అమెరికాలో ప్రవాసభారతీయుల సంఖ్య 30 లక్షలకుపైగా ఉంది. అందులో చాలామంది వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అమెరికా రాజకీయ తెరపై రాణిస్తున్న భారతీయుల సంఖ్య మాత్రం సింగిల్‌ డిజిట్‌లోనే ఉంటుంది. వీరి సంఖ్య సింగిల్‌ డిజిట్‌లో ఉన్నా వీరి వెనుక ఎన్నారైలతోపాటు అమెరికన్లు కూడా ఉండటం విశేషం. అమెరికావాసుల మద్దతును కూడా వీరు పొందారంటే వీరు ఎంత సమర్థత ఉన్నవారో అర్థమవుతుంది. అమెరికా ఎన్నికల్లో ఇప్పుడు పెద్దగా వినిపిస్తున్న ఎన్నారై పేరు రాజా కృష్ణమూర్తి. దిలీప్‌సింగ్‌, బాబిజిందాల్‌, అమీబేరా తరువాత అమెరికన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా చిన్నతనంలో ఎన్నికల్లోకి వచ్చిన అభ్యర్థిగా రాజాకృష్ణమూర్తి పేరు పొందారు. రాజా కృష్ణమూర్తి స్వస్థలం ఢిల్లీ. చిన్నతనంలోనే ఆయన కుటుంబంతోపాటు న్యూయార్‌ వెళ్ళి స్థిరపడిపోయారు. ఇండో అమెరికన్‌ సభ్యులకు ఆయన రోల్‌ మోడల్‌ అని చెబుతారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్‌కు ఇల్లినాయి నుంచి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు.

ఇల్లినాయిలోని 8వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి రాజా కృష్ణమూర్తి యుఎస్‌ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్నారు. నవంబర్‌ 8న జరిగే సాధారణ ఎన్నికల్లో ఆయన భవితవ్యం తేలనున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధుల కోసం ఎంతోమంది ఎన్నారైలు కృషి చేస్తున్నారు. వారిలో తెలుగువాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం విశేషం. డాలస్‌లో ఉన్న ఇండో అమెరికన్‌ కాంగ్రెస్‌ నాయకుడు ప్రసాద్‌ తోటకూర, ఎంవిఎల్‌ ప్రసాద్‌ తదితరులు ఆయనకు మద్దతుగా ఇటీవల సమావేశమై ఆయనకు తమ మద్దతును తెలియజేశారు. మరోవైపు చిన్నవయస్సు నుంచే అమెరికా వాసిగా ఉన్నందువల్ల ఆయనకు సాధారణ ప్రజల కష్టనష్టాలు బాగా తెలుసునని అటువంటి వ్యక్తి యుఎస్‌ కాంగ్రెస్‌కు ఎన్నికైతే తమ కష్టాలు తీరుతాయని చాలామంది భావిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు ఆయన వచ్చినప్పుడు అప్పుడు ఆయన వయస్సు కేవలం 3 నెలలు మాత్రమే. తరువాత ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పొంది, హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి ఆనర్స్‌ పట్టాను ఆయన అందుకున్నారు. విద్యారంగానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భారతీయ వారసత్వానికి మూలమైన క్రమశిక్షణ, నైతికత, సంప్రదాయ విలువలను ఆయన పెంపొందించుకున్నారు. ఎన్నికల పై ఆయన మాట్లాడుతూ, భారతీయ అమెరికన్‌లు రాజకీయ భాగస్వామ్యంలో వెనుకబడి ఉన్నారని, దానిని దృష్టిలో పెట్టుకునే తాను ఎన్నికల్లోకి అడుగు పెట్టినట్లు చెప్పారు. అమెరికా ప్రధాన రాజకీయ స్రవంతిలోకి అడుగుపెట్టడం ద్వారా ఎంతోమందికి సేవలందించే అవకాశం ఉంటుందని తాను భావిస్తున్నా నని అంటారు. ఎన్నో పదవులను చేపట్టిన రాజాకృష్ణ మూర్తికి అక్కడి ఎన్నికలపై మంచి పట్టు కూడా ఉంది.

ఈసారి జరిగే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి గట్టిపోటీనే ఉన్నా డొనాల్డ్‌ ట్రంప్‌ తన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల, కొన్ని అంశాల వల్ల మద్దతును కోల్పోతున్నారని ఆయన చెప్పారు. హిల్లరీ క్లింటన్‌ విజయం గతంలో కన్నా ఇప్పుడు ఎంతో మెరుగైందని ఆయన పేర్కొన్నారు.