NTR Mahanayakudu Movie Review

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

బ్యానెర్లు : ఎన్ బి కె ఫిలిం, వరాహీ చలన చిత్ర, మరియు వైబ్రి మీడియా

నటి నటులు ఏ పాత్రలు పోషిస్తున్నారో చూద్దాం నందమూరి తారక రామారావు : నందమూరి బాలకృష్ణ, శ్రీమతి నందమూరి బసవ రామ తారకం : విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడు : దగ్గుబాటి రానా, నందమూరి త్రివిక్రమరావు :దగ్గుబాటి రాజా, నందమూరి హరికృష్ణ : కల్యాణ్ రామ్, నాదెండ్ల భాస్కర్ రావు  సచిన్ ఖండేకర్,  లోకేశ్వరి : పూనమ్ బజ్వా, భువనేశ్వరి : మంజిమా మోహన్, సాయి కృష్ణ : గారపాటి శ్రీనివాస్, పురంధేశ్వరి : హిమన్సీ, ఉమా మహేశ్వరి : హీరోషిని కోమలి,  దగ్గుపాటి వెంకటేశ్వరరావు : భరత్ రెడ్డి,  రూఖ్మాంగధ రావు : వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. 

సంగీతం : కీరవాణి, సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్ వి యస్
ఎడిటర్ : అర్రం రామకృష్ణ, మాటలు: సాయి మాధవ్ బుర్ర
కార్యనిర్వాహక నిర్మాత: యం ఆర్ వి ప్రసాద్
సహా నిర్మాతలు సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాతలు :నందమూరి వసుందర దేవి, నందమూరి బాలకృష్ణ 

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి

విడుదల తేదీ : 22.02.2019

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ పరాజయం కావడంతో.. రెండో భాగం ‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ చిత్రంపై వ్యాపార పరంగా ఎంతో  ప్రభావం పడింది. భారీ తారాగణం, టాప్‌ టెక్నీషియన్స్‌ ఉన్నా.. ఈ మూవీపై ఏ మాత్రం  అంచనాలు మాత్రం క్రియేట్‌  చేయలేకపోయింది. మరి తన తండ్రి చరిత్రను పరిపూర్ణంగా తీసి ఈ సినిమాతో అయినా విజయం సాధించాడో లేదో సమీక్షా లో చూద్దాం.   

కథ:

మొదటి భాగంలో చూపించని యన్‌టిఆర్‌ బాల్యం, యవ్వనం, ఇంటింటికి తిరిగి పాలు పోయడం, బసవ తారకంతో వివాహం.. ఆ తరువాత ఉద్యోగానికి రాజీనామా చేయడం, సినీ రంగప్రవేశం, మహానటుడిగా ఎదగడం, తెలుగు దేశం పార్టీ స్థాపించడం ఇవన్నీ మళ్లీ కథానాయకుడు సినిమాను గుర్తు చేస్తూ.. తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే చోట  మొదటి భాగాన్ని ముగించగా... అక్కడి నుంచే మహానాయకుడు చిత్ర కథ  మొదలవుతుంది. 

తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రామకృష్ణ స్టూడియోస్ ఫ్లోర్ లో తానే రూపొందిస్తూ.. రెండో భాగం ప్రారంభం కాగా.. ఖాకి దుస్తుల్లో  తన రాజకీయ ప్రచారం..ప్రజల్లో కి వెళ్లడం వాళ్ళ అభిమానంతో రాజకీయవేత్తగా మారడం. అత్యధిక మెజారిటీ తో  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం..తాను అనుకున్న ప్రజోపకార పథకాల్ని అమలుచేయడం...సతీమణి బసవ తారకం,  యన్‌టిఆర్‌ లు ఆరోగ్యరీత్యా అమెరికా వెళ్లిన సమయంలో...  ముఖ్యమంత్రిగా యన్‌టిఆర్‌ పేరు ప్రతిష్టలను చూసి ఓర్వలేక  నాదెండ్ల భాస్కర్‌ రావు ఘటనతో ఫస్ట్‌ హాఫ్‌ను, ముగించగా.. అమెరికా నుండి తిరిగి వచ్చి యన్‌టిఆర్‌ ఢిల్లీ వెళ్లడం.. రాష్ట్రపతిని కలవడం..జాతీయ స్థాయిలో తెలుగువాడి సత్తా చాటడం, ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎం యల్ ఏ లతో ఢిల్లీ కి తీసుకు రావడం...  మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం.. ఇక చివరగా బసవ తారకం మరణించడంతో.. యన్‌టిఆర్‌ జీవిత చరిత్రను అసంపూర్ణంగా ముగించేశారు. 

నటీనటుల హావ బావాలు:

ముందుగా ఈ సినిమాకు ప్రధాన బలం, బలగం నందమూరి బాలకృష్ణే. మహానటుడు యన్‌టిఆర్‌ పాత్రలో బాలకృష్ణ పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి యన్‌టిఆర్‌ లోని ప్రధానమైన కొన్ని హావభావాలను, బాలకృష్ణ తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను అబ్బుర పరుస్తోంది.  ముఖ్యంగా యన్‌టిఆర్‌ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాక అసెంబ్లీ  వచ్చే సన్నివేశాల్లో గానీ, అలాగే బసవతారకంగారి ఆరోగ్యం విషయంలో యన్‌టిఆర్‌ కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో గానీ బాలయ్య నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక యన్‌టిఆర్‌ సతీమణి బసవతారకం పాత్రను పోషించిన విద్యాబాలన్ అద్భుతంగా నటించి మెప్పించింది.

