'తానా' కర్నూలుకు రావడం మన అదృష్టం....టీజి వెంకటేష్

23-04-2017

'తానా' కర్నూలుకు రావడం మన అదృష్టం....టీజి వెంకటేష్

రాష్ట్రంలోనే సాంస్కృతిక కళా ప్రదర్శనలకు కర్నూలును వేదికగా చేయనున్నట్లు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), టీజీవీ కళాక్షేత్రం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సాంఘిక  నాటక పోటీలను గురువారం టీజీవీ, తానా సంయుక్త కార్యదర్శి రవిపొట్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ తానా కర్నూలుకు రావటం గొప్ప విషయమన్నారు. తెలుగువారికి సేవతో పాటు తెలుగు సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు తానా కృషి చేస్తోందని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చే నెలలో 13 రోజుల పాటు కర్నూలులో గొప్ప సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తోందన్నారు.

తానా ప్రతినిధి రవి పొట్లూరి మాట్లాడుతూ తానా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చైతన్యస్రవంతి పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం తానా 40వ వసంతంలోకి అడుగు పెడుతోందన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్‌ క్లబ్‌అధ్యక్ష కార్యదర్శులు భీమేశ్వరరెడ్డి, బలరాంలను సన్మానించారు. లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య  అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తానా కార్యక్రమాల సమన్వయకర్త ముప్పా రాజశేఖర్‌, రెండు, మూడో పట్టణ సీఐలు మధుసూదనరావు, డేగల ప్రభాకర్‌, సమితి కార్యదర్శి మహ్మద్‌మియ్యా, కోశాధికారి వెంకటేశ్వర్లు, ప్రతినిధులు రాముడు, కిష్టఫర్‌, లక్ష్మీ కాంతరావు, శ్రీనివాసరావు, యాంగంటీశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.

విజ్ఞానం, వినోదం పంచిన నాటకాలు

తానా జాతీయస్థాయి నాటక పోటీల్లో ప్రదర్శితమయిన మూడు నాటకాలు ఆహుతులకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని పంచాయి. నటులు తమ నటనా ప్రతిభతో వీక్షకుల మనసును దోచుకున్నారు. గుంటూరు రంగయాత్ర వారి  అనంతరం, కరీంనగర్‌ చైతన్య భారతి వారి దొంగలు, గుంటూరు గణేష్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ వారి అంతాభ్రాంతియే నాటకాలు ఆహుతులను రంజింపచేశాయి.

Click here for Event Gallery