రివ్యూ : ఇది కథ కాదు జీవితం అనిపించే 'నిన్ను కోరి'

07-07-2017

రివ్యూ : ఇది కథ కాదు జీవితం అనిపించే 'నిన్ను కోరి'

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ 3.25/5

నిర్మాణం : డి వి వి ఎంటర్టైన్మెంట్స్, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా.... 
నటీనటులు : నాని, నివేత థామస్, ఆది పినిశెట్టి,  మురళి శర్మ, తనికెళ్ళ భరణి, బాలిరెడ్డి ప్రిథ్వి రాజ్ తది తరులు నటించారు.
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, సంగీతం : గోపి సుందర్
పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, అనంత శ్రీరామ్, భాస్కర బట్ల, శ్రీజో
స్క్రీన్ ప్లే : కోన వెంకట్, నిర్మాతలు : డి వి వి దానయ్య, కోన వెంకట్

కథ,మాటలు,దర్శకత్వం: శివ నిర్వాణ

విడుదల తేదీ : 07.07.2017

వరుస విజయాలతో డబల్ హ్యాట్రిక్ సాధించిన నాచురల్ స్టార్ నాని కెరీర్ జోరుగా సాగుతోంది. వరుసగా ప్రేమకథా చిత్రాలు చేస్తూ నాని యువత లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద నాని చిత్రాలు కాసుల పంట పండిస్తుండడంతో టాలీవుడ్ లో నిర్మాతలకు నాని మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. నాని నటించిన తాజాచిత్రం ‘నిన్నుకోరి’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. జెంటిల్ మాన్ చిత్రం లో నాని తో జోడి కట్టిన నివేద థామస్ మరో మారు  హీరోయిన్ గా నటించింది. హీరో ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఎప్పట్లాగే నాని నటించిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఆరు విజయాలు సొంతం చేసుకున్న నాని ఏడవ విజయం సాధించాడా లేదా సమీక్షలో లో తెలుసుకుందాం.

కథ :

పి.హెచ్.డి చేసిన  యువకుడు ఉమా మహేశ్వరరావ్ (నాని), పల్లవి (నివేతా థామస్) ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఉమాను ప్రేమిస్తుంది. ఇంతలోనే పల్లవికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు. దీంతో పల్లవి, ఉమా మహేశ్వరరావ్తో వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ ఉమా మహేశ్వరరావ్ మాత్రం లైఫ్లో సెటిలైన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కెరీర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఢిల్లీ వెళ్ళిపోతాడు. ఇంతలో పల్లవి తండ్రి (మురళి శర్మ) ఆమె మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోకుండా ఆమెకు అరుణ్ (ఆది పినిశెట్టి) తో వివాహం నిశ్చయం చేస్తాడు. పల్లవి కూడా తన ప్రేమను తండ్రికి చెప్పలేని స్థితిలో అరుణ్ ను వివాహం చేసుకుంటుంది. అలా విడిపోయిన ఉమా, పల్లవిల జీవితాలు, ఉమా మహేశ్వరరావ్ ను ప్రేమించిన పల్లవిని పెళ్లి చేసుకున్న అరుణ్ జీవితం, ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? చివరికి సుఖాంతమయ్యాయ లేదా ? అనేదే ఈ సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

ఇక సినిమాకు  ప్రధాన ప్లస్ పాయింట్ హీరో నాని. అక్కడక్కడా మంచి టైమింగ్ తో పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేసిన నాని సెకండాఫ్లోని ముఖ్యమైన ఎమోషనల్ సీన్లలో ఎక్కువ తక్కువలు లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ను కనబర్చాడు. అంతేగాక ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకున్నా ఎలాగోలా తిరిగి తనకు దక్కకపోతుందా అనే చిన్న ఆశను, స్వార్థాన్ని కలిగిన ప్రేమికుడిగా అలరించాడు. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేస్తున్న నాని ఈ చిత్రంలో కూడా నటనతో మెప్పించాడు. ప్రత్యేకంగా ఎమోషనల్ సీన్స్ లో నాని నటించిన విధానం చాలా బావుంది. నివేద థామస్, ఆది ల తోపాటు ఈ చిత్రానికి నటుడు మురళి శర్మ కూడా మేజర్ హైలైట్ గా నిలిచాడు. హీరోయిన్ నివేతా థామస్ తనకు దూరమైన ప్రేమికుడు నాశనమైపోకూడదని తపనపడే ప్రేయసిగా, తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని నోప్పించకూడదు అని ఆలోచించే భార్యగా తన నటనతో ఆకట్టుకుంది. ఇక మరొక ముఖ్యమైన పాత్ర చేసిన ఆది స్క్రిప్ట్ కు తగ్గట్టు సహజంగా నటించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముగ్గురు కథకు నేచ్యురల్ అప్పియరెన్స్ తీసుకొచ్చి సినిమాను ప్రేక్షకులకు కనెక్టయ్యేలా చేశారు. అలాగే హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన మురళి శర్మ, అతని అల్లుడిగా నటించిన పృథ్విలు మధ్య మధ్యలో నవ్విస్తూ అలరించారు. 

