telangana congress gets new structure

తెలంగాణలో నిర్వీర్యమైన కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ కసరత్తును మొదలు పెట్టింది. ఏఐసీసీలో ఈ నెలాఖరులోపల మార్పులు ఒక కొలిక్కి వచ్చిన వెంటనే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్‌ పార్టీ సంకేతాలు పంపింది. తెలంగాణ ఇచ్చినా సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకుని పార్టీని బలోపేతం చేయడంలో గత ఐదేళ్లుగా టీపీసీసీ విఫలమైనట్లు ఎఐసీసీకి కుప్పలు తెప్పలుగా నివేదికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సౌమ్యుడు, వివాదరహితుగా పేరున్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్థానంలో కొత్త నేత కోసం ఎఐసీసీ నేతలు వేటను ప్రారంభించారు.

  రాష్ట్రానికి కొత్తగా ఇన్‌చార్జీని కూడా నియమించే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఇన్‌చార్జి కుంతియాస్థానంలో సీనియర్‌ నేతను నియమిస్తారని సమాచారం. కాంగ్రెస్‌ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నల్లగొండ ఎంపీ స్థానానికి ఎన్నిక కావడంతో, హుజుర్‌నగర్‌ స్థానానికి రాజీనామా చేశారు. నల్లగొండ జిల్లాకుచెందిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి బహిరంగంగా పార్టీపై తిరుగుబాటు చేశారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనాలంటే బీజేపీ ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్‌ పార్టీ జవసత్వాలను కోల్పోయిందని, పోరాట పటిమ లేదని ప్రకటించారు. దీంతో క్రమశిక్షణ సంఘం సమావేశమై నోటీసులు జారీ చేసింది. పదిరోజుల తర్వాత రాజ్‌గోపాల్‌ రెడ్డిపై వేటు పడే అవకాశం ఉంది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం నాలుగు తగ్గింది, సీఎల్‌పీ నేత భట్టి, జగ్గారెడ్డి, డీ శ్రీధర్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రమే మిగిలారు. రాజ్‌గోపాల్‌ రెడ్డి పార్టీని వీడడడం ఖాయమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవిని మరోసారి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డికి దక్కే అవకాశం ఉంది. జీవన్‌ రెడ్డి ఉత్తర తెలంగాణలో జగిత్యాలకు చెందిన బలమైన నేత. కాగా యువకుడికి అవకాశం ఇవ్వాలనుకుంటే రేవంత్‌ రెడ్డికి ఇవ్వవచ్చు. కాని తనకు పార్టీ నిర్వహణపై పూర్తి స్వేచ్చను ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా, దేశంలో అతి పెద్ద నియోజకవర్గం మల్కాజగిరి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

 

 ఫైర్‌ బ్రాండ్‌గా పేరున్న రేవంత్‌ రెడ్డి ఈ మధ్య కాలంలో దూకుడు తగ్గించారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌లో పార్టీ భవిష్యత్తుపై అంతర్మథనం సాగుతోంది. రాహుల్‌ గాంధీ నాయకత్వం మార్పు, కొత్త కెప్టెన్‌ నియామకం తర్వాత రేవంత్‌ రెడ్డి యాక్టివయ్యే అవకాశం ఉంది. బ్రాహ్మణ వర్గానికి చెందిన డీ శ్ధ్రీర్‌ కూడా సీనియర్‌ ఎమ్మెల్యే. ఆయనకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కార్యకర్తలు, నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నందున అందరినీ కలుపుకుని పోయే నేత కాంగ్రెస్‌కు అవసరమని నేతలంటున్నారు

  చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరును కూడా పార్టీ అధిష్టానం పరిశీలనకు వెళ్లింది. భునవగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రాలో కాంగ్రెస్‌పార్టీ 1994 నుంచి 2004 వరకు పదేళ్ల పాటు అధికారం లేకపోయినా, గాంధీభవన్‌ కళ తప్పలేదు. అప్పుడు పార్టీలో బలమైన నేతలు ఉండేవారు. ఎప్పుడు కార్యకర్తలతో కిటకిటలాడేది. వచ్చిపోయి నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం గాంధీ భవన్‌లో కనపడేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 2014 నుంచి గాంధీ భవన్‌లో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. గాంధీభవన్‌కు పూర్వ వైభవం రావాలని కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు.