ap govt education department

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత ఒక్కోరంగాన్ని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. ఇందుకు సంబంధించి చరిత్రాత్మకమైన రెండు కీలక బిల్లులను ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు.. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. దీంతో ఇంత కాలం విద్యార్థులు, తల్లిదండ్రులను ఫీజుల పేరిట పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట పడనుంది. ఎన్నికలకు ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలోని విద్యా రంగ పరిస్థితిని, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి చలించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రెండు బిల్లులకు రూపకల్పన చేసి, తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆమోదింపజేశారు.

ఎల్‌కేజీ మొదలు ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత చదువుల వరకు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్తులు సైతం అమ్ముకోవడమే కాకుండా ఆ చదువులు పూర్తయ్యేసరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారమయం చేయడంతో పేదలే కాకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సైతం విద్య పెనుభారంగా మారింది. కనీస సదుపాయాలు, బోధకులు లేకుండానే కాలేజీలు, స్కూళ్లను నిర్వహిస్తున్నాయి. పిల్లలను జైళ్ల వంటి హాస్టళ్లలో ఉంచి వారిపై విపరీతమైన ఒత్తిడి పెడుతూ వారి బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. సరైన బోధన లేకుండా బట్టీ పద్ధతులను పాటిస్తూ విద్యార్థులను యంత్రాలుగా మార్చేస్తున్నాయి. ఇలాంటి దుస్థితి నుంచి విద్యార్థులను, తల్లితండ్రులను కాపాడేందుకు వీలుగా జగన్‌ ప్రభుత్వం?ఈ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది.

పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులు ఆమోదం పొందడంతో ఇకపై రాష్ట్రంలో విద్యారంగ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. ఈ కమిషన్లకు ప్రభుత్వం అనేక అధికారాలు కల్పించింది. ఫీజులు, ప్రమాణాలు, విద్యార్థులు.. టీచర్ల సంక్షేమం ఇలా అన్ని కోణాల్లోనూ ఈ కమిషన్లు విద్యారంగాన్ని పర్యవేక్షిస్తాయి. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలు ఛైర్మన్లుగా ఉండడంతో పాటు ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనుండడంతో విద్యారంగం పగడ్బందీగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీటికి సివిల్‌ కోర్టు అధికారాలను కూడా ప్రభుత్వం కల్పించింది.  రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అధికారం విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉంటుంది.  కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు మినహా తక్కిన అన్ని సంస్థలు ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి.

ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల సర్వీసు కండిషన్లు, వారికి ఇస్తున్న వేతనాలు, ఇతర అంశాలను కూడా కమిషన్‌ పరిశీలిస్తుంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. నిబంధనలు అసలు పాటించని సంస్థల గుర్తింపు రద్దుకు కూడా చేసే అధికారం ఉంటుంది. సివిల్‌ కోర్టు అధికారాలు కల్పిస్తున్నందున ఎవరినైనా పిలిపించి విచారించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్‌ చర్యలు చేపడుతుంది. ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, బోధనా సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల నిర్వహణ ఉందా? లేదా అన్న అంశాల పరిశీలన.

జూనియర్‌, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు (రాష్ట్ర చట్టాలకు లోబడి ఏర్పాటైనవి) కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. ఆయా సంస్థలపై చర్యలకు కమిషన్‌కు అధికారం ఉంటుంది. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థల మూతకు చర్యలు తీసుకొనే అధికారం కమిషన్‌కు ఉంది.