ఉత్తర అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జయరామ్ కోమటి

Govt of AP has appointed Jayaram Komati as Special Representative for North America

ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధిగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు జయరామ్‌ కోమటిని నియమించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. అమెరికాకు వచ్చే అధికారిక ప్రతినిధులకు, ప్రముఖులకు అవసరమైన సౌకర్యాలు, సమావేశాలు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించడం, కార్యక్రమాలను సమన్వయం చేయడం వంటి వాటితోపాటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల అమలుకు అవసరమైన ఏర్పాట్లను కూడా జయరామ్‌ కోమటి చూడనున్నారు.

ఏ దేశమెగినా...నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నట్లుగా జయరామ్‌ కోమటి అమెరికాలో తెలుగు వైభవాన్ని చాటి చెబుతున్నారు. అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించి ఆ సంస్థకు పెద్దదిక్కుగా ఇప్పటికీ వ్యవహరిస్తున్నారు. 25 సంవత్సరాలుగా ఆయన అమెరికాలో తెలుగు వైభవానికి విశేషంగా కృషి చేస్తున్నారు.

కృష్ణాజిల్లా మైలవరం మండలంలోని వెల్వడం గ్రామం జయరామ్‌ కోమటి స్వస్థలం. ఆయన తండ్రి  కోమటి భాస్కరరావు, తల్లి శ్రీమతి కమల. కోమటి భాస్కరరావు మైలవరం పంచాయతీ సమితి  ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. 1980లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన జయరామ్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎంబిఎ డిగ్రీ తీసుకుని రెస్టారెంట్‌ బిజినెస్‌తో అమెరికాలో తన జీవితాన్ని ప్రారంభించారు.

శాన్‌ఫ్రాన్సిస్కో సమీపంలోని మిల్‌పిటాస్‌లో 'స్వాగత్‌ గ్రూపు ఆఫ్‌ హోటల్స్‌'ను జయరామ్‌ కోమటి స్థాపించారు. అక్కడి తెలుగువారినే కాక అమెరికన్లకు కూడా స్వాగత్‌ రెస్టారెంట్‌ అంటే బాగా తెలుసు. భారతదేశం నుంచి అమెరికా వెళ్లిన తెలుగు ప్రముఖులంతా ఆయన ఆతిధ్యాన్ని స్వీకరించకుండా తిరిగి వెళ్ళరు. 26 సంవత్సరాలకుపైగా రెస్టారెంట్‌ రంగంలో బిజినెస్‌ చేస్తున్న జయరాం కోమటి అనేకమందికి ఉపాధిని కల్పించారు. వారిని ప్రోత్సహించి బిజినెస్‌లో వారికి మార్గదర్శకులయ్యారు.

అమెరికాలో తెలుగువాళ్ళ కోసం 'తెలుగు టైమ్స్‌' అనే పత్రికను స్థాపించి 13 సంవత్సరాలుగా ఆ పత్రికను నిరంతరాయంగా నడుపుతున్నారు. భారతదేశంలో కూడా ఆయన ఓ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. లింగయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనెజ్‌మెంట్‌, టెక్నాలజీని హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆయన స్థాపించారు. 2009లో కేంద్రప్రభుత్వం డీమ్డ్‌ యూనివర్సిటీగా దీనిని గుర్తించింది. కృష్ణా జిల్లాలో 2002లో ఇంజనీరింగ్‌ కళాశాలను కూడా ఆయన స్థాపించారు. విద్యార్థులకు మంచి చదువును చెప్పించాలనే ఉద్దేశ్యంతో ఆయన విద్యారంగంలో అడుగుపెట్టారు. అమెరికాలోని తెలుగు చిన్నారుల కోసం 'పాఠశాల'ను కూడా ఆయన ఏర్పాటు చేసి తెలుగు భాషను మన చిన్నారులకు నేర్పిస్తున్నారు.

కమ్యూనిటీ నాయకునిగా...

తెలుగు, తమిళ, అస్సామీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ, రాజస్థానీ ఇంకా ఎన్నో భారతీయ భాషల సంఘాలతో కూడిన ఎఫ్‌.ఐ.ఎకి ఆయన అధ్యక్షునిగా కూడా ఉన్నారు.  2001 నుంచి 2003 వరకు ఎఫ్‌ఐఎ చైర్మన్‌గాను 2003 నుంచి 2005 వరకు ప్రెసిడెంట్‌గాను ఉండి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహించి భారతీయ సంస్కృతి - సంప్రదాయాల అభివృద్ధికి ఆయన కృషి చేసారు. ఎఫ్‌ఐఎ అధ్యక్షునిగా ఆయన ఇండో - అమెరికన్‌ ప్రజలకోసం పౌరహక్కుల కార్యక్రమాలను ప్రారంభించారు. రాజకీయ విద్యాకార్యక్రమాలు, ఓటర్‌ నమోదు కార్యక్రమాల ద్వారా రాజకీయ సాధికారత పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అమెరికాలో వివిధ స్థానిక ఎన్నికలలో రాజకీయ పదవులను కోరుకునే భారతీయ సంతతి అభ్యర్థుల కోసం నిధుల సమీకరణలో కూడా ఆయన పాలుపంచుకున్నారు. ఎఫ్‌ఐఎ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఇండియాడే వేడుకలకు బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ను అమెరికాకు రప్పించారు. దాదాపు 70వేల మంది ఈ వేడుకలకు తరలివచ్చారు. ఆ వేడుక ఓ  రికార్డుగా చెప్పుకుంటారు.

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా)కు 2009-11లో అధ్యక్షునిగా వ్యవహరించారు. 2003లో తానా కన్వీనర్‌గా వ్యవహరించి తానా మహాసభలను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటికీ తానాకు ఆయన పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు.

 


                    Advertise with us !!!