Expert panel pitches for Vizag as AP capital

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరుతో విశాఖపట్టణంను ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిగా ప్రభుత్వం ప్రకటిస్తే పట్టణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న దానిపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 20లక్షలకు పైగా జనాభాతో పాటు దేశంలోనే అత్యధిక జనసాంధ్రత గల నగరాల్లో ఒకటిగా విశాఖపట్టణం నిలిచింది. దానికితోడు ఐదేళ్ళు తిరిగేలోగా నగర జనాభా కోటి దాటుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే నగరం కిక్కిరిసిపోయింది. విశాఖకు సొంతంగా నీటి వనరుల్లేవు. పోలవరం పూర్తయితే తప్ప ప్రతిపాదిత ఏలేరు కాలువ ద్వారా నగరానికి అదనపు నీరు అందుబాటులోకి రాదు. ఒకవేళ వచ్చినా కోటి మంది జనాభా నీటి అవసరాల్ని అది తీర్చలేదు.

రాష్ట్ర పాలనా వికేంద్రీకరణకు రంగం సిద్దమైంది. ప్రతిపాదిత రాజధాని నగరం అమరావతితో పాటు కొత్తగా మరో రెండు నగరాల్లో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం కతనిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన లొచ్చినా ఈ 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేసి దాన్ని న్యాయరాజధానిగా అభివద్ది చేయాలన్న ప్రతిపాదనకు ఎవర్నుంచి ఎలాంటి వ్యతిరేకతలు వ్యక్తం కావడంలేదు. కాగా విశాఖను ఆర్ధిక కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించే అంశంపై అనుకూ, ప్రతికూల వాదనలు వినవచ్చాయి.  రాజధాని వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి జగన్‌ దక్షిణాఫ్రికాను ఉదాహరణకు తీసుకు న్నారు. ఆ దేశంలోనూ మూడు రాజధానులున్నాయి. అందులో కేప్‌టౌన్‌ ఒకటి. అక్కడ ఆ దేశ చట్టసభలు కొలువుదీరాయి. లెజిస్లేటీవ్‌ పార్లమెంట్‌తో పాటు నేషనల్‌ అసెంబ్లి, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ప్రావిన్సెస్‌లు అక్కడున్నాయి. కేప్‌టౌన్‌తో అన్ని విధాలా సరితూగే విశాఖను కార్యనిర్వాహక కేంద్రంగా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీన్ని ఆర్ధిక రాజధానిగా ప్రకటిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్ధిక రాజధాని హోదాకు అవసరమైన అన్ని హంగులు విశాఖకున్నాయి.

ఇక్కడ భారీ పరిశ్రమలు, అతిపెద్ద రేవు, నౌకా నిర్మాణ, ఉక్కుకర్మాగారాలున్నాయి. వీటి ఆధారంగా అతి పెద్ద వాణిజ్య సముదాయాలున్నాయి. దీంతో ఈ నగరం నుంచి ప్రభుత్వానికి పెద్దెత్తున ఆదాయం సమకూరుతోంది. లక్షలాది మందికి ఈ నగరం ఉపాధి కల్పిస్తోంది. దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో తొలివరసలో ఇదిచేరింది.

ఇప్పుడు విశాఖ-భీమిలి మధ్యనున్న విశాల ప్రాంతంలో కార్యనిర్వాహక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇక్కడ్నుంచి పని చేయించాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన. అయితే ఈ మేరకు పెరిగే ఒత్తిడిని విశాఖ నగరం ఏ మేరకు తట్టుకుంటుందన్న సందేహాలు నిపుణుల్లో నెలకొన్నాయి. ఇందుకోసం వీరు ప్రభుత్వం ఉదాహరణగా చూపుతున్న కేప్‌టౌన్‌ నగరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకప్పుడు సాదా సీదాగా ఉన్న కేప్‌టౌన్‌ ఇప్పుడు సామర్ద్యానికి మించి విస్తరించింది. అందుకు తగ్గ మౌలిక సదుపాయాల్ని కల్పించలేక ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా ఆ నగరంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వారానికి రెండ్రోజుల పాటు స్థానిక ప్రభుత్వం నీటి సరఫరాను బంద్‌ చేసేసింది.

