Kanakadurga Ammavari Kumkuma Poojalu in New Jersey

న్యూజెర్సిలోని శ్రీ స్వామినారాయణ్‌ టెంపుల్‌లో  మే 6వ తేదీన జరిగిన విజయవాడ కనకదుర్గ కుంకుమార్చన పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. మే 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 'తెలుగు టైమ్స్‌', 'పాఠశాల', ధనలక్ష్మీ ట్రస్ట్‌ న్యూజెర్సిలో ఈ పూజలను మే 6,7 తేదీల్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కంప్యూగ్రా అధినేత రామ్‌ మోహన్‌ వేదాంతం ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పడి పూజలకు అవసరమైన ఏర్పాట్లను చేసింది. మరోవైపు భానుప్రసాద్‌ దివాకర్ల టీమ్‌ కూడా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కృషి చేసింది. విజయవాడ నుంచి వచ్చిన అమ్మవారి అర్చకులు భక్తుల చేత శాస్త్రోక్తంగా త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్ర కుంకుమార్చన చేయించారు. పూజల్లో పాల్గొనడానికి వచ్చిన భక్తులు విజయవాడ నుంచి అమ్మవారి విగ్రహాన్ని చూసి పులకించిపోయారు.

ఈ పూజల్లో రామ్‌ వేదాంతం దంపతులతోపాటు తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంటసుబ్బారావు దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ కుంకుమార్చనలకోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చిన పూజారులు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకర శాండిల్య, కోట ప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు, పిఆర్‌ఓ అచ్చుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.


Click here for Event Gallery