Review of Tollywood Movies 2019

దక్షిణ చలనచిత్రరంగంలో ఎక్కువ సినిమాలను నిర్మించి రిలీజ్‌ చేయడంలో టాలీవుడ్‌ సినిమారంగం ఎప్పుడూ ముందుంటోంది. 2019 సంవత్సరంలో కూడా తెలుగు సినిమాలు భారీ ఎత్తున రిలీజయ్యాయి. దాదాపు 191 చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో 76 డబ్బింగ్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాల్లో భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాగా రిలీజ్‌లు ఎక్కువే ఉన్నా విజయాలు మాత్రం అందులో పదిశాతం కూడా లేదని చెప్పవచ్చు. ఎక్కువ బడ్జెట్‌తో వచ్చిన చిత్రాలు ఓపెనింగ్స్‌లో కలెక్షన్‌లు రాబట్టుకుంది. చిన్న సినిమాలు ఓ మోస్తరు కలెక్షన్‌లను అందుకుని ఫర్వాలేదనిపించింది.

ఈ ఏడాదిలో 191 తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. ప్రారంభంలో కనిపించిన జోరు మధ్యలో లేకపోయినా, చివర్లో మాత్రం మళ్ళీ జోరందుకుంది. సంక్రాంతి సినిమాలు అందించే విజయం ఏడాది మొత్తం కనిపిస్తుంది. 2019లో సంక్రాంతి సినిమాలుగా వచ్చిన మాస్‌ సినిమాలు బోల్తా పడ్డాయి. దీనికి భిన్నంగా కామెడీ చిత్రం ఎఫ్‌ 2 మాత్రం విజయాన్ని నమోదు చేసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన వినయ విధేయ రామ ఫ్లాప్‌ కావడం నిరాశను తెచ్చిపెట్టింది. రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ సినిమా. కానీ నేలవిడిచి సాము చేయడంతో ప్రయత్నం విఫలమైంది. ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ కథానాయకుడు సైతం నిరాశపరిచింది. అరుదైన ప్రయత్నం తొందరపాటు వల్ల తేలిపోయిందనే విమర్శలు తప్పలేదు. అక్కినేని వారసుడు నటించిన మిస్టర్‌ మజ్ను సైతం ఆకట్టుకోలేకపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ పాతయాత్ర స్ఫూర్తితో తీసిన యాత్ర సినిమా మాత్రమే ఆదరణ చూరగొంది. వైఎస్‌ పాత్రలో మమ్ముట్టి జీవించారు.

తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్‌ రాజకీయ జీవితకత మహానాయకుడు సైతం ఆకట్టుకోలేకపోయింది. కథానాయకుడు, మహానాయకుడు బయ్యర్లకు నష్టాన్ని మిగిల్చాయనే మాట వినిపించింది. తరువాత చిన్న సినిమాల రిలీజ్‌ జోరు అందుకుంది. అందులో కల్యాణ్‌ రామ్‌ నటించిన 118 చిత్రం మాత్రం కమర్షియల్‌గా నిలబడింది. వివాదస్పద చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ బాల్చీ తన్నేసింది. కొణదెల వారి ఆడపడుచు నిహారిక నటించిన సూర్యకాంతం సైతం ఆకట్టుకోలేదు. నాగచైతన్య, సమంత కలిసి నటించిన మజిలి సినిమా సుమారు 50 కోట్లు కలెక్ట్‌ చేసింది. నాని నటించిన జెర్సీ సినిమా కమర్షియల్‌గా బిగ్‌ హిట్‌. అలాగే సక్సెస్‌ కోసం చూస్తున్న సాయితేజ్‌కు చిత్రలహరి సంతప్తిని ఇచ్చింది. ఫలక్‌నుమా దాస్‌ సైతం చిన్న సినిమాల్లో హిట్‌గా నిలిచింది. దర్శకుడు తేజ అందించిన సీత సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిలదొక్కుకోలేక పోయింది.  ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ, బ్రోచేవారెవరురా చిత్రాలు ఆదరణ చూరగొన్నాయి. ఏజెంట్‌.. సినిమాకు పరిశ్రమ పెద్దల నుండి కూడా అభినందనలు అందాయి. ఇక చింతకింద మల్లేశ్‌ బయోపిక్‌ ఆకట్టుకోలేకపోయింది.

చాలా సంవత్సరాలు మూలనపడిన ఓటర్‌ విడుదలైంది. తాప్సీ నటించిన గేమ్‌ ఓవర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఓ బేబీ చిత్రం సూపర్‌హిట్‌ కావడం విశేషం. సమంత, సీనియర్‌ నటి లక్ష్మి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ విజయం పొందింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజైన దొరసాని నిరాశపరిచింది. సందీప్‌ కిషన్‌ నటించిన నిర్మించిన నిను వీడని నీడను నేను బయ్యర్లకు సేఫ్‌ ప్రాజెక్ట్‌ అయింది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథతో ఈ సినిమా తీశారు. దీంతో సందీప్‌ మళ్లి ఫామ్‌ లోకి వచ్చారు. విజయ్‌ దేవరకొండకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నటించిన డియర్‌ కామ్రేడ్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో ఫ్లాప్‌ అయింది.

ఆగస్టు నెలలో సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో తీసిన సాహో విడుదలైంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రమిదే. భారీ అంచనాల నడుమ వచ్చిన పాన్‌ ఇండియా సినిమా ఇది. కానీ ఫలితం మరోలా ఉంది. బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. అందరికీ తీవ్ర నష్టాలను మిగిల్చింది. లేట్‌ వయసులో ప్రేమకథతో నాగార్జున నటించిన మన్మథుడు 2 ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తమిళ్‌లో హిట్టయినా తెలుగులో మాత్రం కౌసల్య కష్ణమూర్తి నిరాశపరిచినా, తమిళ్‌ రీమేక్‌ సినిమా రాక్షసుడు హిట్‌ అయింది. కార్తికేయ నటించిన గుణ 369 ఫ్లాప్‌ అయింది. ఈచిత్రాల తరువాత నాని నటించిన గ్యాంగ్‌ లీడర్‌, వరుణ్‌ తేజ్‌ నటించిన గద్దలకొండ గణేష్‌ సినిమాలు బాక్సాఫీస్‌ విజయం చేజిక్కించుకున్నాయి.

అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక చిత్రం సైరా విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా ఇది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో తీశారు. తెలుగు, హిందీలో విడుదలైన ఈ చిత్రం హిందీలో పెద్దగా టాక్‌ తెచ్చుకోలేదు. తెలుగులో కూడా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. అమితాబ్‌, సుదీప్‌, నయనతార, విజయ్‌ సేతుపతి వంటి స్టార్స్‌ నటించినా సినిమా సూపర్‌ హిట్‌ కాలేదు. ఇక వరుస అపజయాలు చూస్తున్న గోపీచంద్‌ను చాణక్య ఆదుకోలేదు. సీక్వెల్‌ అంటూ తీస్తున్న రాజుగారి గది3 చతికిలపడింది. ఈచిత్రాల తరువాత రిలీజ్‌ అయిన రవిబాబు ఆవిరి, విజయ్‌ దేవరకొండ నిర్మాతగా తీసిన మీకు మాత్రమే చెప్తా, సందీప్‌ కిషన్‌ నటించిన తెనాలి రామకష్ణ, బయోపిక్‌ సినిమా జార్జిరెడ్డి నిరాశపరిచాయి. పరిమిత బడ్జెట్‌తో వచ్చిన రాగల 24 గంటల్లో, అర్జున్‌ సురవరం పాస్‌ మార్కులు తెచ్చుకున్నాయి. సంవత్సరం చివరిలో టాలీవుడ్‌ సినిమాలు మళ్ళీ తెరముందుకు పెద్ద టాక్‌తో వచ్చాయి. వెంకటేష్‌, నాగచైతన్య కలిసి నటించిన వెంకీమామ, సాయితేజ్‌ నటించిన ప్రతి రోజూ పండగే సక్సెస్‌ అయ్యాయి. బాలకృష్ణ నటించిన రూలర్‌ విజయానికి దూరమైంది. ఏదీ ఏమైనా టాలీవుడ్‌కు 2019 సంవత్సరం పెద్దగా విజయాన్ని అందించలేదు. కాకపోతే ఉనికిని నిరూపించుకునేలా విజయాలను మాత్రం అందుకుంది.