విశాఖలాగే కేప్‌టౌన్‌ కూడా సముద్రతీరం వెంబడి ఏర్పడింది. గతంలో ఇది డచ్‌ వలసదార్ల కేంద్రంగా ఉండేది. అనంతరం ఈస్టిండియా కంపెనీ అధీనంలొకొచ్చింది. డచ్‌ నౌకలకు ఆహార సరఫరా కేంద్రంగా దీన్ని అభివద్ది చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల్నుంచి దక్షిణాఫ్రికాకు పెద్దెత్తున వలసలు సాగాయి. ఆ సమయంలో వలదార్ల అతిపెద్ద గమ్యస్థానంగా కేప్‌టౌన్‌ గుర్తింపు పొందింది. అక్కడి వాతావరణం, సదుపాయాలు, నీటి లభ్యత ఇందుకు దోహదపడ్డాయి. విశాఖ తరహాలోనే కేప్‌టౌన్‌లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అలాగే ఇక్కడ అపార మత్స్యసంపద అందుబాటులో ఉంది. దక్షిణాఫ్రికా స్వతంత్ర సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.అయితే అప్పట్నుంచి నగర జనాభా అనూహ్యంగా పెరిగింది. కేవలం 12ఏళ్ళలోనే ఈ నగర జనాభా 8లక్షల్నుంచి 63లక్షలకు చేరుకుంది. దీంతో ఇబ్బందులు వచ్చాయి. నీటి వనరులు తగ్గిపోయి నీటి సరఫరా లేక నగరం విలవిలల్లాడుతోంది. దాంతో పలు పరిశ్రమలు మూతపడ్డాయి. ట్యాంకర్ల నీటిసరఫరా సాయుధదళాల పర్యవేక్షణలో చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి ఇబ్బందులు విశా నగరంలో కూడా ఏర్పడే అవకాశం ఉందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే విశాఖకు కూడా కేప్‌టౌన్‌తరహా లోనే సొంత నీటి వనరులు తక్కువ. మధ్యతరహా నది శారద నుండి విశాఖ నగరానికి తాగునీరొస్తోంది. పరిసరాల్లోని నాగావళి, గోస్తని, గంభీగం గెడ్డ, మేఘాద్రి గెడ్డల్తో పాటు గోదావరికి చెందిన మార్చ్‌ఖండ్‌ బేసిన్‌ నుంచి విశాఖకు నీటిని సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా పోలవరం కాలువ ద్వారా ఏలేరుకు నీటిని పంపి ఏలేరు కాలువ ద్వారా విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో విశాఖ నీటి అవసరాలు కూడా పోలవరం బహుళార్ధక సాధక ప్రాజక్ట్‌లో భాగమయ్యాయి.

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తే ఐదేళ్ళలోనే నగర జనాభా కోటిని దాటే అవకాశాల్ని నిపుణులు అంచనా లేస్తున్నారు. విశాఖలో పరిశ్రమలు, వ్యాపారాలతోపాటు రాజధానిహోదాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకొస్తాయన్న ఆకాంక్షతో దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచి ఇక్కడకు వలసలు అనూహ్యంగా పెరుగుతాయి. వారందరికీ ఇతర సదుపాయాల మాటెలా ఉన్నా తాగునీటిని అందించడం కత్తిమీద సామౌతుంది. అలాగే ఇంత పెద్దెత్తున పెరిగే జనాభాకు ఉపాధికల్పన, ఇళ్ళనిర్మాణం, మౌలిక సదుపాయాలు, ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం కూడా తలకుమించిన భారమౌతుంది. అందుకు తగ్గ స్థలం, అవకాశాలు విశాఖ పరిసరాల్లో అందుబాటులో లేవు. ఇక్కడే రాజధానిని నెలకొల్పితే కేప్‌టౌన్‌ తరహా ఇబ్బం దులు తప్పవు. అక్కడ అనుసరిస్తున్న జీరో డే తరహా విధానాన్ని అమలు చేయక తప్పదని పరిశీలకులు పేర్కొంటున్నారు.