ట్రంప్ పర్యటన లాభిస్తుందా?

ట్రంప్ పర్యటన లాభిస్తుందా?

17-02-2020

ట్రంప్ పర్యటన లాభిస్తుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన ఖరారుకావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన పర్యటనకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు ఆయన పర్యటన వల్ల భారత్‌కు లాభం కలుగుతుందా? లేక అమెరికా వ్యాపారానికి ఉపయోగపడేలా ఉంటుందా అన్న విషయమై సరైన స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనను పురస్కరించుకుని ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎయిర్‌పోర్టు నుంచి అహ్మదాబాద్‌ స్టేడియం వరకూ రోడ్డుకు ఇరువైపులా లక్షమంది బారులు  తీరి స్వాగతం పలకనున్నారు. ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా రికార్డుకు ఎక్కబోతున్న అహ్మదాబాద్‌ స్టేడియాన్ని ట్రంప్‌ అధికారికంగా ఆరంభించి, కనీసం లక్షమందిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గత ఏడాది హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోడీ’ తరహాలో, ఆ స్థాయిలో అహ్మదాబాద్‌ స్టేడియంలో ‘కెమ్‌ చో ట్రంప్‌’ (హౌ ఆర్‌ యూ ట్రంప్‌) సభ జరగబోతున్నది. ట్రంప్‌ స్వయంగా కోరడంతో మోదీ ఇందుకు ఉపక్రమించినట్టు కూడా వార్తలు వచ్చాయి. చైనా అధ్యక్షుడు, ఇజ్రాయెల్‌, జపాన్‌ ప్రధానులు ఇత్యాది విదేశీ అతిథులకు మోదీ స్వరాష్ట్రంలో ఆతిథ్యం ఇవ్వడం గతంలో చూసిందే. పైగా, ట్రంప్‌ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అమెరికా ప్రవాసులు, అందునా గణనీయమైన సంఖ్యలో ఉన్న గుజరాతీలు కనుక ఇక్కడ జరగవలసిందే.

దేశప్రజలందరూ తమ మాతృభాషల్లో ట్రంప్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా స్వాగత వచనాలు పలకమని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మోదీ ఆశిస్తున్నట్టుగా ట్రంప్‌ పర్యటన ఇరుదేశాల సంబంధాలు ధృఢపడేందుకు ఉపకరిస్తుంది, పరస్పర సహకారానికి పునాదులు వేస్తుంది.  కానీ, కీలకమైన వాణిజ్య ఒప్పందం అంశాన్నే ట్రంప్‌ తేలికగా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఇండియన్స్‌ ఏదో అడుగుతున్నారు కానీ, సరిగ్గా ఉంటేనే అది జరుగుతుందనడం, ‘రైట్‌ డీల్‌ - నో డీల్‌’ అనేయడం కేవలం ముందు జాగ్రత్తతో చేసినవా లేక ఒప్పందంలోని అంశాలు ఇంకా కొలిక్కిరాలేదా అన్న అనుమానం రేకెత్తిస్తున్నాయి. ట్రంప్‌ పర్యటనలో ప్రధానాంశం ఈ ఒప్పందమేనని ఎప్పటినుంచో అనుకుంటుంటే, ఇప్పుడాయన దీని గురించి ఇంత తక్కువ మాట్లాడటం విచిత్రమే. అమెరికా డైరీ ఉత్పత్తులకు, వైద్యపరికరాలకు భారతదేశం తన మార్కెట్లు తెరవాలనీ, మరిన్ని రాయితీలు ఇవ్వాలని ట్రంప్‌ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా ట్రంప్‌ ఇటీవల రద్దుచేసిపారేసిన గతకాపు హోదాలన్నీ తనకు తిరిగికట్టబెట్టాని భారత్‌ అడుగుతున్నది. భారత్‌తో ట్రంప్‌ ఇటీవలికాలంలో పోటాపోటీ సుంకాల యుద్ధం సాగించిన నేపథ్యంలో, అటువంటి రాకుండా ఏదో ఒక ఒప్పందం చేసుకోవడం అవసరం. అదేమీ లేకుండా ‘హౌ ఆర్‌ యూ’ అంటూ ట్రంప్‌ ఎన్నిక విజయానికి ఉపకరించే పకరింపు వల్లా, ఆయుధాల కొనుగోలు ఒప్పందాల వల్లా భారత్‌కు పెద్దగా లాభించేదేమీ ఉండదని చెబుతున్నారు.

దిగుమతుల విషయంలో ఇరుదేశాలు పోటాపోటీగా సుంకాలు విధించుకున్న నేపథ్యంలో పరిమిత స్థాయి ఒప్పందం కోసం ఇరుదేశా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలావుండగా 2017 తర్వాత అమెరికా నుంచి భారత రక్షణ కొనుగోళ్ల మొత్తం 17 బిలియన్‌ డార్లకు చేరింది. రష్యాను కాదని మరీ అమెరికా నుంచి కొనుగోళ్లు పెరిగాయి. మిలిటరీ ఆయుధాలను ఆధునీకరించుకోవాలనే యోచనలో భాగంగా భారత్‌ కొనుగోళ్లు పెంచింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన సందర్భంగా భారీ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాని భారత్‌ భావిస్తోంది. అమెరికా రక్షణ సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌ నుంచి ఇండియన్‌ నేవీ కోసం హెలీకాప్టర్ల కొనుగోలు కోసం భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని యోచిస్తోంది. ఈ ఒప్పందం విలువ రూ.2.6 బిలియన్‌ డార్ల(దాదాపు రూ.18 వే 500 కోట్లు) ఉంటుందని రక్షణశాఖ, పరిశ్రమకు చెందిన వర్గాలు వేర్వేరుగా వెల్లడించాయి. మొత్తం 24 ఎంహెచ్‌-60ఆర్‌ సీహౌక్‌ హెలీకాప్టర్లను కొనుగోలు చేయాని భావిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపే అంచనాలున్నాయని రక్షణ శాఖకు చెందిన అధికారి పేర్కొన్నారు. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా కీకమైన ప్రకటన చేసింది. 1.87 బిలియన్‌ డార్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వెపన్‌ సిస్టం కావాలని కోరిన భారత వినతిని అంగీకరించామని వెల్లడించింది. ఈ నిర్ణయం ఇరుదేశాల మధ్య రక్షణ బంధాలను బలపరచనుందని పేర్కొంది. ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీంట్లో భాగంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరగనున్నాయి. ఏదీ ఏమైనా అమెరికా వ్యాపారవృద్ధికి కాకుండా మనకు ఉపయోగపడేలా ఒప్పందం కుదిరితే ట్రంప్‌ పర్యటన భారత్‌కు లాభదాయకం అని చెప్పవచ్చు. లేకుంటా ట్రంప్‌ ప్రచారానికి ఈ పర్యటన ఉపయోగపడవచ్చని భావించవచ్చు.