పాండురంగరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు చిలుకోటీ గోపాలకృష్ణగోఖలే, ఉప ఎంపీపీ అల్లు శిరీష్‌, డీసీ చైర్మన్‌ పోతన లక్ష్మీ నరసింహస్వామి, డీఎల్‌పీవో సత్యనారాయణ,  డీవైఈవో గిరికుమారి, ఎమ్యీవో తోట వెంకటేశ్వరరావు, తదితరులు ప్రసంగించారు. నీటీ సంఘం అధ్యక్షుడు అల్లు నరసింహస్వామి, ముద్దినేని రాధాకృష్ణమూర్తి, కొండ, పలువురు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.