ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషిచేస్తా

ap special representative jayaram komati press meet in tirumala

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు కృషి చేస్తానని అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ఎన్ఆర్ఐలు కృషి చేయాలన్నారు. గత 35 ఏళ్లగా తాను అమెరికాలో నివసిస్తున్నానని అన్నారు. ప్రముఖులతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. స్థానిక తెలుగు విద్యార్థులకూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వీసా వచ్చినంత మాత్రాన సరిపోదని, మంచి విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వచ్చే విద్యార్థులకు అవగాహన కోసం తానా వెబ్‌సైట్లో త్వరలో మార్గదర్శక సూత్రాలను పొందుపర్చుతున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారో అందుకు తప్పకుండా మా ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.