కేసీఆర్ జట్టులో మార్పులు ఉంటాయా?

02-05-2019

కేసీఆర్ జట్టులో మార్పులు ఉంటాయా?

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న సంఖ్యలో మంత్రివర్గాన్ని విస్తరించిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు మరోసారి తన మంత్రివర్గ విస్తరణపై, మార్పులపై దృష్టి పెట్టారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 23న వెలువడిన తరువాత రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తును చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా బూత్‌ స్థాయి వరకు పటిష్టం చేయడంతో పాటు, అధికారంలో సీనియర్లకు కీలక బాధ్యతలు ఇస్తే బాగుంటుందనే సూచనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

పార్టీ వర్గాలు పేర్కొంటున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం కేసీఆర్‌ మూడు అంశాలపై వచ్చే ఫలితాల గురించి ఎదురుచూస్తున్నారు. మొదటిది లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ సొంత మెజారిటీతో అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో పార్టీని కింది స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ వస్తే తెలంగాణలో తన అదష్టాన్ని పరీక్షించుకునేందుకు, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి తగిన మెజారిటీ వస్తే, కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయిలో దష్టిని కేంద్రీకరించక తప్పదు. రెండవ అంశం కేంద్రంలో ఎన్డీఏ కూటమికి తగిన మెజార్టీ రాని పక్షంలో తమ మద్దతు అవసరమైతే షరతులతో కూడిన మద్దతు ఇవ్వడం లేక బేషరతు మద్దతు ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలో చేరడమా అనే దానిలో ఒక మార్గాన్ని కేసీఆర్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. మూడో అంశం ఎన్డీఏ కూటమికి లేదా కాంగ్రెస్‌ కూటమికి మెజారిటీ రాని పక్షంలో తాను ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ను తెరపైకి తెచ్చేందుకు జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు తలెత్తితే వైకాపా, బీజేడీ, టీఎంసీ తదితర పార్టీలను కలుపుకొని పోయేందుకు కేసీఆర్‌ వ్యూహాత్మక ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు.

ఇంతకీ లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు రాని పక్షంలో కూడా ప్రతిపక్ష పార్టీలు బలపడే అవకాశం ఉంది. ఇలావుంటే, మే 23వ తేదీలోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజులకే పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో 32 జడ్పీ చైర్మన్‌ ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభకు ఎన్నికలు జరిగేటప్పటికీ, మే నెలలో పరిషత్‌ ఎన్నికలకు మధ్య రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజల్లో అసంతప్తి పెరిగింది. ఇంటర్‌ పరీక్షల వైఫల్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అలాగే ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న మంత్రులు విపక్షాల విమర్శలపై ఆశించిన రీతిలో ధీటుగా స్పందించలేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందేమో నన్న ఆందోళనతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇంటర్‌ బోర్డు వైఫల్యం ఉన్నప్పటికీ, విద్యార్థులకు భరోసా ఇవ్వడంలో మంత్రులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే సీనియర్‌ మాజీ మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌ రావు తదితరులు ప్రభుత్వం వెలుపల ఉన్నారు. ఈ తరహా సీనియర్లు మంత్రివర్గంలో ఉంటే ఈ స్థాయిలో అభాసుపాలయ్యేది కాదనే వాదన ఉంది.

అలాగే కేటీఆర్‌ పార్టీ వర్కింగ్‌ అధ్యక్షుడుగా ఉండడంతో, ప్రభుత్వాన్ని ఎంత వెనకేసుకుని వచ్చినా, అధికారం లేని హామీకి అంతగా విలువ ఉండదు. మే నెలలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, పరిషత్‌ ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో మార్పులు చేసి మాజీలుగా ఉన్న సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకునే విషయమై కేసీఆర్‌ ఒక నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. కేటీఆర్‌ను పార్టీకే పరిమితం చేయడం కంటే, మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించడం వల్లనే ఉపయోగముంటుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరుగుతాయి. మరో నాలుగున్నరేళ్ల పాటు కేటీఆర్‌ను మంత్రివర్గం వెలుపల ఉంచడం అంత మంచిది కాదని మంచి ఫామ్‌లో ఉన్న బలమైన నేతగా అవతరించిన కేటీఆర్‌ కు మంత్రివర్గంలో మంచి స్థానం కల్పించాలని దీనికి ఇదే సరైన సమయమని కేసీఆర్‌ అనుకుంటూ, ఎన్నికల సమయంలో మాత్రం కామరాజ్‌ సూత్రం ప్రకారం ఒక ఏడాది ముందు పూర్తిగా పార్టీకి కేటీఆర్‌ను పరిమితం చేయాలని అనుకున్నారు.

రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మే 11వ తేదీకి ఐదు నెలలు గడుస్తుంది. కుటుంబ పార్టీ అనే విమర్శలు ఎన్ని ఉన్నా, కేటీఆర్‌, హరీష్‌ రావు లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. రాజకీయంగా ప్రత్యర్థులను ఢీ కొనే ఫైర్‌ బ్రాండ్లు లేని మంత్రివర్గం వల్ల రాజకీయంగా నష్టం ఎక్కువగా కనిపిస్తోందని టీఆర్‌ఎస్‌ వర్గాలు కూడా భావిస్తున్నాయి.మరోవైపు పరిషత్‌ ఎన్నికల్లో ప్రజల నాడి బయటపడుతుందని, అసెంబ్లీలో ప్రతిపక్షం బలం నామమాత్రంగానే ఉండవచ్చు. అంత మాత్రాన తమకు ఎదురులేదనే భ్రమలు మంచివికావని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంటర్‌బోర్డు వైఫల్యం ప్రభుత్వ వ్యవస్థలో మెల్లి మెల్లిగా చోటు చేసుకుంటున్న ఉదాసీన వైఖరి, నిర్లిప్తతకు నిదర్శనమని చెప్పవచ్చును. మంత్రివర్గంలో ఫామ్‌లో ఉన్న నాయకులు లేనందువల్ల వచ్చే నష్టం తీవ్రంగానే ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా వేస్తున్నారు.