కాఫీ బోర్డు...కాఫీ డే...కోకోకోలా

06-07-2019

కాఫీ బోర్డు...కాఫీ డే...కోకోకోలా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన మేకిన్‌ ఇండియా నినాదంతో కొత్త సంస్థల రాక మాట దేవుడెరుగు. ఉన్న సంస్థలు విదేశీయ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతుందని భారతీయ మేధావులు వాపోతున్నారు. మేకిన్‌ ఇండియా పేరుతో భారత్‌లో పరిశ్రమలు పెట్టండి అని మోదీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు పిలుపు ఇస్తే, విదేశీ సంస్థలు ఆ పిలుపును వేరే విధంగా అర్థం చేసుకున్నట్లు ఉన్నాయి. భారత్‌లో పరిశ్రమలు పెట్టకుండా, భారత్‌లో ఉన్న పరిశ్రమలనే తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికితోడు ఈ విభాగాలు ప్రజలు ఎక్కువగా ఆధారపడిన ఆహార పరిశ్రమలపైనే దృష్టి పెట్టాయి. దాంతో విదేశీ చేతుల్లోకి వెళ్ళిన ఆహార సంస్థల వల్ల తమ ఆరోగ్యంతోపాటు, ధరలు కూడా పెరిగిపోతాయని సగటు భారతీయుడు గగ్గోలు పెడుతున్నాడు.

 సాంకేతిక పరిజ్ఞాన పాటవం, పెట్టుబడులు అవసరమైన కీలకమైన పరిశ్రమలను విదేశీయ సంస్థలు స్థాపించడం లేదు. 'పరిజ్ఞానం'తో పనిలేని, పెట్టుబడులు పెద్దగా అవసరం లేని తిండి పదార్థాలను - సేమ్యాల వంటి వాటిని- రోగాలను పెంచే శీతల పానీయాలను, ఐస్‌క్రీమ్‌లను మాత్రమే తయారుచేస్తుండడం 'మేకిన్‌ ఇండియా' నినాదాన్ని అపహాస్యం చేస్తోంది. దానికితోడు పంపిణీ రంగాన్ని మొత్తం విదేశీయ సంస్థలు నియంత్రించడం గమనార్హం. 'ప్రగతి' కేంద్రీక తం అవుతోంది. 'ప్రగతి' పేరుతో జనం పల్లెల నుంచి వచ్చి నగరాలలో కేంద్రీక తం అవుతున్నారు, కాలుష్యం కేంద్రీకతం అవుతోంది. మహాత్మా గాంధీ నూట యాబయ్యవ జయంతి- ఉత్సవాలు జరుగుతున్న సంవత్సరం ఇది. బ్రిటన్‌ దురాక్రమణ సమయంలో ధ్వంసమైన వికేంద్రీకత గ్రామ స్వరాజ్యం మళ్ళీ ఏర్పడాలన్నది గాంధీ మహాత్ముడు చేసిన ప్రచారం. ఈ వికేంద్రీకరణకు విరుద్ధంగా 'కేంద్రీకరణ' జరుగుతుండడం విచారకరం.

 'కాఫీ బోర్డు' అన్న ప్రభుత్వ రంగ సంస్థ గురించి నేటితరానికి తెలియకపోయినా అంతకుముందున్నతరానికి బాగా తెలిసి ఉంటుంది. తక్కువ ధరలకు కాఫీ పొడిని విక్రయించిన చరిత్ర ఈ బోర్డ్‌కు ఉంది. ఈ ప్రభుత్వరంగ సంస్థకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పట్టణాలలో విక్రయ కేంద్రాలుండేవి. కానీ ''పథకం ప్రకారం'' ఈ ప్రభుత్వ సంస్థ దుకాణాలు ఒకటి తరువాత ఒకటిగా మూతపడిపోయాయి. 'కాఫీ బోర్డు' దుకాణాలు మూతపడడం ప్రభుత్వేతర రంగసంస్థ 'కాఫీ డే' రావడం, దాని దుకాణాలు విస్తరించిపోవడం జరిగింది. దాంతో తక్కువ ధరలో దొరికే కాఫీ పొడి ధర పెరిగింది. ఓ కప్పు కాఫీ కూడా కాస్ట్లీ అయిపోయింది. 'కాఫీ డే' దుకాణాలు బంగారు జింకల వలె విస్తరించినచోట చిల్లర వర్తకులు తమ దుకాణాలను మూసివేశారు. ఎందుకంటె 'కాఫీ డే' దుకాణాల 'ఆకర్షణ'తో ఈ చిల్లర వ్యాపారులు పోటీపడలేకపోయారు. ఇలా 'వికేంద్రీక త' కాఫీ పంపిణీ వ్యవస్థను 'కాఫీ డే' సంస్థ ధ్వంసం చేయడం కేంద్రీకరణలో మొదటి దశ. ఇప్పుడు 'కాఫీ డే' సంస్థను విదేశీయ 'కోకోకోలా' కబళించడానికి రంగం సిద్ధమైంది. 

  ఇప్పుడు 'కాఫీ పొడిని' విదేశీయ సంస్థ 'కోకోకోలా' వారు తయారుచేసి విక్రయించనున్నారట. మన దేశానికి చెందిన 'కేఫ్‌ కాఫీ డే'అన్న సంస్థను 'కోకోకోలా' సంస్థవారు కొనుగోలు చేయనున్నారట. విదేశీయ ముద్రపడితే కాని మన దేశంలో పండుతున్న కాఫీ గింజలకు వాసనరాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  స్వదేశీయ సంస్థలను విదేశీయ సంస్థలు దిగమింగకుండా అడ్డుకోవాలన్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదు, అడ్డుకోవాలన్న ధ్యాస ప్రజలకు లేదు. స్థానికులు కాఫీ పొడి కూడ తయారుచేయలేరన్నది, చేయరాన్నది 'ప్రపంచీకరణ' చెపుతున్న పాఠం. అందువల్ల ఒక్కొక్కటిగా స్వదేశీయ సంస్థలను బహుళ జాతీయ, విదేశీయ ముఠాలు కొనుగోలు చేస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌ అన్న స్వదేశీయ సంస్థను 'వాల్‌మార్ట్‌' కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.