'తానా' 2017 ఎన్నికల సందడి

21-04-2017

'తానా' 2017 ఎన్నికల సందడి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ఇప్పుడు ఎన్నికల సందడి కనిపిస్తోంది. అమెరికాలోని తెలుగువారికి పెద్ద దిక్కుగా కనిపించే తానాలో పదవులు నిర్వహించడం కూడా ఎంతోమంది ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. తానాలో ప్రతి రెండేళ్ళకోమారు జరిగే ఎన్నికలపై చాలామంది ఆసక్తిని కనబరుస్తారు. తానా ఎన్నికల ప్రకటన వస్తుందన్న విషయం తెలియగానే పోటీలో నిలబడాలనుకునే వాళ్ళు ఆరునెలల ముందు నుంచే తమకు అనుకూలంగా పరిస్థితులు ఉండేలా చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అందరి దృష్టిలో పడేందుకు వీలుగా కార్యక్రమాలను నిర్వహించడం వంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా తానా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న చాలామంది ఆరునెలల ముందే చాపకింద నీరులా ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ పదవికి పోటీపడాలనుకునే వాళ్ళు పెద్దఎత్తున తమ తమ అనుమాయుల ద్వారా వివిధ నగరాల్లో ఉన్న తానా సభ్యులకు తమ వివరాలను తెలియజేస్తూ, వారికి సన్నిహితమయ్యేలా ప్రవరిస్తుంటారు.

తానా 2017 ఎన్నికల ప్రకటన ఈ విధంగా ఉంది. ఈ ఎన్నికలకు ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా సతీష్‌ చిలుకూరి వ్యవహరిస్తున్నారు.

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (2017-21) పదవిలో 3 పదవులకు ఓపెన్‌ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. నాన్‌ డోనర్‌ డైరెక్టర్‌ పదవులు 2, డోనర్‌ డైరెక్టర్‌ పదవి 1కి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (2017-19) పదవులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 25 పోస్టులకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, ట్రెజరర్‌, జాయింట్‌ సెక్రటరీ, జాయింట్‌ ట్రెజరర్‌, కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, కల్చరల్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌, కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌, కెనడా, న్యూ ఇంగ్లాండ్‌, న్యూయార్క్‌, మిడ్‌ అట్లాంటిక్‌, క్యాపిటల్‌, అప్పలాచిన్‌, సౌత్‌ ఈస్ట్‌, నార్త్‌, ఒహాయో వ్యాలీ, మిడ్‌వెస్ట్‌, నార్త్‌ సెంట్రల్‌, సౌత్‌ సెంట్రల్‌, సౌత్‌ వెస్ట్‌, వెస్ట్‌, నార్త్‌ వెస్ట్‌, రాకీ మౌంటెన్స్‌లలో ఉన్న రీజినల్‌ కో ఆర్డినేటర్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.

ఫౌండేషన్‌ ట్రస్టీ (2017-21) పదవులకు కూడా ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అందులో ఫౌండేషన్‌ డోనర్‌ ట్రస్టీ పదవులు 2 కాగా, ఫౌండేషన్‌ ట్రస్టీ పదవులు 4 ఉన్నాయి.

ఈ పదవులకు పోటీ పడాలనుకునేవాళ్ళు తమ నామినేషన్‌లను ఫిబ్రవరి 21వ తేదీలోగా పంపాలి. నామినేషన్స్‌, నోటిఫికేషన్‌లను ఫిబ్రవరి 25న ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 3, పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను మార్చి 6న ప్రకటిస్తారు.

బ్యాలెట్‌ మెయిలింగ్‌ మార్చి 20న, బ్యాలెట్‌లు అందాల్సిన తేదీ ఏప్రిల్‌ 21. బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఏప్రిల్‌ 22న బ్యాలెట్‌ కౌంటింగ్‌ ఉంటుంది. ఎన్నికల ఫలితాలను ఏప్రిల్‌ 23న ప్రకటిస్తారు. ఇతర వివరాలకు తానా వెబ్‌సైట్‌ www.tana.org ను చూడవచ్చు.