ముఖ్యంగా బాలకృష్ణ – విద్యాబాలన్ ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. చంద్రబాబు పాత్రలో కనిపించిన రానా,  హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్,  చిన్న సీన్ లో  అక్కినేని పాత్రలో నటించిన సుమంత్ అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకుంటారు. ప్రత్యేకం గా చెప్పాలంటే ప్రతినాయకుడిగా  నాదెండ్ల భాస్కరరావు పాత్రలో  సచిన్ ఖేడేకర్ కూడా ఆ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. అలాగే ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుగా డా.భ‌ర‌త్‌, ఎన్టీఆర్ బావ‌మ‌రిదిగా వెన్నెల కిశోర్‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

తెలుగు సినీ పరిశ్రమను ఏకైక మ‌హారాజులా కొన్ని ద‌శాబ్దాల పాటు వన్ అండ్ ఓన్లీ గా ఏలిన యన్‌టిఆర్‌, అదే విధంగా.. రాజయాలను సైతం శాసించి.. ప్రతి తెలుగు వాడి హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అంతటి మహానటుడు, మహానాయకుడు గురించి సినిమా తీసి మెప్పించడం అంటే.. మాములు విషయం కాదు. అయితే విషయం లో దర్శకుడు  క్రిష్ మాత్రం ఈ విషయంలో చాలా వరకు విజయం సాధించాడు. మొదటి భాగం కథానాయకుడు లో చిన్న చిన్న భాగాలుగా వున్నా, మహానాయకుడు చిత్రం లో చాలా జాగ్రత్త పడ్డాడు. కథ చెప్పే  విధానం లో స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు.  ముఖ్యంగా యన్‌టిఆర్‌ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, అప్పటి పరిస్థితులను చాలా ఆసక్తికరంగా చూపించాడు క్రిష్. రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అలాగే  సాయిమాధవ్ బుర్రా మాటలు బాగానే పేలాయి.

సంగీత దర్శకుడు కీరవాణితన పాటలతోనే కాకుండా, తన నేపథ్య సంగీతంతో కూడా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి గుండె లోతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఆయన కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు. అదేవిధంగా మొదటి భాగం లెన్త్ ఎక్కువని ఫీల్ అయ్యారు అందుకేనేమో రెండవ భాగం రెండు ఘంటల ఎనిమిది నిమిషాలకు కుదించారు  ఎడిటింగ్ వర్క్ బాగుంది. ఇక  నిర్మాణ సంస్థలు ఎన్ బి కె ఫిలిమ్స్. వారాహి, విబ్రి మీడియా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

ఈ చిత్రం ప్రారంభం నుండి అందరూ అనుకున్నట్లే..  యన్‌టిఆర్‌   జీవితాన్ని మొత్తం చూపించకుండా అసంపూర్తిగా వదిలేశారు. బసవతారకం పాత్రతో సినిమాను చెప్పిస్తూ.. ఆమె మరణంతో మహానాయకుడును ముగించారు. ఒక రకంగా  ఇది 'నందమూరి రామ బసవతారకం బయోపిక్' అయ్యింది.   అయితే  యన్‌టిఆర్‌  చివరి ఘట్టం మరణం వరకు చూపించకుండా ముఖ్యమంత్రి కావడం  నాదెండ్లను విలన్‌గా చూపించడం, ఢిల్లీ రాజకీయాలు, తిరిగి అధికారం చేపట్టడం వంటివి మహానాయకుడు చిత్రంతో ముగించారు.  నాదెండ్ల వ్యవహారంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించి ప్రజాస్వామ్యాన్ని,  యన్‌టిఆర్‌ ను, పార్టీని  రక్షించినట్లు..అసలు  చంద్రబాబే  హీరో అన్నట్లు చూపించారు. ఇక సినిమాలో అక్కడక్కడా భావోద్వేగాలు బాగానే పండాయి.  కీరవాణి తన నేపథ్య సంగీతంతోనే కొన్ని సన్నివేశాలు ఎలివేట్‌ చేశారు. మాటల రచయితగా సాయి మాధమ్‌ బుర్రా మరోసారి తన కలానికి పదును పెట్టారు. "దారి కొత్తదే అయినా.. ఒక్కసారి అడుగు వేశాక.. దారి మన కిందే ఉండాలిగా" లాంటి మాటలు ఆకట్టుకున్నాయి.

ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్ని బాగానే కుదిరాయి. ఆనాడు  కేవలం కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అంతమొందించడానికి స్థాపించిన తెలుగు దేశం పార్టీ, ఈనాడు చంద్ర బాబు నాయుడు అదే పార్టీని  అక్కున చేర్చుకోవడం..వంటి అంశాలను తీసుకుని ప్రేక్షకుడు రాబోయే ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఎలాంటి తీర్పు ఇస్తారో వేచిచూడాల్సిందే. ఈ సమీక్షలో ప్రస్తావించని అంశమైనా   యన్‌టిఆర్‌   మిగిలిన జీవితాన్ని కూడా తెలుసుకోవాలంటే.. ఆర్ జి వి  తీసిన లక్ష్మీస్‌  యన్‌టిఆర్‌   ను చూడాలేమో. మహానాయకుడులో నాదెండ్ల వ్యవహారం కీ రోల్‌ కాగా..  'లక్ష్మీస్‌   యన్‌టిఆర్‌ ' లో చంద్రబాబు వెన్నుపోటు అంశం కీలకం అవుతుందని తెలుస్తుంది. ఈ మూడు చిత్రాలతో తెరపై ఎన్టీఆర్‌ జీవితగాథ సంపూర్ణంగా చూసినట్టవుతుందనుకోవాలేమో...  అయితే మహానాయకుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో  నిలబడుతుందో చూడాలి.