కొత్త సచివాలయం కట్టాల్సిందేనంటున్న కేసీఆర్‌

06-07-2019

కొత్త సచివాలయం కట్టాల్సిందేనంటున్న కేసీఆర్‌

 కొత్త సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణానికి ఎన్ని ఆటంకాలుఎదురైనా కట్టాల్సిందేనంటున్నారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు. అందుకు తగ్గట్టుగా అనేక చర్యలను ఆయన చేపట్టారు. ఈ కట్టడాలకు కావాల్సిన భూమి పూజ కూడా చేసేశారు కాకపోతే కొత్త భవనాల నిర్మాణంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కొంత  కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత సచివాలయంలోని అన్ని భవనాలను కూల్చి వేయాలా? లేక కొన్ని భవనాలను అలాగే ఉంచి కొత్త భవనాన్ని నిర్మించాలా? తేల్చాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతత్వంలో సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సబ్‌ కమిటీ ఇచ్చే నివేదికపై తుది నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌కే వదిలేస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడంతో సబ్‌ కమిటీ నివేదికతో ప్రమేయం లేకుండా పాత సచివాలయాన్ని పూర్తిగా కూల్చి వేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించడానికే కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సచివాలయానికి వాస్తు దోషాలు ఉండటంతో కొత్త భవనానికి ఆ సమస్య తలెత్తకుండా సచివాలయానికి ఉత్తర, పడమరల వైపున ఉన్న భవనాలను కూడా స్వాధీనం చేసుకొని మరింత విశాలంగా కొత్త సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. సచివాలయానికి వెనుక భాగంలో మింట్‌ కంపౌండ్‌, ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ రెండు భవనాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. దీంతో వీటిని మాత్రమే మినహాయించి సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ భవనాలు, ఉద్యోగ సంఘాల భవనాలను కూడా స్వాధీనం చేసుకుని వాటిని కూడా కొత్త సచివాలయ భవన ప్రాంగణంలోకి కలుపుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

 

 ఉత్తర, ఈశాన్య భాగాలను వాస్తు ప్రకారం ఖాళీగా ఉంచి పూర్తిగా పడమర భాగం, నైరూతి మూలలో కొత్త భవనం వచ్చే విధంగా నిర్మాణం చేపట్టాలని వాస్తు పండితులు ఇదివరకే సీఎంకు సూచించారు. దీంతో హుస్సేన్‌సాగర్‌ లేక్‌వ్యూ అభిముఖంగా సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. సచివాలయంలో డీ, హెచ్‌ బ్లాక్‌లు కొత్తవి కావడంతో వాటిని అలాగే వదిలేసి కొత్త భవనాన్ని నిర్మిస్తే బాగుంటుందని కూడా కొందరు ప్రభుత్వానికి సూచించారు. అయితే పాత భవనాలను అలాగే ఉంచడం వల్ల కొత్త భవనానికి ఎలివేషన్‌ రాదని, పైగా ఈ రెండు భవనాలు ఉత్తర, ఈశన్య భాగంలో ఉండటం వల్ల తిరిగి వాస్తు దోషం తలెత్తుందనే మరోవాదన ఉంది. ఎలాగూ కొత్త భవనాన్ని నిర్మించనుండటంతో పాత సచివాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసి కొత్తగా నిర్మించడమే మేలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. మంత్రిమండలి సమావేశంలో ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ వ్యక్తం చేయడంతో సబ్‌ కమిటీ కూడా ఆయన అభిమతానికి అనుగుణంగా ప్రతిపాదనను సమర్పించనున్నట్టు సమాచారం.

 

 వాస్తు ప్రకారం కొత్త సచివాలయాన్ని చతురస్రాకారంలో నిర్మించడానికి వీలుగా అన్ని భవనాలను కూల్చడమే ఉత్తమమన్న ఏకాభిప్రాయం ఇటు సీఎం కేసీఆర్‌లోనూ, అటు సబ్‌ కమిటీకి నేత త్వం వహిస్తున్న ఆర్‌ అండ్‌ బి మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యక్తం చేసినట్టు సమాచారం. కొత్త సచివాలయంతో పాటు ఎర్రమంజిల్‌లో రోడ్లు, భవనాలశాఖ భవనం ప్రాంగణంలో నిర్మించే శాసనసభ సముదాయ భవనాల నిర్మాణాలకు గ్లోబల్‌ టెండర్లను పిలువడం వల్ల జాప్యం జరిగే అవకాశం ఉండటంతో నామినేషన్‌ విధానంలో వీటి నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రగతి భవన్‌ నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తి చేసిన ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్‌ జీ-పల్లోంజీకి సచివాలయం, శాసనసభ సముదాయ భవనాలను అప్పగించడం మేలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఏడాది గడువులోగా వీటిని పూర్తి చేయగల సామర్థ్యం ఈ సంస్థకు ఉందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 27న ఈ రెండు కొత్త భవనాల నిర్మాణాలకు భూమి పూజ చేయనుండటంతో ఆ లోగా వీటి నమూనాలను ఖరారు చేయడానికి సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. కొత్త సచివాలయ నిర్మాణం కోసం గతంలో ముంబైకి చెందిన హఫీజ్‌ కాంట్రాక్టర్‌ రూపొందించిన డిజైన్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే తాజాగా చెన్నైకి చెందిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్ట్‌ సంస్థ కూడా మరో డిజైన్‌ను ప్రభుత్వానికి పంపించింది. మొదటి డిజైన్‌ కంటే రెండో డిజైన్‌వైపే మంత్రిమండలి సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు మొగ్గు చూపినట్టు సమాచారం. ఈ రెండు నమూనాలను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.