పోటీకి దూరం...వ్యూహమా!?

02-05-2019

పోటీకి దూరం...వ్యూహమా!?

ఈ ఎన్నికల్లో అందరిదృష్టిని ఆకర్షించిన ప్రియాంకగాంధీ తాను ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదో అన్న విషయం వేచి చూడమని చెప్పి చివరకు తాను పోటీ చేయకపోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రియాంక గాంధీకి ప్రజల్లో ఇమేజ్‌ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి పోటీ చేస్తారన్న ఊహగానాలు తొలుత వినిపించాయి. చివరకు దీనిపై ప్రియాంక గాంధీ కూడా స్పందిస్తూ తాను ఎందుకు వారణాసి నుంచి పోటీ చేయెద్దు అని ప్రశ్నించింది. దీంతో అందరూ ఆమె ప్రదాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా వారణాసి నుంచి పోటీ చేస్తుందని అందరూ భావించారు. చివరకు కాంగ్రెస్‌ ప్రధానికి వ్యతిరేకంగా వేరొకరి చేత నామినేషన్‌ వేయించిన తరువాత అందరి దృష్టి ప్రియాంకగాంధీపై మరోసారి పడింది. అస్సలు ఎందుకు ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా అని ఆలోచిస్తున్నారు. ఈ స్థానం నుంచి పోటీకి ప్రియాంకను దింపడంపై చివరిదాకా అధిష్టానం ఎందుకు సస్పెన్స్‌ కొనసాగించింది? తెరవెనుక ఏం జరిగిందనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్త త చర్చ జరుగుతోంది. నిజానికి వారణాసి లోక్‌సభ సీటు నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని భావించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెకు ఉత్తరప్రదేశ్‌ తూర్పు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది.

వారణాసిలో ప్రధానమంత్రి మోడీపై పోటీకి దిగడం ద్వారా యూపీ కాంగ్రెస్‌లో జోష్‌ నింపాలని ప్రియాంకగాంధీ భావించారు. దాంతో నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి గురించి పదే పదే రాజకీయ విమర్శలు చేశారు. అయిదేళ్లలో నరంద్రమోడీ కేవలం మూడుసార్లే వారణాసికి వచ్చారని విమర్శల వర్షం కురిపించారు. వారణాసి అభివద్ధిపై మోడీ చేసిన హామీలు అమలు కాలేదని ఆరోపణలు చేశారు. దాంతో ఆమె వారణాసికి పోటీకి రెడీ అవుతున్నారని అంతా భావించారు. కాంగ్రెస్‌ వర్గాలు కూడా ఆ వాదనను కొట్టిపారేయలేదు. అయితే నామినేషన్ల సమయానికి వచ్చేసరికల్లా కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా ప్రియాంకగాంధీ పోటీపై మేథోమథనం చేసింది.

యూపీలో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గాంధీ కుటుంబానికి పట్టున్న అమేథీ, రాయ్‌బరేలీలో మాత్రం గెలుస్తూ వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి పోటీ చేయడమంటే అది కఠినమైన పరీక్షగా భావించింది. వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి క్షేత్రస్థాయిలో పెద్దగా పట్టులేదు. నామమాత్రంగా పార్టీ ఉనికి ఉంది. పార్టీ బలమైన యంత్రాంగం లేనిచోట, బలమైన ప్రత్యర్థి ఉన్న చోట నుంచి పోటీకి దిగడం రిస్క్‌తో కూడిన వ్యవహారమని సోనియాగాంధీ వారించినట్లు తెలిసింది. సరైన గ్రౌండ్‌ వర్క్‌ లేకుండా దిగితే అభాసుపాలయ్యే అవకాశముందని అధిష్టానం గ్రహించింది.

ఈ నేపథ్యంలో పోటీకి దింపడం వల్ల ప్రియాంక గాంధీ భవిష్యత్‌ రాజకీయాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని సోనియాగాంధీ గ్రహించారని సమాచారం. ఆ నేపథ్యంలో ప్రియాంకను వారణాసికి పోటీ దింపకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి తోడు, ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వానికి ఎస్పీ, బిఎస్పీ, ఆర్‌ఎల్‌డి కూటమి మద్దతు ప్రకటించలేదు. వారణాసి నుంచి ప్రియాంక పోటీపై కాంగ్రెస్‌ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకముందే కూటమి తన అభ్యర్థిని ప్రకటించింది. శాలినీ యాదవ్‌ అనే మహిళాఅభ్యర్థిని ప్రకటించింది. బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి తాము ప్రియాంకకు సహకరించబోమని కూడా కూటమి పరోక్షంగా వెల్లడించింది. దాంతో ప్రియాంకగాంధీని పోటీలోకి దింపే ఆలోచనను పార్టీ హైకమాండ్‌ విరమించుకుంది. దీనికి ప్రధానకారణం ఎస్పీ బీఎస్పీ పార్టీలు మద్దతు ఇవ్వకపోవడమేనని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి.