పిడుగురాళ్ళలో 'తానా' రైతు సదస్సు

24-04-2017

పిడుగురాళ్ళలో 'తానా' రైతు సదస్సు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రైతుకోసం కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ళలో రైతు సదస్సును నిర్వహించి రైతులకు రక్షణ పరికరాలను అందజేసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్లే యరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు కుటుంబాల్లో పుట్టి అమెరికాలో ఉద్యోగాలు సంపాదించి వారు సంపాదించిన దానిలో కొంత డబ్బును ఇక్కడి తెలుగు ప్రజలకోసం ఖర్చుచేయడం అభినందనీయమని చెప్పారు. తానా సభ్యులు గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే దేశానికి వెన్నెముక వంటి రైతులకోసం రక్షణ పరికరాలను అందించడం ప్రశంసనీయమని తెలిపారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయరంగం ఆపదలో ఉందని, 2015లో జరిగిన తానా 20వ సమావేశంలో అగ్రికల్చరల్‌ ఫోరం ఏర్పాటు చేసి వ్యవసాయరంగానికి తమవంతుగా సాయం అందించాలని అనుకున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులకు రక్షణ పరికరాలను అందజేస్తున్నామని చెప్పారు. పిడుగురాళ్ళలోనే మొదటగా రైతు సదస్సును ఏర్పాటు చేశామని, 350 మంది రైతులకు ఈ పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు. తాము రెండు రాష్ట్రాల్లో 23వేల పరికరాలను రైతులకు ఇస్తున్నట్లు కూడా ఆయన వివరించారు.

తానా అగ్రికల్చరల్‌ ఫోరం అధ్యక్షుడు కోట జానయ్య మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో క్రిమి కీటకనాశన పదార్ధాలను ఎక్కువగా వినియోగిస్తున్నారని, పంటకు ఈ మందులు చల్లే సమయంలో అది రైతులపై కొంత ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. దాని నుంచి రక్షణకే తాము పరికరాలను ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ సంయుక్త డైరెక్టర్‌ జె. కృపాదాసు తానా ఇచ్చే రక్షణ పరికరాలను రైతులు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, తానా మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, గంగాధర్‌ నాదెళ్ళ తదితరులు పాల్గొన్నారు.