జన్మభూమి అభివృద్ధిలో న్యూయార్క్‌లోని ఎన్నారైలు ఎంతో చేస్తున్నారని, అదే సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలంటే మరింతగా ఎన్నారైలు చేయూతను ఇవ్వాల్సిన అవసరం ఉందని అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికోసం, పెట్టుబడులకోసం ఆయన అమెరికా నలుమూలలా పర్యటిస్తూ, ఎన్నారైలను జాగృతం చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్‌ వచ్చినప్పుడు ఆయనను స్థానిక తెలుగు సంఘాలు, తెలుగు ప్రముఖులు ఘనంగా స్వాగతించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపరిచేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, ప్రజల సంక్షేమంకోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని, అదే సమయంలో ఎన్నారైల సంక్షేమానికి, ఎన్నారైల సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఎన్‌ఆర్‌టి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

అమెరికాలోని ఎన్నారైలకు నవ్యాంధ్ర అభివృద్ధి పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా, ఎన్నారైలకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జయరామ్‌ కోమటి చెప్పారు. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ), తానా ఫౌండేషన్‌ మాజీ చైర్మన్‌ జే తాళ్ళూరి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు నవ్యాంధ్ర అభివృద్ధికి తమవంతుగా చేయూతను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, టిఎల్‌సిఎ ప్రెసిడెంట్‌ సత్య చల్లపల్లి, టిఎల్‌సిఎ బోర్డ్‌ ట్రస్టీ చైర్మన్‌ రాఘవరావు పోలవరపు, ఆటా మాజీ అధ్యక్షుడు రాజేందర్‌ జిన్నా, తానా వ్యవస్థాపకులు తిరుమలరావు తిపిర్నేని, గడ్డం దశరథ రామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Click here for Event Gallery