అమెరికాలో 2018లో హిట్ అయిన సినిమాలివే!

23-12-2018

అమెరికాలో 2018లో హిట్ అయిన సినిమాలివే!

అమెరికాలో తెలుగు సినిమాకు మంచి మార్కెట్‌ ఉన్న విషయం తెలిసిందే. సినిమా నిర్మాతలు తమ బడ్జెట్‌ను రూపొందించుకునే ముందు ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ఎంత మార్కెట్‌ వస్తుందో అంచనా వేసుకుని సినిమాను నిర్మిస్తుంటారు. ఒక్కోసారి అంచనాలు తప్పవచ్చు. లేదా మారవచ్చు. తెలుగు సినిమాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో ఓవర్సీస్‌ కలెక్షన్‌లే ఇప్పుడు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి.

ఓవర్సీస్‌లో తెలుగు సినిమాలకు వసూలవుతున్న కలెక్షన్లు ఈ విషయాన్ని ధవపరుస్తున్నాయి. అమెరికాలో ఉన్న సినిమా అభిమానులు తమ హీరోలు, హీరోయిన్‌లకు జేజేలు పలుకుతూనే మరోవైపు ప్రతిభ ఉన్న దర్శకుల సినిమాలకు కూడా మద్దతు ఇస్తున్నారు. కొత్తదనం ఉన్న సినిమాలకు విజయాన్ని కట్టబెడుతున్నారు. 2018లో పలు తెలుగు సినిమాలు ఓవర్సిస్‌లో రిలీజయ్యాయి. అందులో పెద్ద హీరోల సినిమాలతోపాటు చిన్న హిరో సినిమాలు కూడా ఉన్నాయి. చిత్రం విజయాల విషయం పక్కనబెడితే కొన్ని సినిమాలు గణనీయమైన వసూళ్లు రాబట్టగా మరికొన్ని సినిమాలు అంచనాలను తలకిందులు చేస్తూ బోల్తా కొట్టాయి.

ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో రంగస్థలం 3.51 మిలియన్‌ డాలర్లు, భరత్‌ అనే నేను 3.42 మిలియన్‌ డాలర్లు, మహానటి 2.59 మిలియన్‌ డాలర్లు, గీత గోవిందం 2.45 మిలియన్‌ డాలర్లు, అరవింద సమేత 2.18 మిలియన్‌ డాలర్లు,  అజ్ఞాతవాసి 2.06 మిలియన్‌ డాలర్లు వసూలు చేశాయి. దీంతోపాటు  నా పేరు సూర్య, గూఢచారి, తొలిప్రేమ, భాగమతి, దేవదాస్‌,  కంచరపాలెం, టాక్సీవాలా, శైలజారెడ్డి అల్లుడు వంటి సినిమాలు ఓవర్సీస్‌లో విడుదలయినా అంచనాలను అందుకోలేకపోయాయి. గూఢచారి, తొలిప్రేమ, కేరాఫ్‌ కంచరపాలెం సినిమాలకు ఓవర్సీస్‌లో మొదటి వారంలో కలెక్షన్లు బాగానే వచ్చినా.. ఆ తర్వాత  కలెక్షన్‌లు తగ్గిపోయాయి. ఏదీ ఏమైనా 2018 సంవత్సరం ఓవర్సీస్‌లో తెలుగు సినిమాకు ఫర్వాలేదనిపించేలా నిలిచింది.