కేంద్రంలో చక్రం తిప్పే భాగస్వాములు ఎవరు?

12-05-2019

కేంద్రంలో చక్రం తిప్పే భాగస్వాములు ఎవరు?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత ఏర్పడనున్న కొత్త ప్రభుత్వంపై అందరిలోనూ చర్చ జరుగుతోంది. ఓవేళ ఎన్‌డిఎ వచ్చినా, యుపిఎ వచ్చినా ఆ ఫ్రంట్‌లో తెలుగు పార్టీలు ఏవైపున ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. దానికితోడు కేంద్రంలో చేరితేనే తమ రాష్ట్రానికి ప్రయోజనాలు దక్కుతాయన్న విషయం తెలుగు రాష్ట్రాల పార్టీల నాయకులకు బాగా తెలుసు. అందుకే వారు అవకాశాలను ఎక్కడా జారవిడుచుకోరు. భారత్‌లో ఫెడరల్‌ వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ రాష్టాలకున్న అధికారాలు పరిమితమైనవి. కేంద్ర సహకారం, సహాయం లేకుండా రాష్టాలు అభివ ద్ది సాధించగలిగే పరిస్థితులు ఇక్కడలేవు. గతంతో పోలిస్తే కేంద్రం మరింత బలంగా తయారైంది. ఆర్ధిక వ్యవస్థ మొత్తం కేంద్రప్రభుత్వం వద్దే కేంద్రీక తమైంది. ఈ పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకున్నా కేంద్రంతో జతకడితే తప్ప రాష్ట్రాలకు ఆర్ధిక మనుగడ కష్టం. పైగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించేశాయి. వీటిని కేంద్ర సహకారం లేకుండా అమలు చేసే పరిస్థితి ఏమాత్రం లేదు.

ఈసారి కేంద్రంలో ఏ పార్టీకి ఏకపక్షంగా మెజార్టీ లభించే అవకాశాలు స్పష్టం కావడంలేదు. బిజెపి కూడా గతంలో లాగా మేజిక్‌ ఫిగర్‌ను సాధించే పరిస్థితుల్లేవని ముందస్తు సర్వేలు తేల్చేస్తున్నాయి. సొంత పార్టీలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అలాగని యుపిఎ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోయింది. ఈ నేపధ్యంలో తిరిగి మోడిని ప్రధాని కుర్చీలో కూర్చోనివ్వరాదన్న పట్టుదల బిజెపియేతర పార్టీల్లో నెలకొంది. మోడీని అధికారానికి దూరం పెట్టే విధంగా ప్రాంతీయ పార్టీలు కూడా మూడో ఫ్రంట్‌ ఏర్పాటులో తలమునకలయ్యాయి. ఈ దశలో కాంగ్రెస్‌, తెలుగుదేశం మధ్య మైత్రీబంధం మరింత పటిష్టమౌతోంది. ఓ వైపు మోడిని గద్దె దించే లక్ష్యం.. మరో వైపు కేంద్రంలో తమకనుకూల ప్రభుత్వం ఉండాలన్న ఆలోచన తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నాయకుల్లో కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణాలో ఏకపక్షంగా ఫలితాలొస్తాయని ప్రచారం జరుగుతోంది. దీంతో తమ రాష్ట్ర ప్రయోజనాల దష్ట్యా కేసిఆర్‌ కేంద్రంలో ఏర్పడే ఏ ప్రభుత్వానికైనా మద్దతివ్వడంలో ఆశ్చర్యం లేదు,

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఢీ కొన్నాయి. మూడో ప్రాంతీయ పార్టీ కూడా గట్టిగానే ప్రభావం చూపింది. ఎవరికెన్ని ఎమ్‌పి స్థానాలొస్తాయన్నది ఇతమిద్దంగా తేలే పరిస్థితిలేదు. అయినప్పటికీ ఈ ప్రాంతీయ పార్టీలన్నింటికి రాష్ట్రంలో తమ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ దశలో ఎన్‌డిఎ కూటమికి వ్యతిరేకంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించగలిగే ఏ కూటమిలోనైనా ఇవి భాగస్వాములు కాకతప్పని పరిస్థితి స్పష్టమౌతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తమిళనాడు, జమ్మూ కాశ్మీర్‌లలో గతం నుంచి ఈ సంప్రదాయముంది. అక్కడి ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వాములౌతున్నాయి. మంత్రి పదవులు కూడా తీసుకుంటున్నాయి. తద్వారా తమ సొంత రాష్ట్రాల ప్రయోజనాల్ని కాపాడుకుంటున్నాయి. కేంద్రంలో ఎవరన్నది కాకుండా తమ రాష్ట్రాల్ని దష్టిలో పెట్టుకుని ఈ పార్టీలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి.