తెలంగాణ కమలదళం నాయకుడు ఎవరు?

తెలంగాణ కమలదళం నాయకుడు ఎవరు?

04-03-2020

తెలంగాణ కమలదళం నాయకుడు ఎవరు?

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న కె.లక్ష్మణ్‍ పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం కసరత్తును పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. కానీ, ఇప్పటి వరకూ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. మరోవైపు ఈ పదవికోసం చాలామంది సీనియర్‍ నాయకులు పోటీ పడుతున్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ ఆశలు పెద్దవిగానే ఉన్నాయి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా చాలా సీరియస్‍గా ఆలోచిస్తోంది అధిష్టానం. రాష్ట్రంలో బలమైన టీఆర్‍ఎస్‍ను మరింత సమర్థంగా ఎలా ఢీకొట్టాలనే దానిపై పార్టీ పెద్దలు కసరత్తే చేస్తున్నారట. బలమైన నాయకత్వాన్ని నియమించి పార్టీని పటిష్టంగా మార్చాలని వ్యూహ రచన చేసిందని చెబుతున్నారు. అధ్యక్ష పీఠాన్ని ఎవరికి అప్పగించాలనే విషయమై పార్టీ అధిష్టానం ఈ మధ్య ఇద్దరు సభ్యులతో కూడిన ఒక టీమ్‍ను సైతం పంపించి అభిప్రాయ సేకరణ చేసింది. పార్టీ జనరల్‍ సెక్రటరీ అనిల్‍ జైన్‍, ఉపాధ్యక్షుడు జయ పాండ వచ్చి రాష్ట్ర కోర్‍ కమిటీ, ఆఫీస్‍ బేరర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు 40 మంది నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన కమిటీ సీల్డ్ కవర్‍లో వివరాలను పార్టీ అధిష్టానానికి అప్పగించింది.

పార్టీ అధ్యక్ష స్థానం కోసం పార్టీలో చాలా మంది పోటీ పడుతున్నారు. మరి ఎవరిని ఆ సీట్లో కూర్చోబెడతారోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‍ తనకు మరోసారి అవకాశం కల్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు ఎంపీలుగా ఉన్న బండి సంజయ్‍, ధర్మపురి అరవింద్‍, పార్టీ సీనియర్లు చింతల రామచంద్రారెడ్డి, పేరాల శేఖర్‍రావు, ఎన్వీఎస్‍ ప్రభాకర్‍ కూడా ప్రయత్నాలు సాగించారు. వీరితోపాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు డీకే అరుణ, జితేందర్‍ రెడ్డి కూడా తమకు అధ్యక్ష పదవి కావాలని కోరారు. కానీ, వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న క్లూ మాత్రం ఎవరికీ దొరకడం లేదంటున్నారు. అధ్యక్ష కుర్చీ కోసం అనేక మంది పోటీ పడినప్పటికీ సీరియస్‍ పోటీ మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‍తో పాటు మాజీ మంత్రి డీకే అరుణ, కరీంనగర్‍ ఎంపీ బండి సంజయ్‍ మధ్యనే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ విషయంపై ఒక ప్రకటన వచ్చేస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు ధర్మపురి అరవింద్‍ పేరు కూడా పైకి వచ్చింది. నిజామాబాద్‍ పార్లమెంట్‍ ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసీఆర్‍ కూతురు కవితను ఓడించి, జాతీయస్థాయిలో అందరి ద•ష్టినీ ఆకర్షించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‍ పేరును కూడా, చాలామంది అధ్యక్ష పదవికి సూచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అర్వింద్‍కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, పార్టీ మరింత దూకుడుగా ముందుకెళుతుందని, అధిష్టానానికి కొందరు సీనియర్లు చెబుతున్నారట. ఇక కరీంనగర్‍ పార్లమెంట్‍ ఎన్నికల్లో గెలిచి, ఫైర్‍ బ్రాండ్‍ లీడర్‍గా పాపులర్‍ అవుతున్న బండి సంజయ్‍ సైతం, అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‍ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు సీనియర్ల ద్వారా, ఆయన పావులు కదుపుతున్నట్ట కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి డీకే అరుణ పేరు కూడా బీజేపీ ప్రెసిడెంట్‍ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మహిళా నేత కావడం, కేసీఆర్‍పై ముందు నుంచి దూకుడుగా మాట్లాడే నాయకురాలు కావడంతో సహజంగానే ఆమె పేరు తెరపైకి వస్తోంది. డీకే అరుణకు పగ్గాలు అప్పగిస్తే, ఇతర కాంగ్రెస్‍ నాయకులు సైతం బీజేపీకి క్యూ కడతారని, క్షేత్రస్థాయిలో కొత్త క్యాడర్‍ పార్టీకి జత కలుస్తుందని కొందరు అరుణ పేరును సూచిస్తున్నారట. బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్‍ ఆశీస్సులు కూడా అరుణకు వున్నాయని అంటున్నారు. మరోవైపు బీజేపీ సీనియర్‍ నేత మురళీధర్‍ రావు కూడా, ప్రెసిడెంట్‍ పదవి కోసం హస్తినస్థాయిలో లాబీయింగ్‍ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇలా ఎవరికి వారు బీజేపీ అధ్యక్ష పీఠం కోసం పావులు కదుపుతున్నారు. అయితే, అధ్యక్షుని ఎంపికపై పార్టీ మొత్తం గ్రూపులుగా విడిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి, అధ్యక్ష పదవి ఇవ్వొద్దని కొందరు డిమాండ్‍ చేస్తున్నారు.

బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడి, దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నవారికి అవకాశం ఇవ్వాలని సీనియర్లు అధిష్టానానికి విన్నవిస్తున్నారు. అయితే, కొత్తవారైనా, పాతవారైనా సమర్థులుండాలని, పార్టీ ఎదుగుతున్న క్రమంలో, కొత్త నీరు అవసరమని కూడా, మరికొందరు అమిత్‍ షాకు చెబుతున్నారట. ఇలా పాతకొత్త గొడవలు, చాలాపేర్లు తెరపైకి వస్తుండటంతో, ఎవరిని ఎంపిక చేస్తే, ఏమవుతుందోనని పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తోందని, అందువల్లే నాయకుని విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేకోపోతున్నదని అంటున్నారు. ఏదీ ఏమైనా అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉంది కాబట్టి ఈ పదవి ఎవరికి లభిస్తుందో చూడాలి.