కవిత కృషితో విస్తృతమవుతున్న 'తెలంగాణ సంస్కృతి'

30-07-2018

కవిత కృషితో విస్తృతమవుతున్న 'తెలంగాణ సంస్కృతి'

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తరువాత కూడా అప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలోనే కాకుండా, విదేశాల్లో కూడా మంచి ఇమేజ్‌ను తెచ్చుకున్న వారిలో కవిత ఒకరు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తనయురాలిగానే కాకుండా, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా, నిజామాబాద్‌ పార్లమెంట్‌ ప్రతినిధిగా ఆమె చేస్తున్న సేవలు, కార్యక్రమాలే ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకువచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె కీలకపాత్ర పోషించారు.

తెలంగాణలో తెలుగు భాష ప్రాచీన ఆనవాళ్ళు దొరికాయని తన ప్రజంటేషన్‌ ద్వారా ఆ మహాసభల్లో చూపించి అందరి ప్రశంసలను అందుకున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావించడంతోపాటు, కేంద్రమంత్రులతో సమావేశమవుతూ రాష్ట్రానికి రావాల్సిన వాటిని దక్కించుకుంటున్నారు. కాళేశ్వరానికి జాతీయహోదా, బయ్యారం ఉక్కు, ఐటీఐఆర్‌, ఐఐఎం వంటి సమస్యలపై పార్లమెంట్‌లో ఆమె అలుపెరగని పోరాటం?చేస్తున్నారు. మిషన్‌భగీరథకు నిధులు ఇవ్వాలని మంత్రులను కోరుతున్నారు. రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో మరింత ఫలితం పొందేందుకు వీలుగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆమె సూచిస్తున్నారు.

తెలంగాణలో ప్రభుత్వ పథకాల వల్ల అన్నీ కులాలవారు, అన్నీ వృత్తులవారు లబ్దిపొందుతున్నారని, ప్రతిపక్షాలకు విమర్శించడానికి పనే లేకపోయిందని ఆమె చెబుతున్నారు. ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధం సంస్థను గెలిపించడంలో కవిత పాత్ర ఎంతో ఉంది. తాను ఎంపిగా నిజామాబాద్‌ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధిచేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ప్రతి సమస్యను పూర్తిగా అధ్యయనం చేయడం, దానికి పరిష్కారమార్గాలను వెతకడం, ప్రభుత్వపరంగా సాయం అందేలా చూడటం, అందరినీ కలుపుకుని పోవడం కవిత ప్రత్యేకతలని అంటారు. అమె చొరవ నాయకత్వ లక్షణాలను గుర్తించి, బ్రిటన్‌ ప్రభుత్వం లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించన రాజకీయ సదస్సుకు కవితను ఎంపిక చేసింది. దేశంలోని యువ పార్లమెంట్‌ సభ్యురాళ్ళలో ఆ సదస్సుకు వెళ్ళింది కవిత మాత్రమే. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న పతంజలి ఆహారశుద్ధి కేంద్రాన్ని (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌) నిజామాబాద్‌ జిల్లాలో నెలకొల్పేలా చేశారు.

పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కూడా ఆమె కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న ఎన్నారైలను కూడా పార్టీవైపు ఆకర్షితులయ్యేలా చేసేందుకు కృషి చేస్తున్నారు. పార్టీ ఎన్నారై సెల్‌ సమన్వయకర్తగా ఉన్న మహేష్‌బిగాలతో సమావేశమవుతూ వివిధ దేశాల్లో పార్టీశాఖల ఏర్పాటుపై సమీక్షిస్తున్నారు. ఇప్పటికే 7 ఖండాల్లో పార్టీ శాఖలు ఏర్పడ్డాయని ఆమె చెప్పారు. 32 దేశాల్లో వివిధ కార్యక్రమాలను పార్టీ శాఖలు చేస్తున్నాయని, దీనిని ఈ సంవత్సరాంతంలోగా 50దేశాలకు పార్టీని విస్తరించి అక్కడ కూడా పార్టీపరంగా కార్యక్రమాలను నిర్వహించాలని శ్రీమతి కవిత అనుకుంటున్నారు.

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలిగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ఆమె పాటు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితదే. బతుకమ్మ పండుగను నేడు ఊరూరా చేసుకునేలా చేశారు. బోనాల పండుగను కూడా ఆమె ప్రముఖమైన పండుగగా తీర్చిదిద్దారు.

అమెరికాతో అనుబంధం

నిజామాబాద్‌ ఎంపి కవితకు అమెరికాతో మంచి అనుబంధం ఉంది. అమెరికాలోనే మాస్టర్స్‌ పూర్తి చేసిన కవిత తండ్రికి మద్దతుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు అమెరికా నుంచి రాష్ట్రానికి తిరిగివచ్చారు. తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి దానిని అమెరికాలో కూడా ప్రారంభించేలా చేశారు. తెలంగాణ సమాజానికి, అమెరికాలోని ఎన్నారై సమాజానికి వారధిగా తెలంగాణ జాగృతి ఉండేలా కృషి చేశారు. అమెరికాలో ఉన్న తెలంగాణ సంస్థలతో తెలంగాణ జాగృతి మమేకమై, వారితో కలిసి వేడుకలను నిర్వహించడం ద్వారా మంచి గుర్తింపును ఆమె సాధించుకున్నారు. అమెరికాలో బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించేలా కవిత పాటుపడ్డారు. ఆమె కృషికి తగ్గట్టుగానే నేడు అమెరికాలో చాలాచోట్ల బతుకమ్మ వేడుకలను సొంతరాష్ట్రానికి పోటీగా నిర్వహిస్తున్నారు. అమెరికాలోని తెలుగు సంస్థలు అందమైన పూలైతే వాటితో అమర్చిన బతుకమ్మ జాగృతి అని ఆమె వర్ణించేవారు.

తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతిని ఆమె అమెరికాతోపాటు మరిన్ని దేశాలకు విస్తరించాలే చేశారు. లండన్‌లో కూడా పెద్దఎత్తున బతుకమ్మ వేడుకలను నేడు నిర్వహిస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల్లో కూడా బతుకమ్మ వేడుకలను వైభవంగా జరిపించడంలో కవిత కృషి కనిపిస్తుంది.

Click here for Photogallery