వైఎస్ జగన్ అమెరికా పర్యటన

08-01-2020

వైఎస్ జగన్ అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సరికొత్తశకానికి నాంది పలికిన ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహనరెడ్డికి ఆత్మీయ స్వాగతం ఇచ్చేందుకు డల్లాస్‌లోని కె బెహిలీ హజిసన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ రెడీ అయింది. ఆగస్టు 17వ తేదీన ఇక్కడకు వస్తున్న వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు మరోవైపు  అమెరికా నలుమూలలా ఉన్న వైఎస్‌ఆర్‌సిపి నాయకులు,  అభిమానులతోపాటు అమెరికాలో ఉన్న జాతీయ తెలుగు సంఘాలు, ప్రాంతీయ సంఘాల అధ్యక్షులు, సభ్యులు కూడా సిద్ధమయ్యారు. వైఎస్‌ జగన్‌ పర్యటనను పార్టీపరంగా, ప్రాంతీయపరంగా కాకుండా ఎన్నారై తెలుగువాళ్ళ సమావేశంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశం విజయవంతం కోసం ఎన్నారైలు, పార్టీ నాయకులు, అభిమానులు కలిసి తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా పేరుతో వేదికను ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2007లో అమెరికా పర్యటించినప్పుడు ఆయన పర్యటనను 'తెలుగు టైమ్స్‌' పూర్తిగా కవరేజ్‌ చేసింది. ఆ సమయంలో తెలుగు టైమ్స్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎడిషన్‌ను కూడా ఆయన చికాగోలో ఆవిష్కరించారు. ఈస్ట్‌కోస్ట్‌ ఎడిషన్‌ ప్రతిని ఆయన తానా, ఆటా ప్రెసిడెంట్‌లకు స్వయంగా అందించారు. దాంతోపాటు వైఎస్‌ అమెరికా అధికారిక పర్యటనను తెలుగుటైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు కో ఆర్డినేట్‌ చేశారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికా వస్తుండటంతో ఆయన పర్యటనను పురస్కరించుకుని తెలుగుటైమ్స్‌ స్పెషల్‌ను వెలువరిస్తోంది.

డల్లాస్‌ మహానగరం ఇప్పుడు మరో తెలుగు వేడుకకు రెడీ అవుతోంది. అమెరికాలో జాతీయ తెలుగు సంఘాలు ప్రతి సంవత్సరం ఏదో ఒకచోట అంగరంగవైభవంగా మహాసభలను పెద్ద పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసి తెలుగు కమ్యూనిటీని అంతా ఒకచోట కలిసేలా వేడుకలను నిర్వహిస్తుంటాయి. ఇప్పుడు మరో అతి పెద్ద కార్యక్రమానికి డల్లాస్‌ నగరం రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యక్తిగత పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో 17వ తేదీన సమావేశం కానున్నారు. డల్లాస్‌లోని అతి పెద్ద కన్వెన్షన్‌సెంటర్‌లో ఒకటైన కేబిల్లే కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుంచి, కెనడా నుంచి కూడా తెలుగువాళ్ళు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలోని అతి పెద్ద జాతీయ తెలుగు సంఘాలతోపాటు, ప్రాంతీయ తెలుగు సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తోంది. తెలుగు ఎన్నారై ప్రముఖులను, ఇతరులను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచనమేరకు అన్నీ సంఘాలను, ప్రాంతీయ, కుల మతాలకు అతీతంగా అందరినీ ఈ కార్యక్ర మానికి ఆహ్వానిస్తోంది.

భారీ ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యత లను స్వీకరించిన తరువాత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా అమెరికా పర్యటన చేస్తున్నారు. కాకపోతే తన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. తన చిన్నకుమార్తె యూనివర్సిటీ అడ్మిషన్‌కోసం ఆయన అమెరికా వస్తున్నట్లు తెలిసింది. ఆయన అమెరికా పర్యటనను పురస్కరించుకుని ఎప్పటినుంచో ఆయనను ఆహ్వానిస్తున్న వైఎస్‌ఆర్‌సిపి ఎన్నారై నాయకులు, వైఎస్‌ఆర్‌ను అభిమానించే ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) నాయకులు ఆయనను కలుసుకుని అమెరికా పర్యటనలో పార్టీ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరారు. అయితే ఈ కోరికను తొలుత నిరాకరించిన వైఎస్‌ జగన్‌ తరువాత అమెరికాలోని అన్నీసంఘాలను, కుల, ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే తాను వస్తానని చెప్పారు. దాంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన సూచనలతో వైఎస్‌ఆర్‌సిపి యుఎస్‌ఎ నాయకులు, ఇతరులు ఈ సమావేశానికి జాతీయ తెలుగు సంఘాలను, ఇతర సంఘాలను పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన కార్యాచరణను వారు రూపొందించుకున్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా పేరుతో అందరినీ ఆహ్వానించాలని అనుకున్నారు. దాంతోపాటు తొలుత అనుకున్నట్లు డిట్రాయిట్‌లో కాకుండా తెలుగువారు ఎక్కువగా ఉండే డల్లాస్‌లో ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాలని అనుకున్నారు. అనుకున్నడే తడవుగా డల్లాస్‌లో అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌గా పేరు పొందిన డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (కేబిల్లే కన్వెన్షన్‌ సెంటర్‌)ను బుక్‌ చేశారు.

దాదాపు 10,000మంది హాజరయ్యే ఇలాంటి కన్వెన్షన్‌ను ఓ ముఖ్యమంత్రి కార్యక్రమం కోసం బుక్‌ చేయడం ఇదే ప్రథమం. జాతీయ సంఘాలు పెద్దఎత్తున నిర్వహించే వేడుకలకే ఇలాంటి కన్వెన్షన్‌ సెంటర్‌ను బుక్‌ చేస్తారు. కాని ఓ ముఖ్యమంత్రి పర్యటనకోసం ఇలాంటి పెద్ద హాల్‌ను బుక్‌ చేశారంటే ఈ కార్యక్రమాన్ని వారు ఎంత బాగా నిర్వహించాలని భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు దగ్గరలో ఉన్న పెద్ద హోటల్‌ ఓమ్ని డల్లాస్‌లో కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికోసం రూమ్‌లను బుక్‌ చేశారు. www.cmysjaganusa2019.com పేరుతో ఓ వెబ్‌సైట్‌ను తయారు చేసి అందులో అన్నీ వివరాలను పొందుపరిచి ఈ సమావేశానికి వచ్చేవారిని రిజిష్టర్‌ చేసుకోవాల్సిందిగా కోరారు.

Click here for Event Gallery