Andhra Pradesh Assembly Winter Session 2019

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడోసారి అసెంబ్లి సమావేశాలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో రాజకీయ మంటలు బాగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.  ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శాసనసభ శీతాకాల సమావేశాలతో ఈ వేడి మరింతగా పెరగనుంది. ఇసుక, ఇంగ్లీషు బోధన, అమరావతి నిర్మాణం వంటి అంశాలను ఉమ్మడి అజెండాగా తీసుకుని ఇరు పక్షాలు వారివారి వాదనలు గట్టిగా వినిపించేందుకు సన్నద్ధమౌతున్నాయి. ఈ అంశాల్లో వాస్తవాలు మావంటే .. మావంటూ .. ఇరువర్గాలు వాదనకు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరువర్గాలకు ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉచితంగా పబ్లిసిటీ వచ్చే ఈ అసెంబ్లి సమావేశాలను వేదిక చేసుకుని ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు సన్నద్ధమౌతున్నాయి.

మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటడం, 500 యూనిట్లు పైబడి వాడే విద్యుత్‌ వినియోగదారులకు ఛార్జీల పెంపు వంటి అంశాలతోపాటు ఆర్టీసీ ఛార్జీలను పెంచుతామంటూ శనివారం ప్రభుత్వం ప్రకటించడంతో వీటినే అస్త్రాలుగా చేసుకుని అసెంబ్లిలో అధికారపక్షంపై దుమ్మెత్తి పోసేందుకు తెదేపా పూర్తిస్థాయిలో సన్నద్ధమౌతోంది. అసెంబ్లిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరు పార్టీలు సభ్యులకు దిశానిర్దేశం చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించి ఆపార్టీ సభ్యులకు అసెంబ్లిలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసింది. ఇక వైకాపా కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమైంది.

 

సంక్షేమ పథకాల అమలుతో పాటు ఇచ్చిన హామీల్లో 80 శాతం మేర అమలు చేశామన్న ధీమాతో అధికార వైకాపా తమ వాణిని గట్టిగా వినిపించేందుకు సకల అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇక ఇసుక, ఇంగ్లీషు బోధన, రాజధాని అమరావతి నిర్మాణం, ఉల్లి ధరలు, ఆర్టీసీ ఛార్జీల పెంపు వంటి అంశాలతో ప్రతిపక్ష తెలుగుదేశం ఎదురుదాడికి సన్నద్ధమౌతోంది. ఈ క్రమంలోనే జంపింగ్‌ లు ఆ పార్టీని కంగదీస్తున్నాయి. ఇప్పటికే కష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంట నడుస్తానని బహిరంగంగా ప్రకటించిన సంగతి విదితమే. ఆయన బాటలోనే మరో 4గురు లేక 5గురు ఎమ్మెల్యేలు వైకాపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అది కూడా ఈఅసెంబ్లి సమావేశాల్లోనే జరిగి తీరుతుందని ప్రచారం జరుగుతోంది.

గత సమావేశాల్లో అధికారపార్టీకి దక్కిన విజయం...

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జూన్‌ 12వ తేదీ అసెంబ్లి సమావేశాలు 5 రోజుల పాటు జరిగాయి. ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆ సమావేశాల్లో 19.25 గంటల పాటు ప్రధాన పార్టీలకు మాట్లాడే అవకాశం లభించింది. వాటిలో వైసీపీ 16.32 గంటలు, టిడిపి 2.33 గంటల పాటు అసెంబ్లి సమావేశాల్లో చర్చించారు. కీలకమైన తొలి సమావేశంలో జనసేన కేవలం 20 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం లభించింది. అలాగే జూలై 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 14 రోజుల పాటు జరిగిన 2వ అసెంబ్లి సమావేశాల్లో 78.35 గంటల పాటు చర్చ జరిగింది. వాటిలో అత్యధికంగా వైసీపీకి 65.36 గంటలు టిడిపికి 12.19 గంటలు, జనసేనకు 40 నిమిషాలు మాట్లాడే అవకాశం లభించింది. పై రెండు సమావేశాల్లో అధికార పార్టీనే పైచేయి సాధించింది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు పలు సందర్భాల్లో ప్రయత్నించినా వైసీపీ ఎదురుదాడికి ప్రతిపక్షం సరైన రీతిలో సమాధానం ఇవ్వలేకపోయింది.