ఆంధ్రప్రదేశ్‌ను అన్నీవిధాలా అభివృద్ధి చేసి స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్మార్ట్‌ విలేజ్‌ - స్మార్ట్‌ వార్డ్‌ కార్యక్రమంలో ఎన్నారైలు పెద్దసంఖ్యలో పాల్గొనాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి తనయుడు, టిడిపి యువ నాయకుడు నారా లోకేష్‌ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా మే 10వ తేదీన డాలస్‌ వచ్చినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఎన్నారై టీడిపి అభిమానులు ఊరేగింపుగా ఆయనను వేదిక వద్దకు తీసుకువచ్చి హెలికాఫ్టర్‌ నుంచి ఆయనపై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుతున్నారు.

తొలుత నవనీత కృష్ణ గొర్రెపాటి అందరికీ స్వాగతం పలుకుతూ స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి వైద్యవిద్యార్థి చదువుకోసం కోటి రూపాయలను ఖర్చు పెట్టి చదివిస్తోంది. అలాంటి ప్రభుత్వానికి మనవంతుగా చేయూతనందించేందుకు మనకు లభించిన మరో అవకాశం స్మార్ట్‌విలేజ్‌ పథకం. ఈ పథకంలో పాల్గొనేందుకు అందరూ ముందుకురావాలి. ఎన్నారై టీడిపి డాలస్‌ తరపున కెసి చేకూరి మాట్లాడుతూ ఎన్నారైటీడిపి తరపున ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ వర్థంతి, జయంతి వంటి కార్యక్రమాలతోపాటు పార్టీ వ్యవస్థాపకదినోత్సవం వంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నాము. తమ విభాగం తరపున ప్రభుత్వానికి సహాయపడే విధంగా హుదూద్‌ లాంటి విపత్తులు సంభవించినప్పుడు విరాళాలు వసూలు చేసి ప్రభుత్వ సహాయనిధికి కూడా పంపిస్తున్నామని చెప్పారు. 

డాక్టర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ, ఇన్నాళ్ళు ఎన్నారైలను మనీబ్యాంక్‌లాగా చూశారని, కాని నారా లోకేష్‌ మీ మనీ కాదు మాకు కావాల్సింది మీ ఆలోచనలు, మీ సహాయ సహకారాలు కావాలంటూ వచ్చారని ప్రశంసించారు. స్మార్ట్‌సిటీ కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం కావాలంటూ ఆయన వచ్చారని మనం కూడా మన గ్రామాల అభివృద్ధికి తోడ్పడేందుకు మరో అవకాశంగా దీనిని భావించవచ్చని చెప్పారు. 

నారా లోకేష్‌ మాట్లాడుతూ, ఐటీ విప్లవాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తరువాత ఎంతోమంది జీవితాలు మారిపోయాయని చెప్పారు. నేడు అమెరికాను శాసించగలిగేలా తెలుగువాడు ఎదిగారంటే అందుకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఐటీ విప్లవమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. చంద్రబాబు హైదరాబాద్‌ను ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పుడు ఎలా అభివృద్ధి చేయాల్లో ఆలోచించి ఆయన మూడు విజన్‌లు ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే టాప్‌ 3లో ఒకటిగా, టాప్‌ 1గా, చివరకు ఆగ్నేయాసియా దేశాల్లో నెంబర్‌వన్‌ రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్‌ను ఉండాలన్న ఉద్దేశ్యంతో విజన్‌లను ఆయన ప్రవేశపెట్టారు. జన్మభూమి వల్ల కొన్ని అభివృద్ధిపనులు జరిగాయి. పూర్తిస్థాయి అభివృద్ధి గ్రామాల్లో జరగాలన్న ఉద్దేశ్యంతో స్మార్ట్‌విలేజ్‌ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారని లోకేష్‌ చెప్పారు. విద్యారంగ అభివృద్ధికోసం ఐదారుగురు చేతులు కలిపి ముందుకు రావచ్చని లోకేష్‌ తెలిపారు. జియో ట్యాగింగ్‌ వ్యవస్థ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను నిత్యం చూసుకునే వీలు కూడా ఉందని తెలిపారు. 

సుగుణ్‌ చాగర్లమూడి మాట్లాడుతూ, జిల్లాలను విభజించి ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరిని అంబాసిడర్‌గా నియమించి  గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇలా ఇప్పటికే 20మందిని అంబాసిడర్‌లుగా నియమించామని చెప్పారు. ఇప్పటికే 262 గ్రామాలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి నవనీత కృష్ణ గొర్రెపాటి, రాఘవేంద్ర ప్రసాద్‌, చలపతి కొండ్రకుంట, మురళీ వెన్నం, రామ్మోహన్‌ సూర్యదేవర, సురేష్‌ మండువ, శ్రీనివాస్‌ కోనేరు, లోకేష్‌ నాయుడు, అనిల్‌ వీరపనేని,  రవి వేమూరు, కృష్ణ, దొడ్డా సాంబ, సూర్య మండువ, కెసి చేకూరి, విజయ్‌ కాకర్ల, చంద్రహాస మద్దుకూరి తదితరులు కృషి చేశారు. 

నాన్‌ రెసిడెంట్‌ తెలుగూస్‌ (ఎన్‌ఆర్‌టి) ఏర్పాటు చేయనున్నాము...లోకేష్‌

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎన్నారైలకోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాన్‌ రెసిడెంట్‌ తెలుగూస్‌ (ఎన్‌ఆర్‌టి)పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు నారా లోకేష్‌ తెలిపారు. ఇందులో ప్రపంచంలో ఉన్న తెలుగు ఎన్నారైలంతా సభ్యత్వాన్ని స్వీకరించాలి. సభ్యులైన ప్రతి ఒక్కరికీ కావాల్సిన సహాయసహకారాలను ప్రభుత్వం అందించనున్నది. అంటే తిరుపతి దర్శనం నుంచి పరిశ్రమల ఏర్పాటు దాకా ఎన్నో విషయాల్లో ఇందులో ఉన్న సభ్యులకు ప్రభుత్వం నుంచి సహకారాలు లభ్యంకానున్నాయి. ఈ విభాగానికి   సంబంధించిన పూర్తి వివరాలను రెండు మూడునెలల్లో ప్రకటిస్తామని లోకేష్‌ తెలిపారు. 


Click here for PhotoGallery