ఎపి విద్యాభివృద్ధికి ముందుకు వస్తున్న ఎన్నారైలు

24-04-2017

ఎపి విద్యాభివృద్ధికి ముందుకు వస్తున్న ఎన్నారైలు

-గంటా, జయరామ్‌ సమక్షంలో హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యాభివృద్ధికోసం చేస్తున్న కృషిలో పాలుపంచుకునేందుకు అమెరికాలోని ఎంతోమంది ఎన్నారైలు ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. విదేశీయులంతా మన రాష్ట్రంలో అమలవుతున్న విద్యావిధానంపై ఆసక్తి కనబరిచేలా విద్యాప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజేషన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ స్టేట్‌గా, ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు అవసరమైన అన్నీ చర్యలను తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా మన విద్యావిధానం ఉండాలని ఆయన అభిలషిస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న విద్యాలయాలను ఆయన సందర్శించడంతోపాటు అక్కడి బోధనా పద్ధతులను, అడ్మినిస్ట్రేషన్‌ వ్యవహారాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీమతి కె. సంధ్యారాణి, అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికోసం చేస్తున్న చర్యలను తెలపడంతోపాటు, విద్యాభివృద్ధిలో ఎన్నారైల సహకారాన్ని కోరుతున్నారు.

డాలస్‌లో జూలై 7వ తేదీన జరిగిన ఇంటరాక్టివ్‌ సెషన్‌ విత్‌ ఎపి గవర్నమెంట్‌ టీమ్‌ సమావేశానికి ఎంతోమంది ఎన్నారైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్‌లో 15శాతంపైగా నిధులను కేటాయించిందన్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థుల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంతోపాటు, నేటి సాంకేతిక ప్రపంచంలో వారు కూడా రాణించేలా తయారయ్యేందుకు పాఠశాలల్లో డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఇందులో ఎన్నారైల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం కోరుకుంటోందని, ఎన్నారైలు 30శాతం భరిస్తే, ప్రభుత్వం మిగిలిన 70శాతం నిధులను కేటాయించి డిజిటల్‌ తరగతి గదులను నిర్మిస్తుందన్నారు.

ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నారైలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని, తనతోపాటు ఆనంద్‌ కూచిభొట్ల, రవి వేమూరుకు కీలక బాధ్యతలను అప్పగించిన విషయాన్ని తెలిపారు. ప్రభుత్వం తనకు హైదరాబాద్‌లో కార్యాలయాన్ని కేటాయించినప్పటికీ అమెరికాలోని ఎన్నారైలకోసం శాన్‌ఫ్రాన్సిస్కోలో కూడా కార్యాలయాన్ని సొంతంగా తానే ఏర్పాటు చేశానని, ఎన్నారైలు జన్మభూమి అభివృద్ధికోసం ఇచ్చే విరాళాలు సద్వినియోగం అయ్యేలా చూడటంతోపాటు వారికి ఎప్పటకిప్పుడు వివిధ విషయాల్లో సమాచారాన్ని తమ కార్యాలయం అందిస్తుందని చెప్పారు. దాదాపు 5000 డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నానని, ఎన్నారైల సహకారంతో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయగలనన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీమతి కె. సంధ్యారాణి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితులను తెలియజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణతాశాతం మెరుగునకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె తెలియజేశారు.

సమావేశంలో పాల్గొన్న ఎన్నారైలు ఎపి ప్రభుత్వానికి బాసటగా నిలిచేందుకు తాము సిద్ధమేనని తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో దాదాపు 300 నుంచి 350కిపైగా స్కూళ్ళలో డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని లోకేష్‌ నాయుడు ప్రకటించారు. చలపతి 10 స్కూళ్ళలో డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటుకు,  ఐటీ సర్వ్‌ అలయన్స్‌ సభ్యులు 50కిపైగా స్కూళ్ళలో డిజిటల్‌ తరగతి గదులను ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. మొత్తం మీద 500కిపైగా స్కూళ్ళలో డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటుకు ఎన్నారైలు ఇక్కడ ముందుకు వచ్చారు.