సాంకేతిక వర్గం :

దర్శకుడు శివ నిర్వాణ కథను క్లిస్టర్ క్లియర్ గా రాసుకోవడంతో సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కన్ఫ్యూజన్ అనేదే కలుగలేదు. ఆ కథ కూడా రొటీన్ లవ్ స్టోరీల్లా కాకుండా కొంచెం కొత్తగా, మెచ్యూర్డ్ గా ఉంది. ప్రేమించే పెళ్లి చేసుకోనక్కర్లేదు పెళ్లి చేసుకుని కూడా ప్రేమించువచ్చు, ఒకసారి ప్రేమలో విఫలమైతే జీవితం మరో  ఛాన్స్ ఇస్తుంది వంటి వాస్తవాల్ని దర్శకుడు సున్నితంగా చెప్పగలిగాడు. సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఎవరో ఒకరు త్యాగానికి పూనుకుని కథ చివర్లో కొంత బాధను మిగల్చడం పరిపాటి. కానీ ఈ సినిమా ముగింపు మాత్రం అలా కాకుండా ప్రేక్షకుడు  కూడా ఇదీ కరెక్ట్ అని ఫీల్ అయ్యేలా రచయిత కోన వెంకట్ స్క్రీన్ ప్లే వుంది. ఎడిటింగ్ లో ఎక్కడో కాస్త లోపం కనిపిస్తుంది అంటే స్లో గా కథ నడవటం వలన ఆలా అనిపించిందేమో? కార్తీక్ ఘట్టమనేని  సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో అమెరికా పరిసరాల్ని చాలా అందంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ క్రిస్టల్ క్లియర్ గా కనిపించేలా చేసి సినిమాకు రిచ్ నెస్ తీసుకొచ్చాడు.  గోపి సుందర్ మ్యూజిక్ చాలా బాగుంది 'అడిగా అడిగా' 'ఉన్నట్టుండి గుండె' పాటలు  ఈ చిత్రం లో హైలెట్ గా నిలుస్తాయి. డి. వి. వి దానయ్య, కోన వెంకట్ ల   నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

విశ్లేషణ :

ఈ చిత్రం యువతకు.. ముఖ్యంగా ‘ఏ’ సెంటర్ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉంది.‘నిన్ను కోరి’ ప్రస్తుత కాలానికి, జనరేషన్ కు తగిన మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. వాస్తవానికి దగ్గరగా ఉండే కథ, అందులోని పాత్రలు, మంచి నటన కనబర్చిన నటీనటులు, శివ నిర్వాణ స్టోరీని చెప్పిన విధానం, మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా ఎమోషన్ తగ్గిన క్లైమాక్స్, ఎక్కడా ఎగ్జైట్మెంట్ కు గురిచేసే సన్నివేశాలు లేకపోవడం, నెమ్మదైన స్క్రీన్ ప్లే, పరిణితితో ఆలోచించి అర్థం చేసుకోవలసిన కథ కావడం రెగ్యులర్ ఆడియన్సును నిరుత్సాహానికి గురిచేసే కొన్ని అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే కొంచెం నెమ్మదైన స్క్రీన్ ప్లే ను తట్టుకునే, భిన్నమైన ప్రేమ కథను చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎప్పటిలాగే నాని చిత్రాల్లో ఉండే ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రంలో కూడా ఉంది. కమర్షియల్ గా ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.